- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ తమ చరిత్రగా చెప్పుకునేందుకు కుట్రలు
- వాటిని తిప్పి కొడుతూ అసలు చరిత్రను భావితరాలకు అందించే బాధ్యత కమ్యూనిస్టులదే
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు సభలో వక్తలు
రజకార్లు, కమ్యూనిస్టులు ఏకమయ్యారని బిజెపి పచ్చి అబద్ధాన్ని చెబుతోంది. నాడు రజాకార్లకైనా, భారత యూనియన్ సైన్యాలకైనా బద్ధ శత్రువు కమ్యూనిస్టులే. వారితో కమ్యూనిస్టులు ఎలా కలిశారు?
సాయుధ పోరాటాన్ని స్మరిస్తూ విలీన దినోత్సవం పేరుతో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఎందుకు జంకుతున్నారు?
చరిత్ర అనేది మానవ సమాజ ప్రయోగశాల. తద్వారానే భవిష్యత్‌కు పునాదులు వేసుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మహత్తర చరిత్రను వక్రీకరించడమంటే భవిష్యత్ తరాలకు నాటి ప్రజా ఉద్యమ చైతన్యాన్ని దూరం చేయడమే.
-వక్తలు
ప్రజాపక్షం/హైదరాబాద్
తమకంటూ ఏ చరిత్ర లేని పార్టీలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ తమ చరిత్రగా చెప్పుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని పలువురు వక్తలు ధ్వజమెత్తారు. ఈ కుట్రలను తిప్పి కొడుతూ అసలు చరిత్రను భావితరాలకు అందించే బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. చరిత్రను ఎవరో వక్రీకరించినంత మాత్రాన చెరిగిపోదని, నాడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ముమ్మాటికి విలీనమే జరిగిందని వ్యక్తలు స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు సభ శనివారం బంజారాహిల్స్‌లోని అమరవీరుల స్మారక ట్రస్ట్ భవనం రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకట రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య వక్తలుగా ప్రొఫెసర్ జి.హరగోపాల్, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ హాజరయ్యారు. అమరవీరుల ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కందిమళ్ల ప్రతాప రెడ్డి, సభ్యులు ఉజ్జిని రత్నాకర్ రావు, సిపిఐ జాతీయ కార్యవర్గసభ్యులు చాడ వెంకట రెడ్డి, పశ్యపద్మ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, ఎన్.బాలమల్లేష్, కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఈటి.నరసింహ, కళవేణ శంకర్, ఎం.బాలనర్సింహ తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. సభలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవాల పేరుతో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న బిజెపి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు కమ్యూనిస్టుల సారథ్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర అనేది మానవ సమాజ ప్రయోగశాల అని, తద్వారానే భవిష్యత్ కోసం పునాదులు వేసుకునేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మహాత్తర చరిత్రను వక్రీకరించడమంటే భవిష్యత్ తరాలకు నాటి ప్రజా ఉద్యమ చైతన్యాన్ని దూరం చేయడమే అన్నారు. కె.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గానీ, స్వాతంత్య్ర జాతీయోధ్యమంలో గానీ భాగస్వామ్యం, ఏ చరిత్ర లేని బిజెపి తెలంగాణ విమోచనం అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను, మితవాద కాంగ్రెస్ నాయకులను అడ్డం పెట్టుకుని జాతీయోద్యమ చరిత్రను దొంగలించి తమ చరిత్రగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ద్వారా రాజకీయంగా బలపడిన బిజెపి, 2014లో కేంద్రంలో తాము అధికారంలో వచ్చిన తర్వాత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నభావన కల్పించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. బిజెపి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బిజెపి చేస్తున్న వక్రీకరణను తిప్పికొట్టడంలో కమ్యూనిస్టులు మరింత క్రీయశీలకం కావాలని, అందుకు అసలు పోరాటం ఎవరిపై ఎందుకు జరిగిందో, ఎవరిని ఎవరు చంపారో ప్రజలకు తెలియజేసే విధంగా కార్యాచరణతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కాశీం రజ్వీ స్థాపించిన ఎంఐఎం పార్టీ అధినేతగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిందని స్పష్టం చేయగా, బిజెపి మాత్రం హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజకార్లు, కమ్యూనిస్టులు ఏకమయ్యారని పచ్చి అబ్దదాన్ని బిజెపి చెబుతోందని, నాడు రజాకార్లకైనా, భారత యూనియన్ సైన్యాలకైనా బద్ద శత్రువు కమ్యూనిస్టులేనని, వారితో కమ్యూనిస్టులు ఎలా కలిశారని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న సిఎం కెసిఆర్ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ‘సమైక్య దినోత్సవం’ పేరుతో ఎందుకు నిర్వహించారో ఆయనకే తెలియాలన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు వ్యక్తిగతంగా గుర్తిస్తూ సముచిత గౌరవం కల్పిస్తున్నప్పటికీ ఈ పోరాటానికి మార్గదర్శి అయిన కమ్యూనిస్టు పార్టీ పేరును ఉచ్చరించడానికే భయపడుతోందన్నారు. ఎర్రజెండాను చూడగానే తనకు పేదలు గుర్తుకు వస్తారనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదే ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్మరిస్తూ విలీన దినోత్సవం పేరుతో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఎందుకు జంకుతున్నారో, ఆ దినోత్సవానికి ‘ప్రజా పాలన’ అని పేరు ఎందుకు పెట్టారో అర్థంకావడంలేదన్నారు. చరిత్రను చరిత్రగా చెప్పాలని వచ్చే ఏడాది నుంచి భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైందని చట్టబద్దంగా పొందుపర్చాలని, అదే పేరుతో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలని సాంబశివరావు కోరారు. పశ్య పద్మ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట స్ఫూర్తితోనే దేశ రైతాంగం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా ఉద్యమాలను సాగించి కేంద్రం మెడలు వంచారన్నారు. కందిమళ్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేదిలేదని నిజాం ప్రకటించిన నేపథ్యంలో కమ్యూనిస్టులు ఆధ్వర్యంలో సాయుధ పోరాటం చేపట్టడం ద్వారానే విలీనానికి నాంది పలికిందని, ఇది అసలు చరిత్ర అని అన్నారు. పల్లా వెంకటరెడ్డి అధ్యక్షోపాన్యాసం చేస్తూ పేరు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విలీన దినోత్సవం రోజున అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడం స్వాగతిస్తున్నామన్నారు. అయితే ప్రజా పాలన పేరు పెట్టడం వెనుక ఉన్న సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన మాత్రం అర్థం కాలేదన్నారు. భారత స్వాతంత్య్రం నాటికి దేశంలో 550పైగా సంస్థానాలుంటే ఇందులో మిగిలిన 549 సంస్థానాలు విలీనమయ్యాయని బిజెపి చెబుతుందని, మరి హైదరాబాద్ (తెలంగాణ ప్రాంతం) ఒక్క సంస్థానాన్ని విమోచనం అని ఎందుకు అంటుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత్ దేశంలో విలీనం తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఓచరిత్రే అన్నారు. విలీనంతో సాయుధ పోరాటం ఆగిపోలేదని, నిజాం పాలనలో కుచ్చు టోపీలు పెట్టుకున్న వారే విలీనం తర్వాత ఖద్దరు టోపి ధరించి మళ్లీ ప్రజల భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే దీనిని అడ్డుకునేందుకు 1951 వరకు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వర్గపోరాటం కొనసాగిందని గుర్తు చేశారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వేదికపై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులు వేదికపై ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆట పాట’ కార్యక్రమంలో నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను స్మరిస్తూ ఆలాపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి.