వామపక్షాల ఉమ్మడి పిలుపు
న్యూఢిల్లీ : ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై మే 25 నుండి 31వ తేదీ వరకూ దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలకు వామపక్షాలు ఉమ్మడి పిలుపు ఇచ్చాయి. ఐదు వామపక్షాల జాతీయ నాయకులు ఆదివారంనాడు ఈ మేరకు ఢిల్లీలో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఎన్నడూలేనిరీతిలో పెరుగుతూ పరుగులు తీస్తున్న ధరల పెరుగుదలతో సామాన్య, పేద ప్రజానీకంపై కేంద్ర ప్రభుత్వం అనూహ్యమైన భారం మోపుతోందని, కోట్లాదిమంది పేదలు తీవ్రమైన దారిద్య్రంలోకి జారిపోయి అష్టకష్టాలకు గురవుతున్నారని, రోజురోజుకూ పెరుగుతున్న ఆకలి విషకోరలు జాస్తోందని వామపక్షాలు సంయుక్త ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఇక దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయి ప్రధానమైన సమస్యగా ముందుకు వచ్చిందని దీనివల్ల ప్రజల సమస్యలు మరింతగా పెరిగిపోయాయని భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవవ్రత విశ్వాస్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, సిపిఐ (మార్కిస్ట్ లిబరేషన్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. “దేశంలో పెట్రోలు, డీజిలుపై అన్ని రకాల సర్ ఛార్జీలు, సుంకాలను ఉపసంహరించాలి, పెంచిన ధరలు తగ్గించాలి, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా గోధుమ సరఫరాలను పునరుద్ధరించాలి, దేశవ్యాప్తంగా ప్రభుత్వ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి, ముఖ్యంగా పప్పుదినుసులు, వంటనూనెలతో సహా అన్ని నిత్యావసర వస్తువులను పిడిఎస్ విధానం ద్వారా సరఫరా చేయాలి, ఆదాయపన్ను చెల్లించని అన్ని కుటుంబాలకు నేరుగా వారి ఖాతాలకు ప్రతి నెలా ఇచ్చే నగదు ప్రత్యక్ష బదిలీని రూ.7,500 రూపాయలకు పెంచాలి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ
ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) కేటాయింపులు పెంచాలి, నిరుద్యోగ భృతి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని చట్టరూపంలో అమలు చేయాలి, పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథనాన్ని చట్టరూపంలో తీసుకువచ్చి అమలు చేయాలి, దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలి” అని వామపక్షాలు తమ సంయుక్త ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మే 25 నుండి 31 వరకూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు వామపక్షాలు పిలుపు ఇచ్చాయి. అన్ని రాష్ట్రాలలోనూ ఉన్న వామపక్షాల పార్టీ శాఖలు ఈ నిరసన ఉద్యమంలో భాగంగా సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని, ఐక్యంగా పోరాడాలని, ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిరుద్యోగ భృతి, ఖాళీ ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా పప్పు దినుసులు, వంటనూనెల సరఫరా వంటి అంశాలను నినాదాలుగా తీసుకుని ఉద్యమంలో పాల్గొనాలని ఐదుపార్టీల జాతీయ నాయకులు పార్టీ శ్రేణులకు ఉమ్మడి పిలుపు ఇచ్చాయి. దేశంలో ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని, ఉపేక్షభావంతో చూస్తోందని డి.రాజా, సీతారామ్ ఏచూరి ప్రభృతులు విమర్శించారు. గడచిన ఏడాదికాలంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 70 శాతం మేరకు పెరిగాయని, కూరగాయల ధరలు 20 శాతం పెరిగాయని, వంటనూనెల ధరలు 23 శాతం పెరిగాయని, పప్పు దినుసుల ధరలు 8 శాతం మేరకు పెరిగితే, గోధుమ ధరలు 14 శాతం పైగా పెరిగిపోయిందని, దీంతో గోధుమలు అందుబాటులో లేని పరిస్థితి వచ్చిందని వామపక్షాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గోధుమ సేకరణ కూడా గణనీయంగా క్షీణించిందని, గత ఏడాదిలో చేసిన సేకరణ కంటే సగానికి సగం గోధుమలు మాత్రమే సేకరించిందని విమర్శించారు. ఈ ఏడాది ప్రస్తుత సీజనులో20 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ సేకరించే అవకాశం కనిపించడం లేదని, అయితే లక్ష్యం మాత్రం 44.4 మెట్రిక్ టన్నులుగా కేంద్రం నిర్దేశించుకుందని విమర్శించారు. వదలకుండా నిత్యం అదేపనిగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, వంటగ్యాస్ ధరలు పెంచడం, గోధుమ కొరత వంటి సమస్యల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరిగిపోయిందని, ఇది ఊహకు అందడం లేదని, మరోవైపు బొగ్గు కొరత దేశంలో ఏర్పడటంతో విద్యుత్ సంక్షోభం కూడా దేశాన్ని పట్టిపీడిస్తోందని, విద్యుత్ సరఫరా ధరలు అనూహ్యంగా పెరిగిపోవడానికి కారణమయ్యాయని వారు విమర్శించారు. ఇలాంటి అనూహ్యమైన సంక్షుభిత పరిసస్థితుల్లో పెట్రోలియం ఉత్పత్తులపై అన్ని రకాల సర్ చార్జీలు, సుంకాలను తక్షణం ఉపసంహరించాలని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని,