హామిల్టన్: భారత మహిళా స్టార్ క్రికెటర్, టీమిండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త చరిత్ర సృష్టించింది. శుక్రవారం న్యూజిలాండ్‌తో హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌తో హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్ తన కెరీర్ 200వ వన్డే మ్యాచ్ ఆడింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన మొదటి మహిళా క్రికెటర్‌గా మిథాలీ కొత్త రికార్డు సాధించింది. క్రికెట్ అంటే అమీతంగా ఇష్టపడే మిథాలీ చిన్న వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించింది. 1999లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది. అప్పటి నుంచి వెనకతిరిగి చూడలేదు. సుదీర్ఘంగా 20 ఏళ్ల నుంచి భారత జట్టుకు తన సేవలు అందిస్తోంది. ఈ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులను మిథాలీ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 263 వన్డే మ్యాచ్‌లు ఆడగా అందులో మిథాలీ 200 వన్డేల్లో జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 36 ఏళ్ల మిథాలీ తన వన్డే కెరీర్‌లో మొత్తం 200 వన్డే మ్యాచ్‌లు ఆడి అందులో 51 సగటుతో 6622 పరుగులు చేసింది. అందులో 180 సార్లు బ్యాటింగ్ చేసిన మిథాలీ ఏకంగా 51 సార్లు నాటౌగా నిలిచింది. అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్‌తో పాటు అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా కూడా మిథాలీ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. తన 200వ మ్యాచ్‌లో 9 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. కెరీర్ 200వ మ్యాచ్ ఆడిన మిథాలీకి సోషల్ మీడియాలో వివిఎస్ లక్ష్మణ్‌తో పాటు బిసిసిఐతో, క్రీడా ప్రముఖులు, అభిమానులు అభినందనల వర్షం కురిపించారు.