లక్షలాది మంది జయజయధ్వానాలతో గద్దెపై సమ్మక్క
గాలిలోకి తుపాకీతో మూడు రౌండ్లు పేల్చిన ఎస్‌పి సంగ్రామ్‌సింగ్
కలెక్టర్ కర్ణన్ ఆహ్వానంతో మేడారానికి సమ్మక్క
మేడారంలో ఉప్పొంగిన భక్తి పారవశ్యం
సమ్మక్కకు ఒడిబియ్యం, సారే, పసుపు, కుంకుమ
వనం వీడి జనంలోకి వచ్చిన సమ్మక్క
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో : మేడారంలో గురువారం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షలాది మంది భక్తుల జయ జయ ద్యానాల మద్య తల్లి సమ్మక్కను మేడారంలో గద్దె పై ప్రతిష్టించారు. జిల్లా కలెక్టర్ కర్ణన్ ఆహ్వానంతో మేడారం కు కదిలిన సమ్మక్కకు దారి పొడవునా జనం ప్రణమిల్లారు. సమ్మక్క ప్రధాన పూజారితో లక్షలాదిగా వెంట నడిచిన భక్తజనం మేడారంలోని గద్దెల వరకూ చేరుగున్నారు. దీంతో మే డారంలో గురువారం రాత్రి మహాఅద్భుతం ఆవిష్కరణ జరిగింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క జాతరలో సమ్మక్క ఆగమనం అధ్యంతం ఉద్విగ్నభరితంగా కొనసాగింది. సమ్మక్కను చిలకలగట్టు నుండి మేడారం గద్దెపైకి చేర్చడానికి ప్రధాన పూజారులు గురువారం ఉదయం 3 గంటల నుండే పూజలు చేసే ప్రధాన ఘట్టాన్ని చేపట్టారు. చిలకలగట్టు వద్ద ఉన్న సమ్మక్క దగ్గరికి వెళ్లిన పూజారి చీర, సారే, పసుపు, కుంకుమ ను ఇచ్చి కంకవనాన్ని తీసుకొని గద్దెకు చేర్చారు. మధ్యాహ్నం వరకు మొదటి ఘట్టం పూర్తిచేసుకున్న ప్రధాన పూజారులు సమ్మక్కను గద్దెకు చేర్చే ప్రధాన ఘట్టం పూజను సాయంత్రం 5 గంటలకు మొదలుపెట్టారు. సమ్మక్క రాక కోసం మేడారం లో ఉన్న భక్త కోటి జనం లక్షలాదిగా చిలకలగట్టు ప్రాంతాని కి చేరుకున్నారు. సమ్మక్కను ఆహ్వానించడానికి ప్రభుత్వ పరంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ కర్ణన్, ఎస్‌పి సంగ్రామ్‌సింగ్‌లు చిలకలగట్టు గుడి వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 6.30 వర కు చిలకలగట్టుపై పూజలు చేసిన ప్రధాన పూజారి సమ్మక్క కుంకుమ భరిణి, ముక్కుపోగు కమ్మలతో సమ్మక్కను తీసుకొ ని గుట్ట దిగాడు. అక్కడే ప్రధాన పూజారి కోసం వేచి చూస్తున్న సహచర పూజారులు ప్రధాన పూజారికి చుట్టూ రక్షణ వలయంగా నిలిచారు. ఆయనకు మరో వలయంగా ఆదివాసీ తుడుందెబ్బ యూత్ వలయాన్ని కట్టింది. పోలీస్ శాఖ రోప్‌వే ప్రధాన పూజారుల చుట్టూ వలయాకారంలో రక్షణ కల్పించిం ది. చిలకలగట్టుకు సమ్మక్క రాక కోసం లక్షలాదిగా వచ్చిన భక్తజనం సమ్మక్క ప్రధాన పూజారిని తాకడం కోసం ప్రయత్నాలు చేశారు. పోలీసులు భారీగా మోహరించి ఉండడంతో భక్తులెవరిని దగ్గరకు రానివ్వడం లేదు. సమ్మక్కను గద్దెకు తీసుకెళ్లడానికి ప్రభుత్వ లాంఛనాలను అధికారులు ప్రారంభించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ కర్ణన్ సమ్మక్కకు ఆహ్వానం పలుక గా ఎస్‌పి సంగ్రామ్‌సింగ్ గాలిలోకి ఎకె 47తో మూడుసార్లు కాల్పులు కాల్చి సమ్మక్క వనప్రవేశాన్ని వీడారు. అక్కడి నుండి ప్రారంభమైన సమ్మక్క మహా ర్యాలీ మేడారంవైపు కదిలింది. అడుగడుగునా భక్తులు పొర్లుదండాలతో కోళ్లు, మేకలతో ఎదురొస్తూ జంతుబలిని చేస్తున్నారు. రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి సమ్మక్కను తీసుకొస్తున్నారు. మేడారం గుడి ప్రాంగణానికి చేరుకోగానే లక్షలాది మంది సమ్మక్కకు ఎదురొచ్చారు. పోలీసులు వారిని నియంత్రించడానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అదే సమయంలో ఎవరికి తెలియకుండా సమ్మక్కను ప్రత్యేక రోప్ పార్టీలతో గుడిలో కి ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. ప్రధాన పూజారులతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి గుడిలోకి అడుగుపెట్టారు. సమ్మక్క రాక కోసం గుడి పూజారులు అధికార యంత్రాంగం సమ్మక్క గద్దెను శుద్ధి చేసి తల్లిని ఆహ్వానించారు. జయజయధ్వానాల మధ్య సమ్మక్క తల్లిని అధికారులు గద్దెకు చేర్చారు. గద్దెకు చేర్చే సమయంలో ప్రధాన పూజారులను మినహా మరెవరిని లోనికి అనుమతించలేదు. సమ్మక్కను చిలకలగట్టు నుం డి ముస్తాబు చేసి తీసుకొచ్చే ముందు ప్రధాన పూజారి చేసిన పూజలు రహస్యంగానే ఉంచారు. అదే పద్ధతిలో సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించినప్పుడు కూడా పూర్తిస్థాయిలో వస్త్రాన్ని కప్పి ప్రధాన పూజారి తీసుకొచ్చిన కుంకుమభరిణి, ఒడిబియ్యాన్ని గద్దెపై ప్రతిష్టించారు. పూజారి చేసిన పూజల తంత్రమేందో ఎవరికి కూడా తెలియకుండా రహస్యంగానే ఉంచారు.