నీరు తాగాలంటే భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు
గతంలో అనేక సార్లు ఇదే వైనం..
ప్రజాపక్షం/గోదావరిఖని: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టిన విషయం విధితమే. ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం అమలు చేసి ఇంటింటికీ భగీరథ నీరు అందిస్తున్నా రు. అయితే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని రామారావుపల్లికి చెందిన మేకల శాంతమ్మ ఎప్పటిలాగే నీరు పడుతుండగా మిషన్ భగీరథ నల్లా పైప్ ద్వారా ఒక్కసారిగా బిందలోకి ఓ వింత క్రిమికీటకం రావడంతో శాంతమ్మ భయబ్రాంతికి గురైంది. ఇలాంటిది రావడం ఇదే తొలిసారి కాదని, గతంలో సైతం కొన్ని క్రిమికీటకాలు అనేక సార్లు వచ్చాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై అనేక సార్లు అధికారులకు విన్నవించినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో మిషన్ భగీరథ నీరు తాగాలా.. వద్దా అనే అనుమానాలతో గ్రామస్థులు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా గ్రామస్థుల ప్రాణాలను, ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ నీటిని, ట్యాంక్‌లను ఎప్పటికప్పుడు శుద్ధ్ది చేయాలని, ఆయా నీటిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రాణాలకు హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు గ్రామస్థులు కోరుతున్నారు.
మిషన్ భగీరథ నీటిలోవింత క్రిమికీటకం
RELATED ARTICLES