బడ్జెట్‌పై కేంద్రం పునరాలోచన చేయాలి
- ప్రజలు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేర్చాలి
- కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తే ఊరుకోం
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
- కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల నిరసన
ప్రజాపక్షం/భద్రాచలం/హనుమకొండ: కేంద్రప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ముమ్మాటికీ ప్రజావ్యతిరేకంగా ఉందని, ఇది పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. వామపక్షాల జాతీయస్థాయి పిలుపులో భాగంగా బుధవారం సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా, మాస్‌లైన్ పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శనగా నినాదాలు చేస్తూ బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ వామపక్ష పార్టీలు ప్రతిపాదించిన ప్రజల ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ఆమోదించి బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నారు. కార్పొరేట్లకు, సంపన్న వర్గాలకు మేలుచేసే పద్దును ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. రైతులు,
కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. పద్దుల్లో విద్యా, వైద్య రంగాలను నిర్వీర్యం చేశారని, సామాన్యులు, పేదలకు, వెనుకబడిన వర్గాలను కేంద్రం విస్మరించిందని, పద్దతిలేని ఈ బడ్జెట్‌ను మార్చాలన్నదే వామపక్షాల ప్రధాన డిమాండ్ అన్నారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులకు రాయితీలు కల్పిస్తూ పేదలపై పన్నుల భారాన్ని మోపారని మండిపడ్డారు. కేంద్రానికి వస్తున్న రాబడిలో 95 శాతం పేదల కష్టార్జితమేనని, సంపన్నులు చెల్లించేది 3 శాతం మాత్రమే అన్నారు. దేశంలో ఉన్న 200 మంది శతకోటీశ్వరులపై నాలుగు శాతం సంపద పన్ను విధించాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర హామీ ఇవ్వాలని, బీమా రంగంలో ఎస్‌డిఐని పూర్తిగా విరమించుకోవాలని, ప్రైవేటీకరణకు స్వస్తి పలకాలని అన్నారు. ఉపాధిహామి పథకానికి నిధులు పెంచాలని, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు రద్దు చేయాలని, కార్మికులు, పేదలు, వ్యవసాయం, విద్యా, వైద్యం వంటి రంగాలకు కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో మార్పులు చేయకుంటే వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గౌని నాగేశ్వరరావు, ఎన్‌డి చంద్రన్న వర్గం జిల్లా నాయకులు కందగట్ల సురేందర్, ఎన్‌డి మాస్‌లైన్ జిల్లా నాయులు పి సతీష్ ఈ ఆందోళనను ఉద్దేశించి మాట్లాడారు.
చేతికి సంకెళ్లతో వినూత్న నిరసన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణా పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షపై బుధవారం హనుమకొండ అంబేద్కర్ సెంటర్‌లో వామపక్ష పార్టీల చేతికి సంకెళ్లతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అధ్యక్షత వహించగా తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణపట్ల సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఎపి పునర్విభజన చట్టం అమలును బిజెపి నిర్లక్ష్యం చేసిందని, నిర్లక్ష్యానికి గురైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులోని తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించలేదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్‌లో మరోసారి తెలంగాణాకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. అన్యాయంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్.జ్యోతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, మునిగాల బిక్షపతి,కొట్టెపాక రవి, రాసమల్ల దీనా, బత్తిని సదానందం,మాలోతు శంకర్ నాయక్, సుదర్శన్,మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి,రొంటాల రమేష్ దేవా, కామెర వెంకటరమణ, గుంటి రాజేందర్, నిమ్మల మనోహర్, సిపిఎం జిల్లా నాయకులు ఎస్. వాసుదేవ రెడ్డి, ఎం. చుక్కయ్య,బొట్ల చక్రపాణి, వీరన్న నాయక్,జి.రాములు,సాంబయ్య, ఆర్‌ఎస్పీ జిల్లా నాయకులు కె. శివాజీ తదితరులు పాల్గొన్నారు.