ప్రజాపక్షం / హైదరాబాద్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల ఫలితాల తర్వాత టిఆర్‌ఎస్ దోస్తీకి సంకట స్థితి ఏర్పడింది. ఏనాడూ మజ్లిస్‌తో టిఆర్‌ఎస్ ప్రత్యక్షంగా ఎన్నికల సర్దుబాట్లు చేసుకోనప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య జగమెరిగిన రహస్యం. పరస్పర సహకారం ఇరు పార్టీలకు రాజకీయం గా లాభించిందన్న భావన కన్నా, తమ వల్లనే ప్రయోజనం పొందారని మజ్లిస్, తమతోనే లాభం పొందారని అధికార టిఆర్‌ఎస్ పరస్పర యోచనలో ఉన్నాయి. పైగా ఎన్నికల సందర్భంలో అంతకుముందు, ఆ తర్వాత మజ్లిస్ నాయకులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు, కారు స్టీరింగ్ తమ చేతుల్లో ఉందని చెప్పిన మాటలు టిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆగ్రహానికి గురయ్యా యి. మరోవైపు బిజెపి మతతత్వ పార్టీ అని విమర్శిస్తున్నపుడు మరి మజ్లిస్ కాదా అన్న ప్రశ్న కూడా పార్టీ అభిమానుల నుండి ఎదురవుతోందని బాహాటంగానే టిఆర్‌ఎస్ నాయకులు వెల్లడిస్తున్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరుత్సాహంలో ముంచడం, ఓటర్లు అధికార టిఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీని ఇవ్వకుండా పెద్ద పార్టీగా తీర్పునివ్వడంతో మేయర్ ఎన్నికపై టిఆర్‌ఎస్ అధినాయకత్వం తలపట్టుకున్నది. మొత్తం 150 మంది కార్పొరేటర్లకు గాను టిఆర్‌ఎస్‌కు మేయర్ పదవి దక్కడానికి 76 స్థానాలు అవసరం కాగా, 56 మాత్రమే లభించాయి. ఫలితంగా మజ్లిస్ మీద లేదా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి టిఆర్‌ఎస్‌కు నెలకొన్నది. బిజెపి సహకారం కోరే అవకాశం ఇప్పట్లో టిఆర్‌ఎస్ కు లేదు. మజ్లిస్ మీద ఆధారపడడం అంటే మరో మతోన్మాద పార్టీని చేరదీయడమే అవుతుంది. పార్టీ శ్రేణుల్లో, అభిమానుల్లో నిరసనకు గురయ్యే అవకాశంఉంటుంది. మజ్లిస్‌ను ఇప్పటికే తలకెక్కించుకున్నామన్న భావన ఎలాగూ వుంది. కాదు, పార్టీకి సంబంధించిన ఎక్స్ అఫీషియో సభ్యుల (శాసనసభ్యులు,లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు) సహకారం స్వీకరిస్తే ప్రజా తీర్పుకు భిన్నంగా ఉన్నందున విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సంక్లిష్ట పరిస్థితి నుండి రాజకీయ ప్రయోజనం సాధించడం ఎలా అన్న దానిపై టిఆర్‌ఎస్ దృష్టిసారించింది. ఒక దెబ్బకు రెండు పిట్టల మాదిరిగా పూర్తి మెజారిటీ లేనందున ఫిబ్రవరి 11న జరిగే మేయర్ ఎన్నికల్లో పార్టీ పక్షాన నామినేషన్ వేయకపోవడమే మేలనే ప్రతిపాదనపై అది మొగ్గుచూపుతున్నది. దానివల్ల మరో మతతత్వ పార్టీ మజ్లిస్‌తో జత కట్టడం లేదన్న సందేశం, పార్టీకి చెందిన ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారాన్ని వినియోగించుకోకపోవడం వల్ల మహానగర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించినట్లు అవుతుందని టిఆర్‌ఎస్ భావిస్తున్నది. బిజెపికి లభించిన 48 సీట్లలో ఒకరు ఆకస్మికంగా మరణించడంతో దాని బలం 47కు తగ్గింది. మజ్లిస్‌కు 44 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఉన్నాయి. ఒకవేళ బిజెపి 47 స్థానాలతో, మజ్లిస్ 44 స్థానాలతో మేయర్ పదవికి నామినేషన్లు వేసినా, బలపరీక్షలో ఓటమి తప్పదు, లేదా రెండు మతోన్మాద పార్టీలుగా బిజెపి ఏకమైతే టిఆర్‌ఎస్ లక్ష్యం నెరవేరినట్లే. ఇక టిఆర్‌ఎస్‌కు మేయర్ పదవి లేనందున వచ్చే నష్టం ఏమీ లేదు. అధికార పగ్గాలు ఎలాగూ తమ చేతిలోనే ఉన్నందున రాజకీయ నిజాయితీని ప్రదర్శించ తలపెట్టింది. ఫిబ్రవరి 11న ఎవరు నామినేషన్ దాఖలు చేయని పక్షంలో మేయర్ ఎన్నిక మరికొన్ని మాసాలు వాయిదా పడక తప్పదు.
మేయర్ ఎన్నిక వాయిదా పడుతుందా?
RELATED ARTICLES