భారత్, ఆస్ట్రేలియా ఎలెవన్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా ఎలెవన్ మధ్య జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్స్ సత్తా చాటగా.. బౌలర్లు మాత్రం తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాట్స్‌మన్లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత జట్టు 358 పరుగులు చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత బ్యాట్స్‌మన్లు ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కెఎల్. రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం (62; 98 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో రాణించాడు. మురళీ విజయ్‌తో కలిసి తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించాడు. రాహుల్ ఔటైన తర్వాత విజయ్ చెలరేగి ఆడాడు. ఆసీస్ బౌలర్లపై ఎదరుదాడికి దిగిన విజయ్ బౌండరీల వర్షం కురిపించాడు. ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ జాక్ కార్డర్ వేసిన ఒక ఓవర్‌లోనే 26 పరుగులు పిండుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన మురళీ విజయ్ ఈ ఓవర్లో (3ఫోర్లు, 2సిక్స్)లతో మొత్తం 26 పరుగులు చేశాడు. అంతకుముందు 74 పరుగులతో ఉన్న విజయ్ ఈ ఓవర్లోనే సెంచరీ ఫీట్‌ను అందుకోవడం విశేషం. తర్వాత కూడా అదే జోరును కొనసాగించిన విజయ్ వేగంగా పరుగులు సాధించాడు. మ్యాచ్ ముగిసే కొద్ది సేపుముందు విజయ్ డానియల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన మురళీ విజయ్ 132 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 129 పరుగులు చేశాడు. మరోవైపు హనుమా విహారి (15) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 43.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఆసీస్ గడ్డపై బ్యాటింగ్ చేయడం అంత సులువుకాదు. కానీ, భారత బ్యాట్స్‌మన్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా రాణించారు. ఇది భారత్‌కు శుభసూచికమే.. అంతకుముందు 356/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు 544 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్లు నెల్సన్ (170 బంతుల్లో 100), హార్డి (141 బంతుల్లో 86) పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో ఫాలిన్స్ (43), రొబిన్స్ (38 నాటౌట్), కోల్‌మాన్ (36) పరుగులతో రాణించడంతో ఆసీస్ జట్టు భారీ పరుగులు సాధించింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్, ఇషాంత్, కోహ్లీ, బుమ్రాలకు తలొవికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున 10 మంది బౌలింగ్ చేశారు. మరోవైపు మొదటి సారిగా బౌలింగ్ చేసిన కెప్టెన్ కోహ్లీ తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కూడా రెండో ఇన్నింగ్స్‌లో 211/2 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే డ్రాగా ముగిసింది.
మురళీ విజయ్ శతకం
RELATED ARTICLES