కెటిఆర్ ప్రమోషన్‌పై టిఆర్‌ఎస్‌లో చర్చ
ముఖ్యపనులు పూర్తయ్యాకే పెద్ద పదవి
కెసిఆర్ సిఎంగానే యాదాద్రి, నూతన సచివాలయం పూర్తి?
ప్రజాపక్షం/హైదరాబాద్; ‘కెటి రామారావు ముఖ్యమంత్రా..? ఉప ముఖ్య మంత్రా..? ఇంతకు ఏది వరిస్తుంది..?, సిఎం సీటు వదులుకున్న తర్వాత కెసిఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తారా..?” అనే చర్చ టిఆర్‌ఎస్ వర్గాలతో పాటు రాజకీయాల్లోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ఏ ఇద్దరు, ముగ్గురు నేతలు కలిసినా, వారి మధ్య కెటిఆర్‌కు ప్రమోషన్ పైనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర్ రావు తర్వాత ఆయన కుమారుడు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు అనేది ఇప్పటికే అటు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ స్పష్టమైంది. సిఎంగా కెటిఆర్ అవుతారనే విషయంపై సాక్షా త్తూ సిఎం కెసిఆర్ స్పందిస్తూ ‘దేనికైనా సమ యం, సందర్భం రావాలని’ తేల్చిచెప్పారు. ఈ క్రమంలో త్వరలోనే సిఎంగా కెటిఆర్ ప్రమాణస్వీకారం చేస్తారని విస్తృతంగా ప్రచారం జరగగా, తాజాగా ‘డిప్యూటీ సిఎం’ పదవి తెరపైకి రావడంతో టిఆర్‌ఎస్ వర్గాల్లో కొంత అయోమయం నెలకొన్నది. కెటిఆర్‌కు కెసిఆర్ ఇచ్చే ఆ ‘పదోన్నతి’ ఏమిటనేది అందరిలోనూ ఆసక్తిగా నెలకొన్నది. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతిసారీ కెటిఆర్‌కు పదోన్నతులు దక్కుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కెటిఆర్‌కు పూర్తి బాధ్యతలను అప్పగించగా భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్ గెలుపొందింది. ఈ ఫలితాలకు బహుమతిగా మంత్రి కెటిఆర్‌కు అదనంగా మున్సిపల్, గనుల శాఖలను అప్పగించారు. ఆ తర్వాత 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కెటిఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి దక్కింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో కెటిఆర్‌ను మంత్రివర్గంలోనికి తీసుకున్నారు. టిఆర్‌ఎస్ రెండవసారి అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి కూడా పార్టీ, ఎన్నికల వ్యవహారాల్లో కెటిఆర్ పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సాధించిన భారీ విజయాలన్నీ కెటిఆర్ ఖాతాలోనే పడ్డాయి. దీంతో ఆయనకు మరోసారి ‘పదోన్నతి’ రాబోతుందని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆ తర్వాత కాబోయే సిఎం కెటిఆర్ అంటూ సాక్షాత్తు రాష్ట్ర మంత్రులే బహిరంగంగానే ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత కెటిఆర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అలా రేపు, మాపు అంటూ సిఎం సీటుపై రకరకాల ఉహాగానాలు, చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముందుగా కెటిఆర్‌కు డిప్యూటీ సిఎం పదవి ఇస్తారని, ఆ తర్వాత సిఎంను చేసే అవకాశాలు ఉన్నాయని కొందరు, కాదు కాదు..ఏకంగా సిఎంనే చేస్తారని మరి కొందరు ఇలా రకరకాలుగా ఎవరి స్థాయిలోవారు అంచనాలు వేసుకుంటున్నారు.