ముంబయి: రుణ మాఫీ, పంటల నష్ట పరిహారం కోరుతూ మహారాష్ట్ర రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారందరూ కాలినడకన ముంబయిలోని ఆజాద్ మైదానానికి చేరుకున్నారు. దాదాపు 10వేల మందికి పైగా రైతులు, గిరిజనులు బుధవారం థానె నుంచి పాదయాత్రగా ముంబయికి వచ్చారు. లోక్ సంఘర్ష్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. కరవు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, గత ఏడాది హామీ ఇచ్చిన విధంగా రుణాలు మాఫీ చేయాలని కోరుతూ కాలినడకన నగరానికి చేరుకున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంటలకు 50శాతం కనీస మద్దతు ధర ఇవ్వాలని, గిరిజనులకు భూమి హక్కులు కావాలని అడుగుతున్నారు. మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రాజేంద్ర సింగ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 30 మందితో కూడిన ప్రతినిధుల బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి తమ సమస్యల గురించి చర్చించనున్నారు. రైతుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆజాద్ మైదానంలోనే బైఠాయిస్తామని నిన్న రైతులు హెచ్చరించారు. రైతులకు మద్దతుగా ఈ ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ముంబయిలోని పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ రైతులను కలిసి మాట్లాడారు. సంబంధిత మంత్రులు, అధికారులు అందరూ ముఖ్యమంత్రితో జరిగే సమావేశానికి హాజరవుతారని.. సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.
ముంబయి చేరుకున్న వేలాదిమంది రైతులు
RELATED ARTICLES