అమెరికాలో ఒక్కరోజే 1900 మంది మృతి
192 దేశాల్లో 15 లక్షలకు చేరువలో కరోనా బాధితులు
వాషింగ్టన్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని తీవ్ర భయోత్పానికి గురిచేసింది. నియంత్రణ చర్యలు చేపట్టినా కరోనా వైరస్ మాత్రం దూసుకుపోతున్నది. తాజాగా కరోనా మహమ్మారి ప్రతాపానికి ప్రపంచవ్యాప్తంగా 14,50,415 మంది ప్రభావితులయ్యారు. వారిలో ఇప్పటివరకు 83,507 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కొవిడ్ 19కు అమెరికా విలవిల్లాడిపోతోంది. మంగళవారానికి అక్కడ మృతుల సంఖ్య 12,857 దాటింది. మంగళవారం ఒక్కరోజే 1,900 మరణాలు సంభవించడం ఆ దేశాన్ని ఠారెత్తిస్తోంది. ఆ తర్వాత బుధవారం ఉదయానికి మరో 500 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు అమెరికాలో 4,00,549 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 21,711 మంది కోలుకోగా.. 12,878 మంది మరణించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడుతున్నప్పటికీ, ఆయన ప్రకటనలు కనీసం అమెరికా ప్రజల్లో ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. కాకపోతే, పరిస్థితులు గతంలో ఉన్నంత విషమంగా లేవని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం అంచనా వేసిన స్థాయిలో మరణాలు ఉండకపోవచ్చునని ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించారు. లక్ష నుంచి రెండు లక్షల మందిని మహమ్మారిని బలిగొనే అవకాశం ఉందని ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తన ప్రకటనను సవరించిన ఆయన గతంలో అంచనా వేసిన కంటే మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉండనుందని అభిప్రాయపడ్డారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,400 మంది మృతిచెందారు. 1,38,000 కేసులు నమోదయ్యాయి. పక్కనే ఉన్న న్యూజెర్సీలో 44,416 మందికి వైరస్ సోకగా.. 1,200 మంది మృత్యువాతపడ్డారు. వచ్చే వారంలో ఈ గణాంకాలు మరింత ఆందోళనకర స్థాయికి చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, సామాజిక దూరం వంటి నిబంధనల్ని కచ్చితంగా అమలుచేస్తే మరణాల సంఖ్యను భారీగా తగ్గించొచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికాలో వైరస్ కట్టడికి పటిష్ఠమైన చర్యలు చేపడతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 97 శాతం జనాభా ప్రభుత్వ నిబంధనల పరిధిలో ఉన్నారు. రంగంలో దిగిన సైన్యం అవసరమైన చోట తాత్కాలిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తోంది. కాగా, స్పెయిన్‌లో ఇప్పటివరకు 1,46,690 మంది కరోనా బారిన పడగా, వారిలో 14,555 మంది మరణించారు. కొత్తగా ఆ దేశంలో మరో 5 వేల కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 1,35,586 కేసులు నమోదుకాగా, వారిలో 17,127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో కేసుల సంఖ్య లక్ష దాటిపోగా, వారిలో 10,328 మంది కరోనా మింగేసింది. ఆ తదుపరి స్థానంలో బ్రిటన్ నిలిచింది. బ్రిటన్‌లో 55,242 కేసులు నమోదుకాగా, 6,159 మంది చనిపోయారు. ఇక ఇరాన్‌లో 3,993 మంది, బెల్జియంలో 2,240 మంది, నెదర్లాండ్స్‌లో 2,248 మంది, జర్మనీలో 2,096 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో మృతుల సంఖ్య 3,333తో ఆగిపోయింది. ఇతర దేశాల్లోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నది. మృతుల సంఖ్య కూడా ఆ స్థాయిలోనే పెరుగుతోంది.