అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కోల్పోయిన హస్తం
5స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్
న్యూఢిల్లీ: హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీచినప్పటికీ.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో మాత్రం ఆ పార్టీకి భంగపాటు తప్పలేదు. మంగళవారం వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లో ఆధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్ మిజోరంలో ఓటమిని చవి చూసింది. ఫలితంగా ఈశాన్య భారతంలో కాంగ్రెస్‌కు గల ఒకే ఒక్క రాష్ట్రాన్ని ఆ పార్టీ చేజార్చుకుంది. మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2013లో మిజోరం శాసన సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. మొత్తం 40 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 34 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్‌కు గట్టి పోటీనిస్తుందనుకున్న మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ అప్పట్లో దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ కాంగ్రెస్‌కు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. అయితే ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా మారడం విశేషం. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శించిన దూకుడును ఈ సారి మిజో నేషనల్ ఫ్రంట్ కొనసాగించింది. దీంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కేవలం 5 అసెంబ్లీ స్థానాలనే సాధించి ఈశాన్యంలో తనకు గల ఒక్క రాష్ట్రాన్ని సైతం కోల్పోయింది. ఇక ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ పార్టీ గతంలో కన్న 21 సీట్లను అదనంగా కైవసం చేసుకొని.. మొత్తం 26 అసెంబ్లీ స్థానాలను గెలుకుని ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీని సాధించింది. ఇక మిజోరం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత లాల్ థాయ్‌హావ్లా కూడా ఎన్నికల్లో పరాభవాన్ని మూటకట్టుకున్నారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆయన ఓటమి పాలయ్యారు. సెర్‌ఛిప్, దక్షిణ ఛాం స్థానాల నుంచి థాయ్‌హావ్లా బరిలోకి దిగగా.. ఎక్కడ తన ప్రభావాన్ని చూపించలేకపోయారు.
10 ఏళ్లకు ఒక్కసారి మిజోరంలో మారుతున్న సర్కారు
1987లో మిజోరం పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఏ పార్టీ వరుసగా 3వ సారి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రతి 10 ఏళ్లకొక్కసారి కాంగ్రెస్, ఎంఎన్‌ఎఫ్ పార్టీల మధ్య అధికార బదలాయింపు జరుగుతూ వస్తోంది. 1998, 2003లో మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ కూటమి అధికారాన్ని చేపట్టగా.. తర్వాత కాలంలో కాంగ్రెస్ తన పాలనను కొనసాగింది. అయితే ఈసారి ఎంఎన్ ఎఫ్ అలయెన్స్, బిజెపి పార్టీలు కలిసి నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్‌ఈడిఏ)గా అవతరించాయి. దీంతో ఈసారి మిజోరంలో జరిగిన ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ అనూహ్యంగా 37.6 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 30.2 శాతం ఓట్లను సాధించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌కు అవరమైన సీట్లను పొందలేక ఢీలా పడింది. బిజెపి విషయానికొస్తే క్రిస్టియన్ ఆధిపత్యం కల్గిన రాష్ట్రమైన మిజోరంలో తన ఖాతాను తెరిచింది. బిజెపి తరపున దక్షిణ మిజోరంలోని లూచవంగ్ స్థానం నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి బుద్ధా ధాన్ విజయం సాధించారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బిజెపి తరపు పోటీలో నిలబడి గెలవడం విశేషం. ఇక జోరం నేషనల్ పార్టీ(జడ్‌ఎన్‌పి),మిజోరం పిపుల్స్ కాన్ఫరెన్స్(ఎంపిసి)పార్టీలు కలిసి మొత్తం పోలింగ్‌లో 22.9 శాతం ఓట్ల సాధించి 8 సీట్లను కైవసం చేసుకున్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్ కన్న ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ.. ఎక్కువ సీట్లు రావడం విశేషం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ శాసన సభ పక్ష నేత, ముఖ్యమంత్రి లాలా థాన్‌హావ్లా తన పదవి రాజీనామా చేశారు. ఇక ఎంఎన్‌ఎఫ్ తరపున ఎన్నికైన శాసన సభ్యులు మంగవారం సమావేశమై తన పార్టీ ఫ్లోర్ లీడర్‌గా జోరంథన్‌గను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.