ఉత్తర్వులను ఖాతరు చేయలేదని హైకోర్టు తీర్పు
ప్రజాపక్షం/ హైదరాబాద్: హైకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయలేదన్న కేసులో ముగ్గురు పోలీసు అధికారులకు న్యాయమూర్తి 6 మాసాల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు. అసాధారణ కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చొప్పున స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించారు. ఈ విషయాల్ని వారి సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ శుక్రవారం జడ్జిమెంట్ చెప్పారు. వివరాల్లోకి వెడితే.. కరీంనగర్ నగర శివారులోని పుష్పాంజలి కంట్రి రిసార్ట్స్‌లో పేకాట ఆడుతున్నారని చెప్పి అనేకసార్లు పోలీసులు దాడులు చేయడంతో ఆ రిసార్ట్స్ హైకోర్టును ఆశ్రయించింది. రిసారట్స్‌లో సిసి కెమెరాల్ని పెట్టి వాటి వీడియో ఫుటేజీని పోలీసులకు కూడా అందుబాటులో ఉండేలా చేయాలన్న గత ఆదేశాల్ని ఉల్లంఘించి నాలుగు సార్లు పోలీసులు దాడులు చేశారని రిసారట్స్ యాజమాన్యం కోర్టు ధిక్కార రిట్ వేసింది. పోలీసులు కావాలనే ఉద్ధేశపూర్వకంగా రిసారట్స్‌పై దాడులు చేస్తున్నారని తేల్చిన హైకోర్టు.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమల్‌హాసన్‌రెడ్డి, ఎసిపి తిరుపతి, ఎస్‌హెచ్‌ఓ శశిధర్‌రెడ్డిలకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేలు చొప్పున జరిమానా విధించింది. అయితే ముగ్గురు పోలీసులకు వెంటనే శిక్ష అమలు చేయరాదని, ఈ తీర్పుపై డివిజన్‌బెంచ్ వద్ద అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలు కాకుండా 4 వారాలు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు తీర్పులో పేర్కొంది.