అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదు
ప్రధాని మోడీకి బహిరంగ లేఖలో ప్రముఖుల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: మైనారిటీలు, దళితులపై జరిగే మూక దాడి హత్యలను వెంటనే ఆపాలని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధానికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ‘అసమ్మతి లేని ప్రజాస్వామ్యం కూడా ఉండదు’ అన్నారు. సినీ నిర్మాతలు శ్యామ్ బెంగాల్, అపర్నాసేన్, గాయని శుభా ముద్గల్, చరిత్రకారుడు రామచంద్రన్ గుహా సహా 49 మంది ప్రముఖులు ఈ బహిరంగ లేఖ రాశారు. వారు ఇంకా ‘జై శ్రీరామ్’ను ‘రెచ్చగొట్టే యుద్ధ నినాదంగా’ మార్చారని పేర్కొన్నారు. జులై 23న రాసిన లేఖలో వారు ‘మన దేశంలో ఇటీవల జరుగుతున్న విధారక ఘటనలకు శాంతికాముకులమైన మేము కలత చెందుతున్నాం’ అని రాశారు. ‘ప్రధానిగారు, మీరు పార్లమెంటులో మూకదాడి హత్యలను విమర్శించారు. కానీ అది సరిపోదు. ఆ దాడులకు పాల్పడిన వారి పై మీరెలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి’ అన్నారు. ‘మెజారిటీ వర్గీయులకు రామ్ అనేది పవిత్రమైన నామస్మరణ. అలాంటి పవిత్ర నామా న్ని అపవిత్రం చేయడాన్ని మానండి’ అని పేర్కొన్నారు. ‘అసమ్మతి లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. అసమ్మతి చాటే ప్రజలపై జాతి వ్యతిరేకులు, అర్బన్ నక్సలైట్లు అన్న ముద్రవేయకండి’ అని కూడా తెలిపారు. ప్రముఖుల ఈ బహిరంగ లేఖపై బెంగాలీ సినీ ప్రముఖుడు సౌమిత్రో ఛటర్జీ, దక్షిణాది నటి రేవతి, సామాజిక కార్యకర్త బినాయక్ సేన్, సామాజికవేత్త ఆశిస్ నంది వంటి ప్రముఖులు కూడా సంతకాలు చేశారు.