ప్రమాదకర స్థాయిలో నదులు
పలు రాష్ట్రాల్లో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
63 ఏళ్ల తరువాత భువనేశ్వర్‌లో రికార్డుస్థాయిలో వర్షం
న్యూఢిల్లీ : భారీ వర్షాలు యావత్ భారత దేశాన్ని ముంచెత్తుతున్నాయి. నదులు, వాగులువంకలు పొంగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాఉ నీట మునిగాయి. సాధారణ జనజీవనానికి విఘాథం ఏర్పడింది. ఒడిశాలో భారత వాతారణ శాఖ (ఐఎండి) రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతుండగా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రా ల్లో వర్షం ఉధృతి కొంత తగ్గినప్పటికీ, పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. ఒడిశాలో వర్షాలు 63 ఏళ్ల రికార్టును తిరగరాశాయి. రాష్ర్ట రాజధాని భవనేశ్వర్‌లో 24 గంటల వ్యవధిలో 195 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరదలు పోటెత్తవచ్చని అధికారులు హెచ్చరించారు. వర్షాల ధాటికి కేంద్రపరా జిల్లాలో గోడ కూలి ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు రాగా, అధికారికంగా ధ్రువీకరించలేదు. యాత్రా పట్టణమైన పూరిలో కూడా 87 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ ఒక్క రోజే 341 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ కోస్తా పట్టణంలో సెప్టెంబర్ 2, 1934లో 210.8 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంతం నయపల్లిలో ఉన్న ఇస్కాన్ ఆలయం సమీపంలో వాహనాలు వరద నీటిలో తేలుతూ కనిపించాయి. వరదలు ఇళ్లు, మార్కెట్లను ముంచెత్తాయి. సోమవారం ఉదయం 8.30 గంటల నాటికి గడిచిన 24 గంటల్లో భువనేశ్వర్‌లో 195 మి.మీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 9, 1958లో నగరంలో 163 మి. మీ వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. సోమవారం ఉదయం భద్రక్ జిల్లాలోని చాంద్‌బల్లి సమీపంలో తీరం దాటింది. దీంతో వాతావరణశాఖ 13 జిల్లాలకు అలర్ట్‌ను జారీ చేసింది. రానున్న 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీసగఢ్, మధ్యప్రదేశ్ వైపు పయణిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెడ్ వార్నింగ్‌ను జారీ చేస్తూ సంబల్‌పూర్, డియోగఢ్, అంగుల్, సోనెపూర్, బార్‌గఢ్‌లో భారీ నుంచి అతి, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇలావుంటే, మహారాష్ట్రను కూడా భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. నాసిక్‌లోని పలు ఆలయాలు నీట మునిగాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్, జామ్‌నగర్ ప్రాంతాల్లోనూ ఎడతెరిపిలేని వర్షాలు, ముంచేస్తున్న వరదలు భారీ నష్టాన్ని మిగిలిస్తున్నాయి. రాజ్‌కోట్‌లోని పలు గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సహాయక చర్యలకు కూడా వర్షం తీవ్ర ఆటంకాలను సృష్టిస్తున్నది. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం మోస్తరు వర్షాలు కురిశాయి. మరో మూడు రోజుల పాటు ఆంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది.
ముంచెత్తుతున్న వానలు
RELATED ARTICLES