మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం
అక్టోబర్ 21న పోలింగ్, 24న ఓట్ల లెక్కింపు
18 రాష్ట్రాల్లో 64 అసెంబ్లీ, ఒక లోక్‌స్థానానికి ఉప ఎన్నికలు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 21న రెండు రాష్ట్రాల్లోనూ ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల తేదీలను శనివారం ఎన్నికల కమిషన్ (ఇసి) ప్రకటించింది. వీటితో పాటు దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ నియో-కవర్గంలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కూడా ఇసి పేర్కొంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లోనూ ఓట్ల లెక్కింపును అక్టోబర్ 24న చేపట్టనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునిల్ అరోరా మీడియా సమావేశంలో వివరించారు. ఆయా రాష్ట్రాల్లో శనివారం నుంచే మోడల్ కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ కాలం నవంబర్ 9వ తేదీతో ముగియనుండగా, 90 సీట్లు ఉన్న హర్యానా శాసనసభ కాలం నవంబర్ 2వ తేదీతో పూర్తికానుంది. కాగా, ఈ రెండు అసెంబ్లీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 27న విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అక్టోబర్ 4 నామినేషన్లకు చివరి తేదీ. 5వ తేదీన నామినేషన్ల పరిశీలన కాగా, 7వ తేదీన ఉపసంహరణకు చివరి గడువు. ఏకకాల ఎన్నికలపై యావత్ దేశం చర్చించుకుంటున్న నేపథ్యంలో మహారాష్ట్ర, హర్యానాతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎందుకు ప్రకటించలేదని విలేకరులు ప్రశ్నించగా, సునిల్ అరోరా స్పందిస్తూ జార్ఖండ్ అసెంబ్లీ కాలం జనవరి 9తో ముగియనుందని చెప్పారు. ఒకవేళ సభానాయకుడు అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే ఆ విషయం మరో లా ఉండేదని చెప్పారు. అసెంబ్లీ కాలం జనవరి 9 వరకు ఉందని, అలాంటప్పుడు ఎన్నికలను ముందుగా నిర్వహించాల్సిన అవసరం ఎన్నికల కమిషన్‌కు ఏముందని అరోరా ఎదురు ప్రశ్నించారు. ఏకకాల ఎన్నికలకు సంబంధించి చర్చపై ఆయన స్పందిస్తూ ఈ అంశంపై రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయం ఉంటే తప్ప దానిని ఒక నమూనాగా తీసుకోలేమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పష్టం చేశారు. పేపర్ ట్రయల్ యంత్రాలను ప్రస్తావిస్తూ లోక్‌సభ ఎన్నికల తరహాలోనే అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇవిఎం) పనితీరును పరిశీలించేందుకు మహారాష్ట్ర, హర్యానాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన ఐదు పోలీంగ్ స్టేషన్లలో వివిప్యాట్ స్లిప్పులను కూడా తప్పనిసరిగా లెక్కించాలని ఆదేశాలు జారీ చేశామని సునిల్ అరోరా పేర్కొన్నారు. ఇవిఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినా కూడా అవి తప్పుడు ఓటును రికార్డు చేయవని ఆయన పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి అఖండ విజయం సాధించి కేంద్రంలో రెండవసారి అధికారాన్ని చేపట్టిన తరువాత మొదటిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు విభజిస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం తదితరాల వంటిని బిజెపి ప్రధాన అంశాలు కానున్నాయి. అయితే మహారాష్ట్ర, హర్యానాలో మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాను బిజెపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, మహారాష్ట్రలో బిజెపి, శివసేనల మధ్య పొత్తులు ఇంకా కొలక్కి రాలేదు. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలుకొనసాగుతున్నాయి.గత అసెం బ్లీ ఎన్నికల్లో బిజెపి 122 స్థానాల్లో విజయం సాధించగా, శివసేన 63 సీట్లలో గెలుపొందింది. ఎన్నికల తరువాతం రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
64 అసెంబ్లీ, ఒక లోక్‌స్థానానికి ఉప ఎన్నికలు
దేశంలోని 18 రాష్ట్రాల్లో 64 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గంలో కూడా అక్టోబర్ 21వ తేదీనే ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ స్థానాల్లో ఓట్ల లెక్కింపును కూడా అక్టోబర్ 24వ తేదీనే చేపట్టనున్నట్లు వెల్లడించింది. కాగా, 64 అసెంబ్లీ సీట్లతో పాటు బీహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉప జరిగే అసెంబ్లీ స్థానాలు కర్నాటకలో 15 ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో 11 ఉన్నాయి. కర్నాటకలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు ఇటీవల అనర్హతవేటు పడిన సిట్టింగ్ ఎంఎల్‌ఎల స్థానాల్లోనూ ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సునిల్ అరోరా స్పష్టం చేశారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగే 11 స్థానాల్లో ఎంపిలుగా గెలుపొంది శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సీట్లే అధికంగా ఉన్నాయి. బీహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో లోక్ జనశక్తి పార్టీ సిట్టింగ్ ఎంపి రామ్‌చంద్ర పాశ్వాన్ జులైలో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. సతార ఎంపిగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉదయన్‌రాజె భోస్లే ఇటీవల రాజీనామా చేశారని, ఆ స్థానంలో మాత్రం అక్టోబర్ 21న ఉప ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. అదే విధంగా పశ్చి మ బెంగాల్‌లో దుర్గా పూజ ఉత్సవాలను నిర్వహిస్తున్నందున ఉప ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనగా, అక్కడ కూడా ఉప ఎన్నికలు నిర్వహించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా అరోరా స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున ఆ రాష్ట్రంలో కూడా ఉప ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన చెప్పారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరిలోని ఒక్కొ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా అసోంలో 4, బీహార్‌లో 5, గుజరాత్‌లో 4, హిమాచల్ ప్రదేశ్‌లో 2, కేరళలో 5, పంజాబ్‌లో 4, రాజస్థాన్, తమిళనాడులో రెండేసి స్థానాలకు, సిక్కింలో మూడు అసెంబ్లీ సీట్లలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు అరోరా వెల్లడించారు. లోక్‌సభ ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.
మోగిన నగారా
RELATED ARTICLES