ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్,
ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెగ్యులరైజ్ చేసే వరకు కనీస వేతనాల చట్టాన్ని అనురిస్తూ కనీస వేతనం రూ.24 వేలు ఇవ్వాలన్నారు. దీర్ఘాకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవనం వద్ద శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో యూసుఫ్, బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నేటికి జిఓ 4 ప్రకారం అనేక మున్సిపాల్టీలలో కార్మికులకు 11వ పిఆర్‌సి విడుదలై సుమారు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏరియర్స్ చెల్లించలేదన్నారు. మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ఏరియర్స్ చెల్లించేందుకు అసెంబ్లీ సమావేశాల్లో సిఎం కెసిఆర్ ప్రకటన చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్ కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీల్లో చాలిచాలని వేతనాలు పొందుతున్న మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, స్థానిక సంస్థల నుండి కార్మికులకు జీతాలు చెల్లించే విధానం రద్దుచేసి, రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు వెంటనే ఇఎస్‌ఐ గుర్తింపు కార్డులు ఇవ్వాలి : వి.ఎస్.బోస్
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎఐటియుసి సీనియర్ నాయకులు వి.ఎస్. బోసు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు ఇ.ఎస్.ఐ గుర్తింపు కార్డులు లేక అనారోగ్య సమస్యలపరిష్కారం కోసం కార్మిక కుటుంబాలు అనేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇ.ఎస్.ఐ గుర్తింపు కార్డులు అందించాలని, పి.ఎఫ్ చెల్లింపులు సంక్రమంగా జరిపించాలన్నారు. కార్పొరేషన్‌లలో, మున్సిపాల్టీల్లో, పురపాలక సంఘాల్లో పెరుగుతున్న జనభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని, కెసిఆర్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎఐటియుసి రాష్ట్ర డిప్యూటి జనరల్ సెక్రటరీ ఎం.నర్సింహా మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ప్రభుత్వ ఉద్యోగ సిబ్బందికి 11వ పి.ఆర్.సి కాల పరిమితి పూర్తయిందని, వెంటనే 12వ పి.ఆర్.సి విడుదల చేయాలన్నారు. మున్సిపల్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులు కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రయోజనాల కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన కార్మికుల సర్వీసులను కెసిఆర్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికుల ధర్నాకు ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్ పావణి మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలి : ఏసురత్నం, మందా వెంకట్వేశ్వర్లు
ఎఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఏసురత్నం, కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు స్థానిక సంస్థల నుండి వేతనాలు ఇచ్చే విధానం రద్దుచేసి, ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులకు బడ్జెట్ కేటాయించి, కార్మికులకు ఏరియర్స్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ కార్మికులకు ఇ.ఎస్.ఐ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పి.ఎఫ్ చెల్లింపులు సంక్రమంగా జరిపించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ సంస్థల్లో కార్మికులతో గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలన్నారు. 60 సంవత్సరాలు పూర్తయిన కార్మికులను తొలగిస్తే, కార్మికులు సూచించిన వారికే పని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన మున్సిపల్ కార్మికులకు రూ. 15 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. వెంకటయ్య, కె. రవిచంద్ర, కె.జయచంద్ర, పి. నర్సింగరావు, కోశాధికారి బొడ్డుపల్లి కిషన్, రాష్ట్ర సమితి సభ్యులు ముడి మార్టిన్, వి. జయపాల్ రెడ్డి, సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.ఎన్. శేఖర్, చర్లపల్లి రాములు, నాయకులు లక్ష్మమమ్మ, సుశీల, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, భూమేష్, సతీష్, టి.ఆనంద్, సాయిలు, నర్సమ్మ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల సర్వీసులు రెగ్యులరైజ్ చేయాలి
RELATED ARTICLES