పారదర్శకంగా నిర్వహించండి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అఖిలపక్షం వినతి
హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అఖిలపక్షం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. చాడ వెంకట్‌రెడ్డి (సిపిఐ), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (తెలుగుదేశం), ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశర్ రావు (తెలంగాణ జనసమితి), వినోద్‌రెడ్డి (కాంగ్రెస్), పద్మ (సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి) తదితరులతో కూడిన అఖిలపక్ష బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించా రు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా మున్సిపల్ చట్టాన్ని తెచ్చి త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని, అసెంబ్లీలో ఆమోదించిన మున్సిపల్ బిల్లును గవర్నర్ తిప్పిపంపడంతో సవరణలతో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని విమర్శించారు. ఎన్నికల నిర్వహణ తేదీలు, వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనివని వారన్నారు. ఎన్నికల నిర్వహణపై కమిషనర్ తన అధికారాలను ఉపయోగించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలను పారదర్శకంగా చేపట్టి అన్ని విషయాలను సంపూర్ణంగా, న్యాయబద్ధంగా ఏర్పాటు చేసి అనువైన తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ అధికార విధుల్లో జోక్యం చేసుకునే విధంగా మున్సిపల్ చట్టాన్ని తయారు చేసి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలు తమ వారికి లబ్ధి చేకూర్చే విధంగా చేపట్టాలని చూస్తోందని విమర్శించారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ గందరగోళంగా చేపట్టారంటూ అనేక మంది కోర్టులో కేసు వేయడంతో ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించవద్దంటూ కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా తయారీలో అనేక తప్పిదాలు జరిగాయంటూ కోర్టుకు వెళ్ళడంతో ఎన్నికల నిర్వహణకు కోర్టు 5 నెలల సమయం ఇచ్చినా హడావుడిగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలని కోరినట్లు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. హడావుడిగా ఎన్నికలు తొందరపాటుగా నిర్వహించడం సరికాదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వార్డుల విభజన, ఎన్నికల జాబితా సవరణ శాస్త్రీయంగా జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అధికారాలను హరించి వేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రతినిధుల హక్కులను హరించేలా 73,74 రాజ్యాంగ సవరణలకు భిన్నంగా ఆదరాబాదరాగా చట్టాన్ని తెచ్చారని ధ్వజమెత్తారు. 37 మున్సిపాలిటీలు కోర్టుకు వెళ్ళాయని తెలిపారు. ఎన్నికల కమిషన్ తన అధికారాలను ఉపయోగించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరినట్లు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఎన్నికలను శాస్త్రీయంగా నిర్వహించాలని కోరినట్లు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి నేత పద్మ తెలిపారు. మున్సిపల్ చట్టం అమలు జరిగితే అధికార దుర్వినియోగం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికలైనా
RELATED ARTICLES