ఇఎస్‌ఐ కుంభకోణంలో మరో మలుపు
హెచ్‌ఐవి కిట్స్‌లో రూ.1.76 కోట్లు గోల్‌మాల్
హైదరాబాద్ : ఇఎస్‌ఐలో చోటు చేసుకున్న భారీ కుంభకోణం లో ఎసిబి అధికారుల విచారణలో మరో అవినీతి బట్టబయలైంది. ఈ స్కామ్‌లో మందులు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్‌ఐవి మెడికల్ కిట్స్‌లో కూడా అవినీతి అక్రమాలు జరిగాయని ఎసిబి విచారణలో బయట పడింది. ఈ కిట్స్ కొనుగోళ్లలో రూ.1.76 కోట్లు చేతులు మారాయని ఎసిబి అధికారులు తేల్చారు. ఇఎస్‌ఐ డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్.దేవికారాణితో పాటు మరికొంత మంది సిబ్బంది హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఎసిబి సోదాల్లో లభించిన హెచ్‌ఐవి మెడికల్ కిట్స్‌కు సంబంధించి 22 ఇండెట్లు లభించాయి. ఇందులో కేవలం రెండు ఇండెట్లను మాత్రమే దర్యాప్తు అధికారులు పరిశీలించగా రూ.1.76 కోట్ల గోల్‌మాల్ వెలుగు చూసింది. దేవికారాణి, ఇఎస్‌ఐ ఉద్యోగులు కలిసి హెచ్‌ఐవి మెడికల్ కిట్స్‌లో ఈ డబ్బులను దోచుకున్నారని ఎసిబి అధికారులు కోర్టుకు తెలిపారు. గత నెల 26న ఎసిబి అధికారులు ఇఎస్‌ఐ డైరెక్టర్ కార్యాలయం, ఇల్లుతో పాటు 23 ప్రాంతాలలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడులలో ఎసిబి అధికారులకు కీలక సమాచారంతో పాటు పత్రాలు లభించాయి. హెచ్‌ఐవి మెడికల్ కిట్స్ ధరలను పెంచి ఇండెట్లు తయారు చేశారని గుర్తించారు. దేవికారాణికి బినామీలుగా ఉన్న ఫార్మా కంపెనీల ద్వారానే ఈ మెడికల్స్ కిట్స్ కొనుగోలు చేశారు. కిట్స్ కొనుగోళ్లలో ధరలను అమాంతంగా పెంచేసి ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు. మార్కెట్లో తక్కువ ధరలకు కిట్స్ లభిస్తుండగా అందుకు నాలుగింతలు ధరలను పెంచి ఇండెట్లు రూపొందించి, నిధులను డ్రా చేసి కాజేశారని తేలింది. దోచుకున్న నిధులను డైరెక్టర్‌తో పాటు ఉద్యోగులు వాటాల వారీగా ఇఎస్‌ఐ డైరెక్టర్‌తో పాటు కింది స్థాయి ద్యోగులు సైతం చేతులు తడిపారని తెలిసింది. అలాగే డైరెక్టర్ కార్యాలయాల్లో ఉండాల్సిన ఇండెట్లు పైవేటు ఆసుపత్రులు, మెడికల్ ఎజెన్సీ కార్యాలయాలు, ఫార్మా కంపెనీలలో లభించడంపై ఎసిబి అధికారులు విస్మయం చెందారు. ఇఎస్‌ఐ అధికారులు, సిబ్బంది, ప్రైవేటు ఆసుపత్రులు, ఫార్మా కంపెనీల యజమానులు కుమ్మకై ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని ఎసిబి అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేయగా మరో పదిహేను మంది అనుమానితులపై నిఘా పెట్టారు.
మెడికల్ కిట్స్ మింగేశారు!
RELATED ARTICLES