బిజెపి ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోంది..
దేశాన్ని నాశనం చేస్తుంటే.. పులిలా తిరగబడతాం
రాహుల్‌పై వ్యాఖ్యలు సమంజసమేనా..? ఇదేనా మీ సంస్కారం?
కుక్కమూతి పిందే బిజెపి అంటూ కెసిఆర్ ధ్వజం
భువనగిరి బహిరంగ సభలో మోడీపై ఆగ్రహం
ప్రజాపక్షం / యాదాద్రి ప్రతినిధి దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందని, వ్యవసాయ బావికి మోటారు పెట్టాలంటున్న ప్రధాని మోడీని తరిమి తరిమి కొట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల బిజెపి పాలనలో దేశం సర్వనాశనమైందని కెసిఆర్ అన్నారు. దేశ రాజకీయాల్లో మొలకెత్తిన కుక్కమూతి పిందే బిజెపి అని, ఈ దరిద్రాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని అన్నారు. రైతులను అరిగోస పెట్టడానికి పిచ్చి పాలసీలు తెచ్చే ప్రయత్నం చేస్తున్న మోడీకి తెలంగాణ ఉద్యమ సెగ చూపిద్దామన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించిన టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని శనివారం మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి సిఎం ప్రారంభించారు. టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డిని కార్యాలయంలోని కుర్చిలో కూర్చోబెట్టారు. అనంతరం కొత్త కలెక్టరేట్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ బహిరంగసభలో సిఎం ప్రసంగించారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి దాదాపు ఏడాది కాలం రైతులను ఏడిపించారన్నారు. ఢిల్లీ దగ్గర రైతులను అవమానించారని, రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా చీత్రికరించే ప్రయత్నం చేశారని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కేంద్ర మంత్రి ఏకంగా రైతులు ధర్నా చేస్తుంటే వారి మీదికి కారు ఎక్కించి రైతులను చంపడం దుర్మార్గమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు భయపడి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారని, ఏకంగా ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారని కెసిఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో సొంత పైసలు పెట్టి రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తుంటే కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీని అమలు చేయాలని, రాష్ట్రంలోని ప్రతి బావి దగ్గర ఉండే మోటారుకు మీటరు పెట్టాలని కేంద్రం మెడ మీద కత్తి పెట్టి ఒత్తిడి తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఎట్టి పరిస్థితిల్లో మోటారు దగ్గర మీటరు పెట్టబోమని, మరో ఐదారేండ్లు రైతులకు ఉచిత కరెంటు, రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని స్థిరీకరించేలా చేస్తామని అన్నారు. ‘వాస్తవాలు మాట్లాడితే.. “కెసిఆర్ నీ అంతు చూస్తామ అని బెదిరిస్తుండ్రు. కానీ కెసిఆర్ ఎవ్వరికీ భయపడడు. అలా చేస్తే తెలంగాణ వచ్చేదా?” అని అన్నారు. మోడీ సిగ్గు పడాలని, దేశం ఎవ్వడి అయ్య సొత్తు కాదని.. సర్వ నాశనం చేస్తుంటే.. చేతులు మూడ్చుకుని చూస్తూ కూర్చోబోమని కెసిఆర్ తేల్చిచెప్పారు.
బిజెపి వాళ్ల లాగులు తడిసినయ్..
‘జనగామలో మాట్లాడితే.. బిజెపి వాళ్ల లాగులు తడిసినయ్. కెసిఆర్‌ను పీకీ పారేస్తం. సముద్రంలో నీటి చుక్క అంత అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు. కెసిఆర్‌ను చూసి బిజెపి ఎందుకు భయపడుతుందో చెప్పాలి’ అని కెసిఆర్ ప్రశ్నించారు.
కేంద్ర మంత్రుల అవినీతి చిట్టా నా చేతిలో..
కేంద్ర ప్రభుత్వంలో పెద్ద అవినీతి జరుగుతోందని, కేంద్ర మంత్రుల అవినీతి చిట్టా నా చేతికి వచ్చిందని సిఎం కెసిఆర్ చెప్పారు. త్వరలోనే గుంట నక్కల అవినీతిని బయటకు తీసుకొస్తామని, చాలామంది ఫోన్లు చేసి అవినీతిని బయటపెట్టాలంటూ చెబుతున్నారని కెసిఆర్ అన్నారు. దేశమంతా తిరిగి ప్రధాని మోడీ సంగతి చెబుతామన్నారు. ఇటీవలే మమతా బెనర్జీ, ఉద్దవ్ థాక్రే, స్టాలిన్ తనతో మాట్లాడారని, మోడీకి గర్వం అంత మంచిది కాదని కెసిఆర్ హితవు పలికారు.
ఎనిమిదేండ్ల పాలనలో దేశం సర్వనాశనం..
సిలీకాన్ వ్యాలీని కాశ్మీర్ వ్యాలీగా చేసిండ్రు
ఎనిమిదేండ్ల బిజెపి పాలనలో దేశం సర్వనాశనమైందని, ఏ ఒక్క రంగాన్నీ కేంద్ర ప్రభుత్వం బాగు చేయలేదని కెసిఆర్ విమర్శించారు. దేశాన్ని అభివృద్ది చేయమంటే బిజెపి మత పిచ్చిని లేపుతోందని, పొద్దున లేస్తే లాఠీ ఛార్జీలు.. లూటీ ఛార్జీలు జరిగితే.. పెట్టుబడులు ఏలా వస్తాయని కెసిఆర్ ప్రశ్నించారు.యావత్ దేశానికి తలమానికంగా ఉండే బెంగుళూరులోని సిలికాన్ వ్యాలీ ఐటీ రంగంలో మొదటి స్థానంలో ఉండేదని, కానీ నేడు దాన్ని కాశ్మీర్ వ్యాలీగా మార్చేశారని సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఏం జరుగుతుంది? ఆడపిల్లలు, పసికూనల మీద రాక్షసంగా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిత్యం నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని, పారిశ్రామిక ఉత్పత్తులు నెలనెలా పడిపోతున్నాయని కెసిఆర్ వివరించారు. దేశంలో సుమారు 16 లక్షల కంపెనీలు మూతపడ్డాయని, ఇదేనా మీ పరిపాలనకు తార్కాణం అని కేంద్ర బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇలాంటి మత విద్వేశాలు ఎవడి కడుపు నింపుతాయో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని కెసిఆర్ డిమాండ్ చేశారు.
రాజకీయంగా స్పందించి తీర్పు ఇవ్వాలి
ప్రజలంతా గమనించి రాజకీయంగా స్పందించి సరైన తీర్పు ఇవ్వాలని, లేకుంటే దేశం నాశనమైపోతుందని కెసిఆర్ అన్నారు. దేశంలో ఆకలి పెరుగుతోందని, 115 దేశాల్లో సర్వే చేస్తే.. ఇండియా 101వ స్థానంలో ఉందని, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ లాంటి దేశాలు సైతం మనకంటే బెటర్ పొజిషన్లో ఉన్నాయని, మరి బిజెపి ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ లాక్‌డౌన్ నిర్ణయం వల్ల దేశంలోని అనేకమంది రోడ్డున పడ్డారని, స్వాతంత్య్రం తర్వాత ఇలాంటి పరిస్థితులు ఒక్క మోడీ ప్రభుత్వంలోనే కనిపించాయన్నారు. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలుతాయా..? దీనికి ఏం సమాధానం చెబుతారని మోడీ సర్కార్‌ను నిలదీశారు. “మనం మేల్కోకపోతే.. చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాం. అందరం కలిసి పోరాడుదాం” అని పిలుపునిచ్చారు.
మోడీ దోస్తుల కంపెనీల నుంచి సోలార్ పవర్ కొనాలట
“గ్రీన్ పవర్ కొనాలే. ఆయన దోస్తులు.. పెట్టుబడిదారులు ఎవరో.. 30 వేల మెగావాట్ల సోలార్ పవర్ పెడుతడట.. మనం కొనాలట. నాగార్జునసాగర్, శ్రీశైలంలో ఇదే జిల్లాలో పులిచింతలకాడ మనకు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ఉంటే.. అది ఉన్నా కూడా దాన్ని బంద్ పెట్టి ఆయన తరఫున పెట్టుబడిపెట్టే షావుకార్లు ఇచ్చేదే కొనాలట. దానికి అందమైన పేరు విద్యుత్ సంస్కరణ. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే మీకు డబ్బులు ఇస్తం. లేకుంటే ఇయ్యం. ఇదీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పిచ్చెక్కి రైతులతో పెట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంగా దీన్ని ఒప్పుకుందమా? అని కెసిఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఫ్రీగానే కరెంటు ఇవ్వాలి అని జనం నినదించారు. ఇంకా సిఎం స్పందిస్తూ ఫ్రీగా కరెంటు ఇవ్వాలంటే.. మరి ఏం చేద్దాం.. నరేంద్ర మోడీని.. తరిమితిరిమి కొట్టాలి’ అంటూ పిలుపునిచ్చారు. మాకు ఇవ్వకున్నా పర్లేదు.. ఉన్నంతలో మేం ఇచ్చకుంటామంటే.. అలా ఇవ్వడానికి లేదు అంటున్నారని.. మరి కొట్లాడాలా.. ఇంట్ల పండాలా” అని కెసిఆర్ ప్రశ్నించగా సభలోని జనం “కొట్లాడాలి” అని నినాదాలిచ్చారు.
రాహుల్‌గాంధిపై కూసంస్కారంగా మాట్లాడుతారా?
‘కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బిజెపి ప్రభుత్వం సంస్కారం మరిచి మాటల దాడి చేసింది. రాహుల్ గాంధీతో నాకేం సంబంధం లేకున్నా ఆయన నాన్న, నాన్నమ్మ, తాతలు దేశం కోసం ఎంతో సేవ చేశారు. అలాంటి రాహుల్ గాంధీని పట్టుకుని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాశర్మ ‘నువ్వు ఎక్కడో పుట్టావో.. మేం అడిగామా రాహుల్ గాంధీ’ అంటూ మాట్లాడారు. ఇదేనా బిజెపి సంస్కారం..? మీకు ఏ మాత్రం సంస్కారం ఉన్నా.. అస్సామ్ ముఖ్యమంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలి’ అని కెసిఆర్ డిమాండ్ చేశారు. ఓపికకు హద్దులుంటాయి.. ఏం తమాషా చేస్తున్నారా.. దేశం నాశనమైపోతే ప్రజలు ఉరుకుంటారా..?, న్యాయంకోసం పోరాడేందుకు తెలంగాణ రాష్ట్రం పులిలా ముందుంటుందని, అది తెలంగాణ గడ్డలో ఉండే పౌరుషమని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడి,్డ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జెడ్‌పి చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి ఎంఎల్‌సిలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్యయాదవ్, ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, ఆర్.రవీంద్రకుమార్‌నాయక్, భాస్కర్‌రావు, మల్లయ్యయాదవ్, నోముల భగత్, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్, మదర్ డైరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోడీని తరిమి కొట్టాలి
RELATED ARTICLES