సిఎంఆర్ ఇవ్వడం తమవల్ల కాదని తెగేసి చెప్పిన వైనం
ప్రజాపక్షం/ సూర్యాపేట ప్రతినిధి సిఎంఆర్ గడువులోపు ప్రభుత్వానికి అప్పగించడంలో ఇంతకాలం మొండికేసిన సూర్యాపేట జిల్లాలోని కొంతమంది మిల్లర్లు ఏకంగా అధికారులపై తిరుగుబాటు చేస్తున్నారు. నిబంధనల పేరు తో బెదిరిస్తే భయపడతామా అంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. ‘జైలుకైనా వెళుతాం.. గడువులోపు సిఎంఆర్ ఇవ్వడం మా వల్ల కాదు’ అని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలోనే తెగేసి చెప్పారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలోని మిల్లర్లకు అప్పగించగా గడువులోపు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. 2022- ఖరీఫ్‌కు సంబంధించి సిఎంఆర్‌ను నెల రోజుల వ్యవధిలోనే అప్పగించాల్సి ఉండగా నేటికి కేవలం 88 శాతం మాత్రమే అప్పగించారు. జిల్లాలోని ఏడుగురు మిల్లర్లనుండి 12 శాతం సిఎంఆర్ పెండింగ్ లో ఉంది. ప్రభుత్వం జనవరి 31వ తేదీలోపు అప్పగించాలని ఆదేశించినా మిల్లర్లు అప్పగించలేకపోయారు. దీంతో ఈ నెల 29 వరకు గడువు పెంచింది. ఇదిలా ఉంటే 2022- యాసంగి(రబీ) సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 361445.120 మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని సేకరించిన అధికారులు జిల్లాలోని 70 మంది మిల్లర్లకు సిఎంఆర్ కోసం కేటాయించడం జరిగింది. ఇందుకు గాను మిల్లర్లు ప్రభుత్వానికి కేటాయించిన ధాన్యానికి సంబంధించి 67 శాతం లెక్కన 242163.230 ఎసికెల బియ్యాన్ని అప్పగించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 7769 ఎసికెలు మాత్రమే ప్రభుత్వానికి అప్పగించారు. దాదాపు 90 శాతానికి పైగా పెండింగ్‌లో ఉంది. 2023- రబీలో 2081420.80 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి 64 మిల్లర్లకు సిఎంఆర్ కోసం అప్పగించారు. ఈ ధాన్యం కేటాయించి కూడా రెండు నెలలు దాటినా ఏ ఒక్క మిల్లరు కూడా సిఎంఆర్‌ను ప్రభుత్వానికి అప్పగించిన దాఖలాలు లేవు. రికవరీ కోసం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డిల అధ్యక్షతన గురువారం మిల్లర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 2022- ఖరీఫ్‌కు సంబంధించిన సిఎంఆర్ పెండింగ్‌ను ఈ నెల 29 తేదీలోపు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. అలాగే 2022- రబీ సిఎంఆర్‌ను కూడా వెంటనే ఇవ్వాలని కోరారు. దీనిపై మిల్లర్లు తిరగబడ్డారు. అధికారులు వర్సెస్ మిల్లర్లు మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ సమావేశానికి మీడియాకు అనుమతి లేకున్నా జరిగిన రచ్చ బయటకు పొక్కింది. దీంతో అధికారులు మిల్లర్ల తీరుతో తలలు పట్టుకున్నారు.
అధికారులు నిబంధనల పేరుతో బెదిరిస్తారా…
అధికారులు నిబంధనల పేరుతో సిఎంఆర్ అప్పగించాలని బెదిరిస్తే తాము బెదిరేదిలేదని మిల్లర్స్ అసోసియేషన్‌లోని ఓ కీలక నాయడు ఎదురు దాడికి దిగాడు. ‘మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి… గత రబీలో మాకు తడిసిన ధాన్యాన్ని అప్పగించారు. దీంతో తాము నష్టపోయాం’ అంటూ వారు చెప్పుకొచ్చారు. అయితే గతంలో అధికారులు తమ వద్ద పెద్దమొత్తం డబ్బును తీసుకున్నారని మిల్లర్ల ఎదురుదాడితో తేలిపోయింది. కాగా, తాము కేటాయించిన ధాన్యం మొత్తం తడిసింది కాదుకదా మంచి ధాన్యానికి సంబంధించిన సిఎంఆర్‌ను ఎందుకు పెట్టరని అధికారులు ప్రశ్నించారు. కానీ మిల్లర్లు తాము జైలుకైనా వెళతాం గడువులోపు పెట్టలేమంటూ మొండికేయడం గమనార్హం. మిల్లర్ల వాదన ఇదిలా ఉంటే అధికారులపై దాడికి దిగిన అసోసియేషన్‌లో కీలక నాయకులు తనకు సంబంధించిన మిల్లులకు అప్పగించిన ధాన్యానికి 2022- రబీ, 2023- ఖరీఫ్‌కు సంబంధించి రూ. 200 కోట్ల సిఎంఆర్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతోనే ఆయన జిల్లాలోని అందరి మిల్లర్ల కంటే ఎక్కువగా బాకీ పడి ఉండటంతో అప్పగించలేని స్థితిలో ఉన్న ఆయన ఎదురు దాడికి దిగాడని అధికారులు చెప్పుకొస్తున్నారు. దీనికి తోడు ఆయనకు ఉన్న రాజకీయ పలుకుబడితో అధికారులపై ఎదురుదాడికి దిగాడని మిగిలిన మిల్లర్లు బహిరంగంగానే వ్యాఖ్యనిస్తున్నారు. ఏది ఏమైనా సిఎంఆర్ రీకవరీ మాత్రం జిల్లా అధికారులకు కత్తిమీద సాములా మారింది.
మిల్లర్ల తిరుగుబాటు
RELATED ARTICLES