HomeNewsBreaking Newsముఠా నాయకుడిలా అమిత్‌ షా..

ముఠా నాయకుడిలా అమిత్‌ షా..

తెలంగాణకు ఏమి చేస్తారో చెప్పకుండా బండి సంజయ్‌ గురించి బాధా?
ముస్లిం రిజర్వేషన్‌ రద్దు చేస్తామని విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్‌… మతం ఆధారంగా కల్పించలేదు
సిపిఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం / హైదరాబాద్‌
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఒక ముఠా నాయకుడిలా వచ్చినట్లుగా ఉన్నదని, తన ముఠాలో ఎవరికి ఇబ్బంది కలిగినా ఊరుకోబోననే తరహాలో మాట్లాడారని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి తెలంగాణకు ఉన్న సమస్యలు, అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి చెప్పకుండా, బండి సంజయ్‌ అరెస్టు చేస్తే తనకు నిద్ర కూడా పట్టలేదని, హృదయం తల్లడిల్లిపోయిందంటూ ఒక ముఠా నాయకుడు, ఫ్యాక్షనిస్టు తరహాలో మాట్లాడారని మండిపడ్డారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్‌ రద్దు చేస్తామని అన్నారని, అసలు రాష్ర్టంలో ముస్లింలకు మతం ఆధారంగా కాకుండా అందులోని పేద కులాలలో ఉన్న వారికే సామాజిక, ఆర్థిక వెనుబాటుతనం ఆధారంగా రిజర్వేషన్‌ కల్పించారనే విషయాన్ని ఆయన పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ మఖ్దూంభవన్‌లో సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మతో కలిసి సోమవారం ఏర్పాటు మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. బండి సంజయ్‌ వ్యవహారం, ముస్లిం రిజర్వేషన్‌ రద్దు చేస్తామని చెప్పేందుకే అమిత్‌ షా తెలంగాణకు వచ్చి పోయినట్లుందని ఎద్దేవా చేశారు. ముస్లిం రిజర్వేషన్‌ రద్దు చేసి ఎస్‌సి, ఎస్‌టి, బిసిల రిజర్వేషన్‌ పెంచుతామని అమిత్‌ షా అన్నారని, ఆయనకు నిజంగా హిందువుల్లో పేదలపై చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్‌ ఉన్న 50 శాతం పరిమితిని ఎందుకు పెంచడం లేదని నిలదీశారు. ఎస్‌టి రిజర్వేషన్‌ ఆరు నుండి పది శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభ పంపిన తీర్మానాన్ని ఏళ్ల తరబడి కేంద్ర ప్రభుత్వం ఎందు కు నాన్చుతోందని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్‌ రద్దు చేసి బిసి రిజర్వేషన్‌ పెంచుతామని చెబుతున్న అమిత్‌ షా, రిజర్వేషన్‌ ఆధారమైన బిసి జనగణన చేయించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పిండం లేదన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు రానున్నందునే హిందూ, ముస్లిం పేరుతో ఓట్లలో చీలిక తీసుకువచ్చే విధం గా అమిత్‌ షా మాట్లాడారని అన్నారు. నిజంగానే హిందూవులపైన ప్రేమ ఉంటే, వివేకానంద ఏం చెప్పారో చదవాలని, అలాగే శివాజీ సైన్యంలో ఎంత మంది ముస్లింలు ఉన్నారో తెలుసుకోవాలని బిజెపికి నేతలకు ఆయన సూచించారు. రాజకీయాల కోసం మతాన్ని ఉపయోగించుకోవడం దుర్మార్గమన్నారు. కుర్చీని, అధికారాన్ని వ్యతిరేకించేవారిపైన సిబిఐతో దాడులు చేయిస్తారని అన్నారు
నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రపంచ ఖ్యాతి పొందిన అమర్య్తసేన్‌ పై కక్ష
అమర్య్తసేన్‌ భూ వివాదంలో స్థలాన్ని ఖాళీ చేయించాని ఆదేశించారని, పుల్వామా దాడికి సంబంధించి భద్రాతా లోపాలు, గోవాలో జరిగిన అవినీతిని ప్రస్తావించిన జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌పై కక్షకట్టి సిబిఐ దాడులు మొదలు పెట్టారని విమర్శించారు. మతపరమైన హత్యలకు సంబంధించి ఎలాంటి కేసులనైనా నమోదు చేసినప్పటికీ, ఆ శిక్ష వేసిన న్యాయస్థానాన్ని ప్రభావితం చేసి వారి శిక్షలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దు చేయిస్తోందని విమర్శించారు. దేశ న్యాయవ్యవస్థను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకున్నదన్నారు. బండి సంజయ్‌ అద్భుతంగా పోరాటం చేశారని, కార్యర్తలకు అన్యాయం చేస్తే ఊరుకోబోనని, సినిమా డైలాగులు కొట్టిన అమిత్‌ షా బిజెపి కార్యకర్తలే మనుషులా?, మిగతా వారు మనుషులు కాదా,మిగతావారిని చంపేస్తారా అని ప్రశ్నించారు. తమకు ఇష్టం లేని వారు హిందూవు మతానికి చెందినవారినైనా చంపినా పర్వాలేదని మండిపడ్డారు. ప్రశ్నించిన నేరానికి గౌరీ లంకేష్‌, కల్బర్గి, పన్సారే వంటి మేధావులను చంపితే ఒక్క మాట మాట్లాడని అమిత్‌ షా, బండి సంజయ్‌ అరెస్టు పట్ల తీవ్రమైన విచారణ వెలబుచ్చడం విచిత్రమని పేర్కొన్నారు. ప్రధాని విద్యార్హతపై కేసు వేసిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ రూ.25వేల జరిమానా విధించారని, న్యాయవ్యస్థను కూడా చెరబట్టారని ధ్వజమెత్తారు. బిజెపి అధికారంలోనికి రాగానే అమిత్‌ షా పై నమోదైన కేసులను కూడా రద్దు చేశారని గుర్తు చేశారు. కర్నాకటలో బిజెపి అధికారంలోనికి వచ్చిన తర్వాత బిజెపి కార్యకర్తలపై ఉన్న 347 కేసులు తీసేశారన్నారు. మరోవైపు న్యాయవ్యవస్థను కూడా బిజెపి ప్రభుత్వం చెరబట్టిందని, ఇందుకు బిల్కిస్‌ బానో మానభంగ నేరస్తులను విడుదల చేయడంతో పాటు, తాజాగా గుజరాత్‌ నరోడాలో జరిగి మారణ కాండకు బాధ్యులైన గుజరాత్‌ మాజీ మంత్రి కోద్నానీ, బజరంగ్‌ దళ్‌ నాయకుడిని విడుదల చేయడమే నిదర్శనమన్నారు. నరోడాలో 98 మంది మరణించారని, అందులో 11 మంది సజీవ దహనానికి గురయ్యారని, అయినప్పటికీ అందులో దోషులను విడుదల చేశారని, హత్యలు జరిగాయనడం వాస్తవమని, ముద్దాయిలందరినీ విడుదల చేస్తే వారిని చంపిన వారు ఎవరని ప్రాసిక్యూషన్‌ లాయర్‌ ప్రశ్నకు సమాధానమీది, బిజెపిలో చేరిన వారు పుణ్యాత్ములు అయిపోతారనేందుకు కర్నాటకలో బిజెపి నేతలపై నాలుగేళ్ళలో 385 క్రిమినల్‌ కేసులను ప్రభుత్వం ఎత్తివేసిందని, అందులో 185 విద్వేషపూరిత ప్రసంగాల కేసులు ఉన్నాయని, వీటిని ఎత్తివేయడం ద్వారా వెయ్యి మంది బిజెపి నేతలు లబ్ధిపొందారన్నారు. అంటే నేరస్తులు బిజెపిలో చేరినా, ఆ పార్టీలో ఉండి నేరాలు చేసినా కేసులు రద్దవుతాయని అన్నారు. దేశాన్ని పరిరక్షించాల్సిన ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌ షా దేశ విచ్ఛిన్నకర శక్తులుగా మారారని సాంబశివరావు విమర్శించారు.
ఎంఐఎంతో ఎవరికి ఎక్కువ సంబంధాలు
కెసిఆర్‌ కంటే బిజెపికే ఎంఐఎంతో ఎక్కువ సంబంధం ఉన్నదని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఏ రాష్ర్టంలో ఎన్నికలు జరిగినా బిజెపి, ఎంఐఎం పరస్పర అవగాహనతో పోటీ చేస్తాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంఐఎంను కూడా వాడుకుంటుందని, అందరిపైనా కేసులు నమోదవుతున్నప్పటికీ తన స్నేహపార్టీలైన ఎంఐఎంపైన కేసులు ఉండవని తెలిపారు.
ఆర్టిజన్ల సమస్యను, రైతు రుణాలను తక్షణమే పరిష్కరించాలి
సమ్మె చేస్తున్న ఆర్టిజన్లను పెద్ద నేరస్తులుగా, సంఘ విద్రోహులుగా వారికి కనీసం మీడియా సమావేశాన్ని కూడా నిర్వంంకునే అవకాశాన్ని ఇవ్వకపోవడాన్ని ఖండించారు. రైతు రుణాలకు సంబంధించి లక్ష రూపాయల రుణమాఫీ కొద్ది మందికే జరిగిందని, మరి కొందరికి రూ.50 వేల వరకే మాపీ చేశారని, వెంటనే రుణమాఫీ చేయాలని, పోడుభూములు తదితర సమస్యలను పరిష్కరించాలని ఆయన రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
రాజకీయ దురుద్ధేశంతోనే అమిత్‌ వ్యాఖ్యలు : అజీజ్‌ పాషా
కర్నాటకలో రాజకీయ దురుద్దేశంతోనే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర మంత్రి అమిత్‌ వ్యాఖ్యానించారని సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ దుయ్యబట్టారు. ముస్లిం పరిస్థితి దళితుల కంటే అధ్వాన్నంగా ఉన్నదని పలు కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజేందర్‌ సచార్‌ కమిటీ 40వేల గృహాలకు సర్వే చేసి, నివేదికను సమర్పించిందని, దళితుల కంటే ముస్లింల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని ఆ నివేదికలో పొందు పర్చిందని గుర్తు చేశారు. రంగనాథ్‌ మిశ్ర కమిషన్‌ నివేదికలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్‌ ఇవ్వాలని సూచించిన విషయాన్ని అజీజ్‌ పాషా వివరించారు. నాగ్‌ ఆదేశాల మేరకే బిసిల జనగణను చేపట్టడం లేదని విమర్శించారు. ఏ వర్గంలో ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా లేకుండా ఆయా వర్గాలకు ఎలా న్యాయం చేస్తారని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఆర్థిక, విద్యాపరంగా ఏ వర్గాల పరిస్థితి ఎలా ఉన్నదో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.
సత్వరమే పంట నష్టంపై సర్వే చేయించాలి: పశ్య పద్మ
పశ్యపద్మ మాట్లాడుతూ దుమ్ము, తేమ శాతం తక్కువగా ఉన్నదని రకరకాల కారణాలతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్లు,తహసీల్దార్లు ఆయా కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేసి, రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రెండ సారి కూడా 5వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నదని, మామిడి, పూల తోటలు దెబ్బతిని రైతులు ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సత్వరమే పంట నష్టం సర్వే చేపట్టి, వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments