కొడుకు లోకేశ్ పేరెత్తినందుకు మోడీ భార్య ప్రస్తావన
అమరావతి: గుంటూరులో ఆదివారం ఓ బహిరంగ ర్యాలీలో ‘ఫాదర్ ఆఫ్ లోకేశ్’ అని ప్రధాని మోడీ అన్నందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటరిచ్చారు. ‘మీరు మీ భార్యను దూరంగా ఉం చారు. మీకసలు కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉందా?’ అని ప్రతిదాడికి దిగారు. తాను తన కుటుంబాన్ని ప్రేమిస్తానని, గౌరవిస్తానని అన్నారు. ప్రధానికి కుటుంబం గానీ, కొడుకుగానీ లేదన్నారు. ‘మీరు నా కొడుకు గురించి ప్రస్తావించారు. నేను మీ భార్య గురించి ప్రస్తావిస్తున్నాను. ప్రజలారా, మీకు మోడీకి భార్య ఉందని తెలుసా? ఆమె పేరు జశోధాబెన్ అని తెలుసా?’ అన్నారు. విజయవాడలో బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఈ విషయం చెప్పారు. ప్రధాని మోడీ దేశాన్ని, రాజ్యాంగ సంస్థలను నాశనం చేస్తున్నారని కూడా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు దానిని స్వాగతించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు దానిని ‘తుగ్లక్ చర్య’ అని విమర్శించారు. ‘వారు రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి రూ. 2000 నోట్లను తెచ్చారు. దీంతో అవినీతి ఎలా అంతం అవుతుంది?’ అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించి ‘అన్యాయం చేసినందుకు’ నిరసనగా ఎన్‌డిఎ నుంచి టిడిపి వైదొలిగిందన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి పూర్తిగా మద్దతు లేకుండా పోయిన తరుణంలో గుంటూరులో ప్రధాని సభకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రజలను తరలించింది’ అని చంద్రబాబు ఆరోపించారు. ‘తమని మోసగించిన వారికి తెలుగు ప్రజలు బుద్ధి చెబుతారు’ అని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. గుంటూరు బహిరంగ సమావేశానికి ప్రజలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందన్న బిజెపి నాయకుల ఫిర్యాదును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. ‘గో బ్యాక్ అని మేము నినదించమంటే దాని అర్థం.. ప్రధానిగా ఉండే అర్హత మోడీకి లేదని..ఆయన తిరిగి తన గుజరాత్‌లోని స్వగ్రామానికి వెళ్లిపోవాలన్నదే’ అన్నారు.