వర్షాకాలంలో ఎజెన్సీ గ్రామాల మునక
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
ప్రజాపక్షం/కొత్తగూడెం అధికార యంత్రాంగానికి ముందుచూపులేకపోవడం వల్లే ప్రతీఏటా వర్షా కాలంలో ఏజెన్సీ గామాల గిరిజనులు, గిరిజనేతర ప్రజలు ముంపు బారినపడి కష్టాలు పడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వర్షాలకు దెబ్బతిని ప్రమాదకరంగా మారిన చుంచుపల్లి మండలం పెనుబల్లి బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత కొత్తగూడెంలో ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ప్రతీ ఏటా ప్రజలు ముంపు బారిన పడుతున్నా, వరదలతో వంతెనలు మునిగి బాహ్య ప్రపంచంతో గ్రామీణ ప్రజల సంబంధాలు తెగిపోయి ఇబ్బందులకు గురి అవుతున్నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచన లేకపోవడం అక్కడి ప్రజలు చేసుకున్న పాపమా అని ప్రశ్నించారు. పాల్వంచ చెక్‌డ్యామ్ నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి మూలంగానే వరదలకు ధ్వంసమై రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. పెనుబల్లి వంతెన శిథిలావస్థకు చేరినప్పటికి పునర్‌నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రామ ప్రజలు పక్షం రోజులు గ్రామానికే పరిమితం కావాల్సి వచ్చిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పెనుబల్లి గ్రామ ప్రజలను పరోక్షంగా వెలివేయడమేనన్నారు. జిల్లా వ్యాపితంగా వరద తాకిడికి వంతెనలు రహదారులు దెబ్బతిని జనజీవనం
అస్తవ్యస్తంగా మారిందని, వర్షాల సమయంలో కంటితుడుపు చర్యలు మినహా శావ్వత పరిష్కారంకోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. పాత కొత్తగూడెం ఎస్సీ కాలనీవాసులు గత ప్రభుత్వాల హయాంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా దెబ్బతిని ప్రమాదకర పరిస్థితిలో కాలం వెల్లదీస్తున్నారని, వర్షాలు వచ్చినప్పుడు కాలనీ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి చేతులు దుపులుకుంన్నారని అన్నారు. ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించే వరకు ఎస్సీ కాలనీ ప్రజలకు పునరావా కేంద్రాల్లో ఆశ్రయం కల్పించాలని డిమాండ్ చేశారు. పర్యటనలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, బాగం మహేశ్వర్‌రావు, సర్పంచ్ రెడ్డి శ్రీను, కిలారు ప్రపసాద్, కూసపాటి శ్రీనివాస్, పుట్టి భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, రామలక్ష్మి, ధనలక్ష్మి, మందాకిని, నాగరాజు, నాగయ్య, మల్లేష్, భాస్కర్, గోపమ్మ, వరలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ముందుచూపు లేకపోవడంవల్లే…
RELATED ARTICLES