చెన్నై/కోల్‌కతా : ఇటీవల పశ్చిమ బెం గాల్, తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలవడ్డాయి. ఎన్నికల్లో టిఎంసి, డిఎంకె ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కాగా, తమిళనాడులో డిఎంకె కూట మి భారీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పా ట్లు మొదలయ్యాయి. మే 7వ తేదీన ఆయన సిఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె నేత ఎడప్పాడి పళనిస్వామి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు సోమవారం తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు పంపించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు స్టాలిన్ తెలిపారు. డిఎంకె విజయం సాధించిన అనంతరం ఆయన మెరీనా బీచ్‌లోని తన తండ్రి కరుణానిధి స్మారకం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అతి కొద్ది మంది సమక్షంలో సిఎంగా ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను దళల వారీగా అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతామని స్టాలిన్ భరోసానిచ్చారు. కాగా, మంగళవారం కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎలు సమావేశమై శాసనసభాపక్షనేతను ఎన్నుకోనున్నారు. ఆ తరువాత ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి ప్రమాణ స్వీకారం తేదీ, సమయాన్ని నిర్ణయిస్తామని స్టాలిన్ చెప్పారు. కాగా, తమిళనాడులో దశాబ్దకాలం వేచి చూసిన ఉదయం డీఎంకే సొంతమైంది. మొత్తం 234 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 152 చోట్ల విజయం సాధించింది. రెండు సార్లు అధికారాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని భావించిన అన్నాడీఎంకే కూటమి కేవలం 82 స్థానాలకు పరిమితమైంది.
బెంగాల్‌లో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం
ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెట్టి పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఒంటిచేత్తో పార్టీకి అపూర్వ విజయాన్ని అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆమే మరోసారి సిఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. కొత్తగా ఎన్నికైన టిఎంసి ఎమ్మెల్యేలతో సోమవారం పార్టీ అధిష్ఠానం సమావేశమైంది. ఈ సందర్భంగా దీదీని తమ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మే 5వ తేదీ బుధవారం రోజున మమత సిఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి, సీనియర్ నేత పార్థ ఛటర్జీ తెలిపారు. ఇందుకోసం రాత్రి 7 గంటలకు దీదీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను కలవనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ప శ్చిమ బెంగాల్ బెబ్బులిగా పేరొందిన మమతా బెనర్జీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో 213 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తూ భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నప్పటికీ నందిగ్రామ్‌లో మాత్రం సువేందు అధికారి చేతుల్లో మమతా ఓటమిపాలయ్యారు. దీంతో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నప్పటికీ.. మరో 6నెలల్లోపే శాసనసభ సభ్యురాలిగా మమతా బెనర్జీ గెలవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఆమె ఏ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రులుగా 7న స్టాలిన్, 5న దీదీ ప్రమాణం
RELATED ARTICLES