HomeNewsBreaking Newsముందుకు సాగని ధాన్యం కొనుగోళ్లు

ముందుకు సాగని ధాన్యం కొనుగోళ్లు

క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలు
నిల్వ, రవాణాపై స్పష్టత కరువు..రైతులపైనే భారం
వర్షాల భయంతో అయోమయంలో అన్నదాతలు
ప్రజాపక్షం/వరంగల్‌ ధాన్యం కల్లాల్లోకి వచ్చి పక్షం రోజులు దాటింది. రైతులు తమ ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ధాన్యాన్ని రాష్ట ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన తర్వాత అధికారులు ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేసారు. మొదట కొనుగోలు కేంద్రాలపై అధికారులు దృష్టి సారించి చాలా ప్రాంతాలలో హడావుడిగా ప్రారంభించారు.కానీ కొనుగోళ్లు చేపట్టడంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలతో తలలు పట్టు కుంటున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు జరుగక పోవడంతో అకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు.కాగా ధాన్యం రవాణా విషయంలో ఎలాంటి కసరత్తు చేపట్టాలనే దానిపై ఇంకా కసరత్తు చేస్తున్నారు.రవాణా తర్వాత ధాన్యాన్ని ఎలా నిల్వ చేయాలో అధికారులకు తెలియడం లేదు. ఇప్పటికే అన్ని రైస్‌ మిల్లుల్లో పాత ధాన్యం నిల్వలతోనే నిండిపోయి ఉన్నాయి. రవాణా, నిల్వ విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతులు కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో ధాన్యం నిల్వకు గోదాముల కొరత తీవ్రంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 3.45లక్షల మెట్రిల్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాముల్లో ప్రస్తుతం 95శాతం స్థలం పాత నిల్వలతో నిండిపోయింది. ఎఫ్సీఐ తీసుకోకపోవడంవల్ల సుమారు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇప్పటికీ మిల్లుల్లో పేరుకు పోయి ఉందని మిల్లర్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగులు కూడా ఖాళీలేవు. అన్నిటిలో గత సీజన్లో సేకరించిన ధాన్యం నిల్వలు నిండి ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రావడం మొదలైతే నిల్వ చేసుకోవడం ఎట్లా అని రైస్‌ మిల్లర్లు తలలుపట్టుకుంటున్నారు. సివిల్‌ సప్లయ్‌ అధికారుల కూడా ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు కిందటేడు మిల్లర్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఈసారి కూడా అలాంటి వెసులుబాటు కల్పిస్తే ప్రైవేటు గోదాములను వెతికే పనిలో మిల్లర్లు పడతారు. గత సీజన్లో వర్ధన్నపేట, పరకాల, శాయంపేట, గూడెప్పాడు వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్ల గోదాములు, గొర్రెకుంట, మురిపిరాల తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు గోదాముల్లో ûరైస్‌ మిల్లర్లు ధాన్యాన్ని నిల్వచేశారు. వాటిలో ధాన్యం నిలువలు ఇప్పటికీ అలాగే ఉండడంతో ప్రైవేటు గోదాములు కూడా అద్దెకు దొరికే పరిస్థితి కనిపించడం లేదు.ఉమ్మడి జిల్లాలో వాస్తవానికి రైస్‌ మిల్లులు, గోదాములు ఎక్కువగా ఉన్నది వరంగల్‌ జిల్లాలోనే. ఈ జిల్లాలో 114 రైస్‌ మిల్లులు ఉన్నాయి. వీటిలోనూ ఎక్కడా ఖాళీలేదు. హనుమకొండ జిల్లాలో రైస్‌ మిల్లు లు తక్కువగా ఉన్నాయి. అలాగే గోదాములు కూడా అంతగా లేవు. గోదాముల కొరత వల్ల ఈ జిల్లాలో గ త సీజన్లో కొన్న ధాన్యాన్ని కూడా వరంగల్‌ జిల్లాలోని గోదాముల్లోనే నిల్వ చేశారు. జనగామలో 20 రైస్‌ మిల్లులు, 18 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉన్నాయి. 83 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన గోదాములు అందుబాటులో ఉన్నా అవన్నీ గత ధాన్యం నిల్వలతోనే నిండి ఉన్నాయి. మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఈ సీజన్లో సుమారు 5.57 లక్ష ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉం టుంది. ఇంత ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలన్నదే ఇప్పుడు అధికారులను వేధిస్తున్న ప్రశ్నగా మారింది.
రైతులపైనే భారం
కొనుగోలు కేంద్రాల నుంచి వాటికి ట్యాగ్‌ చేసిన తర్వాత నిర్దేశిత రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని తరలించడానికి ప్రతీ సీజన్లో రవాణా సమస్య ఉత్పన్నమవుతోంది. అందుబాటులో ఉన్న లారీల ద్వారా సకాలంలో ధాన్యం రవాణా కాక రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రతీసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం రవాణా విషయంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పారదర్శకమైన వ్యవస్థను అనుసరించకపోవడంవల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌ మిల్లర్లు ఆరోపిస్తున్నారు. చివరికి ధాన్యం తరలింపు భారం రైతుల మీదే పడుతోంది. వారే ట్రాక్టర్లు, డీసీఎంలలో రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని తరలించుకుంటున్నారు. ఇందుకయ్యే రవాణా ఖర్చును చెల్లిస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ప్రైవేటు ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు చెబుతున్నా ఒక్క పైసా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments