ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ సి.కె.ప్రసాద్
ప్రజాపక్షం/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రసార మాధ్యమాలు ముంచెత్తుతున్న సమయంలో పత్రికలు, న్యూస్ ఛానెళ్ల బాధ్యత మరింత పెరిగిందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సి.కె. ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్స్ మీట్‌లో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ నేడు సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు తమ వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధాన స్రవంతి మీడియా అన్నింటిని గమనిస్తూ మొత్తం సమాజ అభిప్రాయాలను, వారి అవసరాలను ప్రతిబింబించే విధంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇదే నేపథ్యంలో సమకాలీన అంశాలపై జర్నలిస్టులు ఎప్పటికప్పుడూ అప్‌డేట్ అవుతూ సమాజంలో వస్తున్న మార్పులను పసిగట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. పలు సందర్భాల్లో మీడియా సమాజ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న ఫిర్యాదులు వస్తున్నాయని వాటన్నింటిని కూడా ప్రెస్కౌన్సిల్ పరిశీలిస్తూ తగు చర్యలు, సూచనలు చేస్తుందని సి.కె.ప్రసాద్ అన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు దేవులపల్లి అమర్, ఎంఎ మాజిద్, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజమౌళిచారి, సీనియర్ జర్నలిస్టులు ప్రశాంత్‌రెడ్డి, కృష్ణారావు, శైలేష్‌రెడ్డి, తెలంగాణ సిఎం సిపిఆర్‌ఒ వనం జ్వాలా నర్సింహారావు, రవికాంత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, విజెఎం దివాకర్, దిలీప్‌రెడ్డి, ఉడుముల సుధాకర్‌రెడ్డి, ఐ ఆండ్ పిఆర్ డైరెక్టర్ నాగయ్యలతో పాటు ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.