నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్‌లు
మధిరలో లైసెన్స్‌లు లేకుండా పుట్టగొడుగుల్లా ఏర్పాటు
ప్రజాపక్షం/మధిర మినరల్ వాటర్ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా ఏర్పడుతున్నాయి. కనీస నిబంధనలు కూడా పాటించకుండా వాటికి విరుద్ధంగా వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ఇష్టానుసారంగా నీరు సరఫరా చేస్తున్నారు. కరోనా నిబంధనలను సైతం ఉల్లంఘిస్తూ శుభ్రత పరిణామాలను గాలికొదిలి లైసెన్స్‌లు లేకుండా కొందరు, ఉన్నా రెన్యువల్ చేయకుండా మరికొందరు మినరల్ ప్లాంట్‌లు నిర్వహిస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్‌ల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు కావాలి, మినరల్‌లో కలపవలసిన కెమికల్స్ నమోదులు ఏ విధంగా ఉండాలి అనేవి కూడా పాటించకుండా నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నా రు. ప్రతి మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద తప్పనిసరి గా నీటి పరీక్ష కోసం ల్యాబ్ ఉండాలి. కానీ, అలాంటి ల్యాబ్‌లు చూడటానికే కనిపించడం లేద నే ఆరోపణలు లేకపోలేదు. ఖమ్మం జిల్లా మధిర మండలం, పట్టణంలో పెద్ద పెద్ద ట్యాంకుల్లో, వాటర్ టిన్నుల్లో నీటిని ఇష్టానుసారంగా నింపుతూ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా శుభకార్యాలు వచ్చాయంటే చాలు ఇష్టానుసారంగా డబ్బాల్లో నింపి సరఫరా చేస్తారు. నీటిని సరఫరా చేసేటప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్ సీల్ తప్పనిసరిగా ఉండాలి. కానీ అలాంటి దాఖలాలే కనిపించడం లేదు. వాటర్ ట్యాంకులు నడిపే ఆటో డ్రైవర్లకు లైసెన్స్‌లు కూడా లేకుండా అతివేగంతో ఇళ్ళ వద్దకు రావడంతో చుట్టుప్రక్కల ప్రజలు సైతం భయాందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూగర్భ జలాలకు ఎలాంటి హాని చేయకుండా, చుట్టుప్రక్కల ప్రజలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి అనుమతులు తీసుకొని ఐఎస్‌ఐ మార్క్ కలిగి ఇతరత్రా సర్టిఫికెట్లు పొందిన తర్వాతే వాటర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలి. అలాంటి నిబంధనలను తుంగలోకి తొక్కి కొందరు డబ్బే ముఖ్యంగా నీటి దందాను కొనసాగిస్తూ లాభార్జన పొందుతున్నట్లు పలువురు చెబుతున్నారు. కనీసం వాటర్ ట్యాంకుల శుభ్రత పట్ల కూడా నాణ్యత పాటించకుండా ఉంటే ఆరోగ్యాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించాలని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం రకరకాల వైరల్ వ్యాధులతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా భూగర్భ జలాలు అడుగుంటుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని మధిర మున్సిపాలిటీలో, మధిర మండలంలో నిబంధనలను విరుద్ధంగా అనుమతులు లేకుండా, శుభ్రత పాటించకుండా ఇష్టానురాజ్యంగా నీటి వ్యాపారం కొనసాగిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
‘మినరల్’ మాయాజాలం
RELATED ARTICLES