జైపూర్: రాజస్థాన్‌లో 15 నియోజకవర్గాల్లో నోటా అధిక ప్రభావం చూపించింది. ఈ నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్థులు సాధించిన మెజార్టీ ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు ఓట్లు పడడం వల్ల దాదాపు ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బిజెపి గెలుపు అవకాశాలను కోల్పోయినట్లయ్యింది. మాలవీయ నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆరోగ్య మంత్రి కాళిచరణ్ 1704ఓట్ల తేడాతో విజయం సాధించారు. అక్కడ నోటాకు 2371 ఓట్లు పడ్డాయి. అసింద్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి జబ్బార్ సింగ్ కేవలం 154ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. ఇక్కడ నోటాకు 2943ఓట్లు పోలవడం గమనార్హం. మార్వార్ జంక్షన్ సీటులో స్వతంత్ర అభ్యర్థి.. బిజెపి తరఫున పోటీ చేసిన వ్యక్తిని 251ఓట్ల తేడాతో ఓడించారు. అక్కడ నోటా మీటను 2719 మంది నొక్కారు. మరో నియోజకవర్గం పిలిబంగలో బిజెపి అభ్యర్థి ధర్మేంద్ర కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిపై 278ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 2441. ఇంకా పలు చోట్ల ఇలాంటి పరిస్థితే నెలకొంది. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 99, దాని మిత్రపక్షమైన ఆర్ఎల్‌డీ ఒక చోట, బిజెపి 73, బిఎస్‌పి 6, సిపిఎం 2, స్వతంత్ర అభ్యర్థులు 13, ఇతర పార్టీలు 5చోట్ల గెలుపొందారు.
మెజార్టీ కంటే నోటా ఓట్లే ఎక్కువ
RELATED ARTICLES