న్యూఢిల్లీ: సెల్‌ఫోన్ ధరలకు రెక్కలు రాబోతున్నాయి. జిఎస్‌టి రూపంలో మొబైల్స్‌కు షాక్ తగిలింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ (జిఎస్‌టి కౌన్సిల్) తాజాగా మొబైల్ ఫోన్లపై జిఎస్‌టి పెంపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన శనివారం నాటి జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో మొబైల్ ఫోన్లపై జిఎస్‌టి రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని నిర్ణయించింది. కొత్తగా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారందరికీ ఇది ఊహించని పరిణామం. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వీటిపై 5 శాతం. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. విమానాల నిర్వహణ (ఎంఆర్‌ఓ) సేవలపై జిఎస్‌టిని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించగా, చేతితో తయారు చేసిన, యంత్రాలతో తయారు చేసిన మ్యాచ్‌స్టిక్‌లపై పన్ను రేటును 12 శాతంగా వుంచింది. మరోవైపు రూ. 2 కోట్ల రూపాయల లోపు టర్నోవర్ ఉన్న సంస్థల 2018 ఆర్థిక సంస్థకు కోసం వార్షిక రిటర్నులపై ఆలస్య రుసుమును మాఫీ చేసింది. అలాగే 2020 జూన్ 30 వరకు జిఎస్‌టిఆర్ 9, జిఎస్‌టిఆర్ 9 సి దాఖలు చేయడానికి గడువును పొడిగించింది. అలాగే రూ.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులకు దాఖలు చేయడం తప్పనిసరి. అంతకుముందు గడువు మార్చి 31 వరకు మాత్రమే. అలాగే టర్నోవర్ పరిమితి రూ .2 కోట్లు. 2021 జనవరి నాటికి జిఎస్‌టి నెట్‌వర్క్‌లోని సమస్యల్ని పరిష్కరిస్తామని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని కౌన్సిల్‌కి తెలిపారు. ఇందుకోసం ఒక నిర్దిష్ట దశల వారీ రోడ్‌మ్యాప్‌తో (చైనా హార్డ్‌వేర్ ద్వారా) వ్యవస్థను సరిదిద్దాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ నిర్ణయం అటు వినియోగదారులతోపాటు, స్థానిక ఉత్పత్తిదారులకు కూడా హానికరమని మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ సంస్థ ఆర్థిక మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయి 12 శాతం నుండి మొబైల్ ఫోన్ల జీఎస్టీ రేటు పెరుగుదలకు ఇది సరైన సమయం కాదని విమర్శించింది. మొబైల్ ఫోన్‌లు, విబి భాగాలు ఇన్‌పుట్‌లపై జిఎస్‌టిఎన్ ద్వారా ఇబ్బందుల్లో పడిన సంస్థపై, తాజా జిఎస్‌టి పెంపు విచిత్రమైన చర్య అని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. ఫెర్టిలైజర్స్, ఫుట్‌వేర్ వంటి వాటిపై కూడా జిఎస్‌టి పెంపు ప్రతిపాదనలపై చర్చ జరగ్గా, ప్రస్తుత ఆర్థిక మందగమనం,కరోనా వైరస్ ప్రభావంతో, ఎరువులు, పాదరక్షలు, వస్త్రాలపై రేట్ల పెంపు ప్రతిపాదనను కౌన్సిల్ వాయిదా వేసింది.