ప్రజాపక్షం/నిజామాబాద్: పసుపు బోర్డు ఏర్పాటు కోసం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ లోక్‌సభ కు ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు వేసి తమ ఉద్యమానికి పార్లమెంట్ ఎన్నికలను వినియోగించుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాజాగా బోర్డు ఏర్పాటులో ప్రధాని నరేంద్ర మోడీ నిర్లక్ష్యం వహించిన విషయాన్ని ప్రపంచానికి మరోమారు చాటేందుకు కొంద రు రైతులు వారణాసికి ప్రయాణమవుతున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనపై పోటీ చేసేందుకు జిల్లాకు చెందిన 50 మంది రైతులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి 50 మంది పసుపు రైతులు చలో వారణాసి కార్యక్రమం చేపట్టినట్టు రైతులు, పసుపు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.తిరుపతిరెడ్డి వెల్లడించారు. నరేంద్ర మోడీపై స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయనున్నట్టు తెలిపారు. తమ ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు పసుపు రైతుల సంఘం అధ్యక్షులు పికె దైవశగామణి నాయకత్వంలో కూడా నామినేషన్లు వేయనున్నట్లు వారొక ప్రకటనలో వెల్లడించారు. తమ పోరాటం కేవలం పసుపు బోర్డు సాధన కోసం మాత్రమేనని, ఏ అభ్యర్థికి, ఏ పార్టికి వ్యతిరేకం కాదన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి భారీ స్థాయిలో నామినేషన్లు వేసిన రైతులు వారణాసికి కూడా తరలి రావాలని కోరారు. ఈ నెల 29 వరకు వారణాసిలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉన్నందున రైతులు సకాలంలో బయలు దేరడానికి సిద్దమవుతున్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా రైతులు పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే సేకరించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు ఉద్యమం సాగినా రాష్ట్ర ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది.అంతేకాకుండా అరెస్టులకు పాల్పడింది. కొందర్ని జైలు పాల్జేసింది. ఇదిలా ఉండగా వారణాసి ఎన్నికల పోటితో మరోసారి నిజామాబాద్ రైతుల డిమాండ్ తెరపైకి రానుంది. నిజామాబాద్ ఎంపిగా మోడి, సంబందిత మంత్రులకు ప్రత్యక్షంగా విన్నవించడం జరిగిందని కవిత ఇటీవలి ఎన్నికల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రైతుల ఉద్యమం వారణాసిలో మోడికి ప్రత్యక్షంగా కనబడే అవకాశం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మోడీపై పోటీకి పసుపు రైతులు?
RELATED ARTICLES