పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం రాత్రికి వాయుగుండంగా మారి, దూసుకొస్తున్నది. తౌక్టేగా పిలుస్తున్న ఈ తుఫాను ఉదయం 05:30 గంటలకు అమిని దీవికి ఈశాన్య దిశగా 160కీ.మీ. దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. ఇది మరింత బలపడి రాగల 12 గంటలలో తీవ్ర తుఫానుగా మారుతుందని, తరువాత ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని తెలిపింది. తదుపరి అతి తీవ్రతుఫానుగా మారి గుజరాత్ తీరాన్ని పోర్‌బందర్, – నలియాల మధ్య 18వ తేదీ సాయంత్రం 2.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తన బులిటెన్‌లో పేర్కొంది. కాగా, తౌక్టే ప్రభావం ఎక్కువ ఉండే కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. జాలర్లు జాగ్రత్తగా ఉండాలని, సరిహద్దు దగ్గర ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. దీని ప్రభాంతో ఈ ఐదు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎండాకాలంలో తుఫాను రావడం చాలా అరుదు. ఆ ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపైనా ఉండటంతో అంతా ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట నీటి పాలై పోతుందనే భయం రైతంగాన్ని వెంటాడుతున్నది. అంతేగాక మామిడి కాయలు రాలిపోతాయనే ఆందోళన కూడా వారిని వేధిస్తున్నది. తుఫాన్ సృష్టించే విలయం నుంచి ప్రజలను కాపాడేందుకు దాదాపు 50 నేషనల్ డిసస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు ఇప్పటికే దీని ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు చేరుకున్నాయి. నావికా దళం కూడా రంగంలోకి దిగింది. అన్ని రకాలుగా సాయం అందించాలని వివిధ శాఖలకు, బృందాలకు, మంత్రిత్వ శాఖలకు కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇలావుంటే, కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా కేరళలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేయడం లేదు. వీటి వల్ల కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుందని విజయన్ సర్కారు భావిస్తున్నది. అయితే, తౌక్టే తుఫాను తీరం దాటే సమయంలో సంభవించే పరిణామాలను ఎదుర్కోవడానికి వీలుగా 53 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచింది. కాగా భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ వాటర్ కమిషన్ కేరళ, తమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో నీటి మట్టం ప్రమాదం, భారీ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. కేరళలలోని మణిమల, అచన్‌కొవిల్, తమిళనాడులోని కొడయార్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఎవరూ నదీ స్నానాలకుగానీ, చేపల వేటకుగానీ వెళ్లవద్దని సూచించింది.
ముంచుకొస్తున్న తౌక్టే
RELATED ARTICLES