వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్
చిక్కుకుపోయిన 1050 మంది ప్రయాణికులు
సురక్షితంగా బయటకు తరలించిన సహాయక బృందాలు
ముంబయి, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు
ముంబయి / థానె : భారీ వర్షాలు దేశ ఆర్థిక రాజధానిని వీడడం లేదు. ముంబయి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షాలు కురియడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. విమాన సర్వీసులకు, రైల్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రైలు పట్టాలు పూర్తిగా నీట మునగడంతో వేయి మంది ప్రయాణికులు ఉన్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ థానె జిల్లాలో చిక్కుకుపోయింది. శుక్రవారం రాత్రి కొల్పాపూర్‌కు వెళ్లేందుకు ముంబయి నుంచి బయలుదేరగా, మార్గమధ్యలో ఉల్హాన్ సాగర్ వద్ద నిలిచిపోయింది. బహుళ కంపెనీల సహాయక బృందాలతో అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు హెలికాప్టర్లను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం రక్షణశాఖ అధికారులకు విజ్ఞప్తి చేసింది. కాగా, మొత్తం 1050 మంది ప్రయాణికులకు గానూ 17 గంటల పాటు సాగిన సహాయక చర్యల్లో అందరూ సురక్షితంగా బయటపడినట్లు సెంట్ర ల్ రైల్వే అధికారులు తెలియజేశారు. అంతకు ముందు ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికార ప్రతినిధి సచ్చిదానంద గౌడ మాట్లాడుతూ రైలు చిక్కుకున్న ప్రాంతానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సురక్షిత ప్రాంతానికి ప్రయాణికులను తరలిస్తున్నామన్నారు. వారికి ఆహారం, మంచినీరు, వైద్య సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. రక్షించబడిన 500 మంది ప్రయాణికుల్లో 9 మంది గర్భిణులు ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) పేర్కొంది. గైనకాలజిస్టుతో సహా 37 మంది డాక్టర్ల బృందంగల అంబుల్సెను అత్యవసర పరిస్థితుల నిమిత్తం మొహరింపచేసినట్లు సిఎంఒ తెలిజేయసింది. అదే విధంగా సహాయక చర్యల్లో ఏడు నావికా బృందా లు, రెండు ఐఎఎఫ్ హెలికాప్టర్లు, స్థానిక అధికర యం త్రాంగం మోహరించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిపై ఆరా తీశారు. సహాయక చర్యల్లో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. ప్రయాణికులను హెలికాప్టర్ ద్వారా తరలించడంతో పాటు అవససరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ డైరెక్టర్ అభయ్ యవాల్కర్ ఎన్‌డిఆర్‌ఎఫ్ ఎయిర్ కమాండ్, ఎయిర్‌ఫోర్స్, నేవీకి లేఖ రాశారు. ఇదిలా ఉండగా, శనివారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో ముంబయి నగరంలో 97.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగ ముంబయి తూర్పు, పశ్చిమ సబర్బన్‌లో 163, 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బ్రిహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) వెల్లడించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ముంబయి విమానాశ్రయంలో 11 విమానాలను రద్దు చేయడంతో పాటు మరో 9 విమానాలను దారి మళ్లించారు. థానె జిల్లాలో శుక్రవారం రాత్రి అంతా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రైలు పట్టాలపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో బదల్‌పూర్ సమీపంలో మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ నీటిలో చిక్కుకుపోయింది.వరదలు పోటెత్తడంతో ఉల్హాస్ నది ఉప్పొంగింది. దీంతో పట్టాలపై అధిక మొత్తంలో నీరు వచ్చి చేరడంతో బద్లాపూర్ పరిధిలోని చమ్టోలీ వద్ద రైలు నిలిచిపోయింది. అయితే రైలు నుంచి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, అయితే పట్టాలపై నీటిమట్టాలు పెరగడమే ఆందోళన కలిగిస్తోందని థానె రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ శవాజీ పాటిల్ చెప్పారు. జిల్లాలో వర్షం ఘటనలకు ప్రాణ నష్టం వాటిల్లినట్లు ఇంత వరకు ఎలాంటి నివేదికలు రాలేదన్నారు. సహాయక చర్యల్లో 8 ఎన్‌డిఆర్‌ఎఫ్ పడవలు మొహరించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారక ప్రతినిధి తెలిపారు. కల్యాణ్ సమీపంలోని కల్యాణ్ ముర్బాద్ రోడ్డుపై ఉన్న వరప్, కంబా, మహరల్ గ్రామాలు సహా అనేక గ్రామాలు నీటి మునిగాయి. దీంతో సహాయక చర్యల నిమిత్తం జిల్లా యంత్రాంగం ఒక ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని తరలించినట్లు ఆ ఆధికారి వెల్లడించారు. ఉదయం 8 గంటల వరకు థానె పట్టణంలో 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముర్బాద్‌లో 332, కల్యాణ్, ఉల్హాస్ నగర్, అంబేరనాథ్‌లో 200 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్లు జిల్లా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
సహాయ సిబ్బందికి అమిత్‌షా అభినందలు
రైలులో చిక్కుకున్న ప్రయాణికులందరినీ రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. ‘ఎన్‌డిఆర్‌ఎఫ్, భారత నేవీ, వాయుసేన, రైల్వే, రాష్ట్ర యంత్రాంగం అం తా కలిసి వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను మేం పర్యవేక్షించాం. రెస్క్యూ బృందానికి అభినందనలు’అని షా ట్వీట్ చేశారు. ఇందు కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు.
వర్షాలకు నాలుగు దేశాల్లో 600 మంది మృత్యువాత
ఐక్యరాజ్యసమితి : భారత్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తాయి. మొత్తం 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మిలియన్ల మందిపై వర్ష ప్రభా వం పడినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. అందు లో అర మిలియన్ మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆంటోనియా గట్టర్స్ సెక్రటరీ జనరల్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ చెప్పా రు. వర్షం సంబంధిత ఘటనలకు 600 మంది మృతి చెందినట్లు నివేదికలు అందాయన్నారు. భారత్‌లో తీవ్ర వర్ష ప్రభావిత రాష్ట్రాలైన అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్‌లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో యునిసెఫ్ కలిసి పనిచేస్తూ వాటికి పరస్పర సహకారాన్ని అందిస్తోంది. అసోం, బీహార్, యుపిలోని కొన్ని ప్రాంతా లు, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో 4.3 మిలియన్లకు పైగా చిన్నారులు సహా 10 మిలియన్ల మందిపై వర్ష ప్రభావం పడింది.
రానున్న 48 గంటల్లో భారీ వర్షం
మరోవైపు వచ్చే 48 గంటల్లో మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబయితో పాటు థానె, పుణె, రత్నగిరి, రాయ్‌గఢ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాల కారణంగా ముంబయి – గోవా జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.