ఆక్రమణల తొలగింపులో ఇండ్లు కోల్పోయినవారికి కేటాయింపు
ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రగతిభవన్‌లో జిహెచ్‌ఎంసి పరిధి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో మంత్రి కెటిఆర్ భేటీ
ప్రజాపక్షం/హైదరాబాద్ మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిహెచ్‌ఎంసి పరిధిలోని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు గురువారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివద్ధి అంశాలపై ఎంఎల్‌ఎలతో కెటిఆర్ చర్చించారు. మూసీ పరిధిలోని పేదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించారు. మూసీ పరిధిలో ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఆక్రమణల తొలగింపులో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని ఎంఎల్‌ఎలు ఏకగ్రీవంగా మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సుమారు 10 వేల ఇండ్లను కేటాయించాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. ఈ క్రమంలో మూసీలో ఆక్రమణలు తొలగించాక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి పనులపై ప్రాథమిక విచారణ పూర్తయింది. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేపట్టిన ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని, గతంలో కురిసిన భారీ వర్షాలకు వరద చేరి మునిగిపోయిన అనేక ప్రాంతాలు, ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసినా వరద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయని తెలిపారు.
మూసీలో అక్రమణలు తొలగించి, అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి..
రాష్ర్ట ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లలో 10 వేలకు పైగా ఇండ్లను మూసీ నది ఒడ్డున దుర్భర పరిస్ధితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించి, మూసీపైన కబ్జాలను తొలగించేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రిని ఎంఎల్‌ఎలు కోరారు. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా స్వయంగా ఎంఎల్‌ఎల నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన పట్ల మంత్రి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం మూసీ నదిని అడ్డుగా ఉన్న అక్రమణల నుంచి విముక్తం చేసేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గుర్తించిన మూసీ నదిలో నివాసం ఉంటున్న పేద ప్రజలను, అక్కడి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయిస్తుందన్నారు. అత్యంత పేదరికంతో మూసీ నది పక్కన దుర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్న వీరందరికీ డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల రూపంలో గొప్ప ఉపశమనం కలుగుతుందన్నారు. దీంతోపాటు మూసీ నది వరద నివారణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు ఈ అక్రమణల బెడద కూడా తగ్గుతుందన్నారు. మూసీ వెంట వరదకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను తొలగించి, మూసీని బలోపేతం చేస్తామని తెలిపారు. మూసీ అడ్డంకులు తొలగిన తర్వతా మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివద్ది కోసం ప్రాథమిక ప్లానింగ్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.