ఎఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్
ప్రజాపక్షం / హైదరాబాద్ దేశాన్ని ఇబ్బందుల పాలుచేసే, తిరిగి బానిసత్వం వైపు తీసుకువెళ్లే కేంద్రంలోని మోడీ ప్రభుత్వ అశాస్త్రీయ విధానాలు, పరిపాలనను సహించేది లేదని ఎఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ అన్నారు. దేశ స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలకులు తీసుకువచ్చిన మూడు రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ రైతులు, కార్మిక వర్గాలు ఐక్యంగా పోరాడడంతో బ్రిటీష్ పాలకులు ఆ చట్టాలను ఉపసంహరించుకోక తప్పలేదని, ప్రస్తుతం రైతులతో పాటు కార్మికులు ఐక్యంగా పోరాడుతుండడంతో మోడీ సర్కార్ తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోక తప్పదన్నారు. కార్పొరేట్లకు మేలు చేస్తూ రైతులకు ఉరితాళ్ళు బిగించే విధంగా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటానికి కార్మికవర్గం మద్దతిస్తూ ఆ చట్టాలను ఉపసంహరించుకునే వరకు కార్మికులు, రైతులు సమాజంలోని అన్ని వర్గాలు ఐక్యంగా పోరాటం ముందుకు తీసుకుపోవాలన్నారు. మోడీ ప్రభుత్వం ముమ్మాటికీ కార్మిక, కర్షక వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. లోక్‌సభ, రాజ్యసభలో విపక్షాలు రైతు వ్య తిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేసినా, ప్రభుత్వం మొండి వైఖరితో ఆ చట్టాలకు ఆమోద ముద్రవేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. “కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చట్టాలు, కార్మిక, కర్షక పోరాటాలు” అంశంపై సదస్సు గురువారం ఎఐటియుసి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్ రెడ్డి భవన్ జరిగింది. తొలుత సభకు ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ పలుకగా, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాల్‌రాజ్ అధ్యక్ష వహించారు. సభలో అమర్‌జీత్ కౌర్ మాట్లాడుతూ విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర విద్యుత్ ఉద్యోగుల సంఘాలు, లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 3వ తేదీన దేశవ్యాపిత ఆందోళన నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు. కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రాలలో అమలు చేయకుండా పోరాటాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తేవాలన్నారు. జనవరి 26న ఢిల్లీ ఎర్ర కోట వద్ద జరిగిన సంఘటన మోడీ సర్కార్ సృష్టించిన డ్రామా అని, ఆందోళన చేస్తున్న రైతులను ఖలిస్తాన్ వాదులుగా, టెర్రరిస్టులుగా కేంద్ర మంత్రి అమిత్‌షా చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు. రైతు ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేసే కేంద్ర ప్రభుత్వ కుట్ర పూరితమైన చర్యలను సమర్ధవంతంగా ఎదుర్కొని సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. హిట్లర్, ముస్సోలిన్ సాగించిన పాలననే మోడీ కొనసాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు, విదేశీ శక్తులకు మోడీ తొత్తుగా మారి చట్టాలను తీసుకువస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వ్యవసాయరంగం పోతే దేశంలో ఆహార భద్రత లేకుండా పోతుందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్టుగా మోడీ తన పాలన సాగిస్తున్నారని, ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ పొందిన వారే మోడీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారని అన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యిందని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో మోడీ విఫలమైందని, కోవిడ్ మహమ్మారిని నియంత్రించటానికి హెల్ ఎమర్జెన్సీ ప్రకటించకుండా విపత్తు యాజమాన్య చట్టాన్ని అమలు చేయడం అర్ధరహితమని విమర్శించారు. ఆదానీ, అంబానీలకు, కార్పొరేట్ శక్తులకు భూములను దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడే, ఏదైనా రాష్ట్రాంలో సమస్యలు వచ్చినప్పుడే దేశ సరిహద్దుల్లో పుల్వామా, బాలాకోట్, గాల్వాన్ లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను విధ్వంసం చేసి ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రైవేటీకరణను మోడీ ప్రభుత్వం మరింత వేగవంతం చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం ఉపాధి కల్పించటంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, రైల్వే ఇతర రంగాల్లో ఉద్యోగ భర్తీ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ఇంతవరకు నియామక పత్రాలు అందచేయలేదని అన్నారు. విద్యారంగం సైతం ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని 63 శాతం మంది ప్రజలు వ్యతిరేకించినా 30 శాతం ఓట్లు 303 సీట్లతో మోడీ అధికారం చేపట్టారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగం పెరిగిపోయిందని ఆరోపించారు. దేశంలోని దాదాపు 20 కోట్ల మంది కార్మికులు తమ స్వస్థలాలకు దూరంగా పనిచేస్తున్నారని లాక్‌డౌన్‌లో వలస కార్మికులు, పేదలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని ఆందోళన వెలుబుచ్చారు. కోవిడ్ సందర్భంగా విరాళాలను పిఎం రీలిఫ్‌ఫండ్‌లో జమ చేయకుండా ‘పిఎం కేర్స్’ అనే సంస్థను ఏర్పాటు చేసి లూటీచేస్తున్నారని, ఆ నిధులకు లెక్కా పత్రాలు లేకుండా పోయాయని అన్నారు. వి.యస్.బోస్ మాట్లాడుతూ మోడీ తెచ్చిన చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలని అన్నారు. మోడీ ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్.బాల్‌రాజ్ మాట్లాడుతూ 44 చట్టాలను కేంద్రం 4 కోడ్‌లుగా చేసిందని ధ్వజమెత్తారు. సభకు ఎఐటియుసి కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం.డి.యూసుఫ్ వందన సమర్పణ చేశారు. వేదికపై ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు టి.నరసింహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీతారామయ్య, బి.చంద్రయ్య, కార్యదర్శులు ఎంం.నర్సింహ్మా, ఓరుగంటి యాదయ్య, కె.రాజిరెడ్డి, సురేష్ ఆశీనులుకాగా సదస్సులో ఎఐటియుసి రాష్ట్ర నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు బి.వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
మోడీ అశాస్త్రీయ పాలనను సహించం
RELATED ARTICLES