HomeNewsBreaking Newsమీడియా కమిషన్‌ ఏర్పాటుపైచర్చ అవసరం

మీడియా కమిషన్‌ ఏర్పాటుపైచర్చ అవసరం

ఐజెయు కార్యవర్గ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌
ప్రజాపక్షం న్యూస్‌ నెట్‌వర్క్‌
: మీడియా కమిషన్‌ ఏర్పాటు గురించి దేశంలో పెద్దఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉందని, దానిపై జర్నలిస్టు సంఘాల నేతలతో చర్చించడానికి తాను సుముఖంగా ఉన్నానని, అవసరమైతే అలాంటి చర్చ కోసం ఎక్కడికైనా రావడానికి తా ను సిద్ధమేనని కేంద్ర హోమ్‌ శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ అన్నారు. పట్నా లో జరుగుతున్న ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజెయు) జాతీయ కార్యవర్గ సమావేశాల రెండోరోజు ఆదివారం కార్యక్రమంలో నిత్యానంద రాయ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఐజెయు జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షుపన్యాసం చేస్తూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను హోమ్‌ శాఖ సహాయమంత్రికి వివరించారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్‌, వెబ్‌, సోషల్‌ మీడియాల విస్తరణ నేపథ్యం లో మీడియా రంగ స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో మీడియా రంగ స్థితిగతులను అధ్యయనం చేయడానికి మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల భద్రత కోసం ఒక చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పరిశ్రమల కార్మికులకు, ప్రభుత్వ సిబ్బందికి రెండుసార్లు వేతనాలు పెరిగినా, పత్రికా రంగంలో గత 15 ఏళ్లుగా వేతనాలు పెరగలేదని శ్రీనివాసరెడ్డి వివరించారు. కేంద్ర హోమ్‌ శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ స్పందిస్తూ జర్నలిస్టుల పనిపరిస్థితులు , వేతనాలు, భద్రత వంటి అంశాలను పరిష్కరించడానికి జర్నలిస్టు సంఘాలతో తాము సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలన్న ఐజెయు కోరిక సమంజసమేనని, దానిపై చర్చించడానికి తాను సుముఖంగా ఉన్నానని, అయితే దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఉన్నతస్థాయిలోనేనని ఆయన అన్నారు. మీడియా కమిషన్‌ గురించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తాను తీసుకువెళ్తానని నిత్యానంద రాయ్‌ హామీ ఇచ్చారు. కేవలం పాత్రికేయం మాత్రమే చేసేవారిపై దేశద్రోహం కేసులు పెట్టడానికి తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలలో ఎక్కడైనా అలాంటి ఘటనలు జరిగినట్లయితే తాను సైతం జర్నలిస్టు సంఘాలతో కలిసి నిలబడటానికి సిద్ధమేనని అన్నారు. అత్యధిక శాతం పాత్రికేయులు బాధ్యతగా, సత్యంకోసం నిలబడి ఉంటారని, కానీ లక్షమందిలో ఒకరు దేశానికి వ్యతిరేకంగా వుంటే వారి కోసం ఒక చట్టం ఉండాల్సిన అవసరం ఉంటుందని మంత్రి అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పనిచేస్తున్న మీడియాకు చట్టాన్ని మించిన శక్తి ఉందన్నారు. కలం ఉండాలి, చట్టమూ ఉండాలి, ఎవరి పనులు వారు చేసుకున్నా దేశం విషయంలో అందరి స్వరం ఒకటిగా ఉండాలని నిత్యానంద రాయ్‌ అన్నారు. ఐజెయు రెండో రోజు సమావేశాల్లో 18 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తమ రాష్ట్రాలలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం యూనియన్‌ చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడారు. ఐజెయు సెక్రెటరీ జనరల్‌ బల్విందర్‌ సింగ్‌ జమ్మూ మాట్లాడుతూ ఐజెయును పటిష్టం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం ఫలిస్తొందని, త్వరలో మరికొన్ని రాష్ట్రాలలో ఐజెయుకు అనుబంధంగా సంఘాలు ఏర్పాటు కానున్నాయని, గతంలో చీలి బైటికి వెళ్ళిన మిత్రులు తిరిగి మాతృ సంస్థలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. యూనియన్‌ మాజీ అధ్యక్షులు ఎస్‌.ఎన్‌.సిన్హా , స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఎం.ఎ.మాజిద్‌, కోశాధికారి ప్రేమ్‌నాథ్‌ భార్గవ్‌, ఉపాధ్యక్షులు అమర్‌ మోహన్‌ప్రసాద్‌, జి.ప్రభాకరన్‌, కార్యదర్శులు వై.నరేందర్‌ రెడ్డి, డి.సోమసుందర్‌, డి.ఎస్‌.ఆర్‌.సుభాష్‌, స్క్రైబ్స్‌ న్యూస్‌ సంపాదకులు ఆలపాటి సురేష్‌కుమార్‌ తదితరులు మాట్లాడారు.
జర్నలిస్టులపై దాడుల పట్ల ఐజెయు తీవ్ర ఆందోళన
పలు తీర్మానాలను ఆమోదించిన కార్యవర్గ సమావేశం

దేశంలో మీడియా పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వెంటనే మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలని, పాత్రికేయుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టం చేయాలని ఐజెయు కార్యవర్గ సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడులను నిరోధించడానికి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు తెచ్చిన చట్టాల తరహాలో కేంద్ర ప్రభుత్వమే ఒక సమగ్ర చట్టం చేయాలని ఐజెయు విజ్ఞప్తి చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పాత్రికేయులపై బనాయించిన అక్రమకేసులు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కార్యవర్గ సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది. మణిపూర్‌ ఘటనలపై సమావేశం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేయడంపై ఐజెయు నిరసన వ్యక్తం చేసింది.
తక్షణం శాంతి భద్రతల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఐజెయు డిమాండ్‌ చేసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 2న దేశవ్యాప్తంగా డిమాండ్స్‌ డే పాటించాలని ఐజెయు కార్యవర్గం పిలుపు ఇచ్చింది. కృత్రిమమేధ -పర్యవసానాలు అంశంపై న్యూఢిల్లీలో జాతీయ సదస్సును నిర్వహించాలని, మహిళా జర్నలిస్టుల సమస్యలపై అక్టోబర్‌లో హైదరాబాద్‌ లోజాతీయ సదస్సు నిర్వహించాలని కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. జెయు జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణలో ప్రధానపాత్ర పోషించిన జాతీయ ఉపాధ్యక్షుడు అమర్‌ మోహన్‌ప్రసాద్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు శివేంద్ర నారాయణ్‌ సింగ్‌, రాష్ట్ర అధ్యక్షురాలు నివేదితా ఝా, ప్రధానకార్యదర్శి కమల్‌ కాంత్‌ సహయ్‌, రవి ఉపాధ్యాయ్‌, సీటూ తివారీ, జరినా ఫాతిమా తదితరులను యూనియన్‌ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి సత్కరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments