భారీ వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలం
ముంబయి, పుణె నగరాల్లో గోడలు కూలి 30 మంది మృత్యువాత
జనజీవనం అస్తవ్యస్తం, స్తంభించిన రవాణా
పలు రైళ్లు రద్దు, 54 విమానాలు
దారి మళ్లింపు, 52 రద్దు
ముంబయి: భారీ వర్షాలు దేశ వాణిజ్య రాజధాని ముంబయిని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. రైల్వేట్రాక్‌ల పైకి వర్షపు నీరు చేరడంతో పలు రైళ్లు రద్దు కాగా, విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మహారాష్ట్రలో గడచిన నాలుగురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో మొత్తం 35 మంది మృత్యువాత పడ్డారు. ముంబై, పూణే నగరాల్లో వేర్వేరు ఘటనల్లో గోడలు కూలి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు వర్షం సంబంధిత ఘటనలకు చపోరు. మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొనడంతో ముంబయి నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికారులు సెలవును ప్రకటించారు. ప్రజలు ఎవరు కూడా తమ ఇళ్లను వదిలి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. నగరంలోని మలాడ్ ఉత్తర శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన ఘటనలో 21 మంది మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న పదేళ్ల బాలికను సహాయ సిబ్బంది వెలికి తీశారు. అదే విధంగా పుణెలోని అంబెగాన్ ప్రాంతంలో సోమవారం రాత్రి సిన్గాడ్ కళాశాల గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృత్యువాత పడగా, మరో ముగ్గురి గాయాలయ్యాయి. థానె జిల్లాలోని కల్యాణ్‌లో మంగళవారం ఉదయం ఇంకో గోడ కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు అధికారులు చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 54 విమానాలను దారిమళ్లించగా, మరో 52 సర్వీసులను రద్దు చేశారు. భారీవర్షం వల్ల సోమవారం జైపూర్ నుంచి ముంబయి వచ్చిన స్పైస్ జెట్ విమానం రన్ వేపై దిగుతుండగా బురదలో కూరుకుపోయింది. ప్రమాదం నుంచి ప్రయాణికులు క్షేమంగా బయటపడినట్లు ఎయిర్‌లైన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఘటనతో ముంబయి విమానాశ్రయానికి వివిధ నగరాల నుంచి రావాల్సిన 54 విమాన సర్వీసులను దారి మళ్లించారు. విమానాశ్రయంలోని రెండో రన్ వేను అధికారులు మూసివేశారు. మలాడ్‌లో గోడ కూలిన ప్రదేశం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బృహన్ ముంబయి కార్పొరేషన్ (బిఎంసి) ట్వీట్ చేసింది. శిథిలాల కింద ఓ మహిళ, చిన్నారి సజీవంగా ఉన్నట్లు గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది వారిని సురక్షితంగా వెలికితీసినట్లు తెలియజేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బిఎంసి విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్‌కు మున్సిపల్ అధికారులతో కలిసి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. రైల్వే, రోడ్ ట్రాఫిక్ వంటి వాటిపై ఆయన సమీక్షించారు. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ అధికారులు సూచించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం సెలవును ప్రకటించినట్లు సిఎం చెప్పారు.