సుపరి పాలనకు అది అనివార్యం : సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్
ప్రజాపక్షం / హైదరాబాద్: గ్రామాలు, పట్టణాల గుణాత్మక అభివృద్ధిలో పం చాయితీరాజ్ మున్సిపల్ చట్టాల పటిష్ట అమలు కీలకమని, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం ఉన్న చట్టాలను సవరించుకుంటూ మరిం త పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం వున్నదని, తద్వారా ప్రజలకు గ్రామాలు మున్సిపాలిటీ స్థాయిల్లో సుపరిపాలన అందించగలుగుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రంలో పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు తెస్తున్న సనూతన పంచాయితీరాజ్ చట్టం అమలు కోసం కార్యాచరణ, నూతన మున్సిపాలిటీ చట్టం రూపకల్పనపై సమీక్షా సమావేశం సోమవారం ప్రగతిభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఎ ఆరూరు రమేశ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, భూపాల్‌రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమీషనర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంచాయితీరాజ్ చట్టాన్ని పటిష్టంగా రూపొందించిన పద్ధతిలోనే, అవినీతి రహితంగా పాలన అందే విధంగా, ప్రజలకు మేలు జరిగేవిధంగా మున్సిపల్ చట్టం రూపకల్పన చేయాలన్నారు. నూతన పంచాయితీ రాజ్ చట్టానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. “మనం మనుసు పెట్టి పనిచేస్తే గ్రామాలు మున్సిపాలిటీ స్థాయిల్లో కావాల్సినంత పని వున్నది. ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ పని వొదిలి ఇంకెక్కడనో వున్నట్టు నేల విడిచి సాము చేయవద్దు. విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పననుంచి గ్రామాల్లో పచ్చదనం పరిశ్రుభ్రతతో పాటు ఇతర మౌలిక రంగాల అభివృద్ధి చేపట్టాల్సిన బాధ్యత మన మీదున్నది. మున్సిపాలిటీలు దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు మేలయిన పాలన అందించవలసిన విషయాన్ని మనం గమనించాలి. ఇందుకు సంబంధించిన చట్టం అమలు విషయంలో అటు ప్రభుత్వ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా బాధ్యులను చేస్తూ పకడ్బందీగా మున్సిపల్ చట్టాన్ని రూపొందించాలి. మున్సిపల్ చట్టాన్ని ఎంత మెరుగ్గా రూపొందించగలుగుతే ప్రజలకు అంత గొప్పగా సేవలందించగలుగుతాం” అని ముఖ్యమంత్రి అన్నారు.