ప్లాంటేషన్‌ను అడ్డుకున్న 154 దళిత రైతు కుటుంబాలు
రాజన్న సిరిసిల్లజిల్లా తుమ్మలకుంటలో భారీగా పోలీసుల మోహరింపు
పోడు భూములలో ప్లాంటేషన్
పురుగుమందులతో రైతుల ఆత్మహత్నాయత్నం
ప్రజాపక్షం/ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం తుమ్మలకుంటలో 30 ఏళ్ల నుంచి పొడు భూ ములను సాగు చేసుకుంటూ బతుకుతున్న తమ భూముల్లో ప్లాంటేషన్ చేపట్టవద్దంటూ పురుగుమందుతో దళిత రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తూ నిరసన తెలిపారు. చందుర్తి అటవీ క్షేత్ర అధికారి పర్యవేక్షణలో మరిమ డ్ల సెక్షన్ పరిధిలోని తుమ్మలకుంట పోడు భూములలో సిఐలు బన్సీలాల్, శ్రీలత, ఏడుగురు ఎస్‌ఐలతో పాటు భారీగా పోలీసులను మోహరించి అటవీ అధికారులు ఇతర కూలీలతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. దీంతో తాము 30 ఏళ్ల నుంచి తుమ్మలకుంట భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ప్లాంటేషన్ పేరుతో తమ కడుపులు కొట్టొద్దంటూ గర్జనపల్లి గ్రామానికి చెందిన 154 మంది దళిత కుటుంబాలు కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశా యి. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకుని కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ తరుణంలో గర్జనపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొక్కలు నాటితే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామంటూ దళిత కుటుంబాలు నిరసన తెలియజేశారు. పోలీసు బలగాలు, అటవీ అధికారులు, దళిత రైతు కుటుంబాలు, మహిళల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. కాగా, తమకు నాలుగు రోజుల వ్యవధి కావాలని ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించవద్దని చందుర్తి అటవీ క్షేత్రస్థాయి అధికారికి రాసిన వినతిపత్రంలో గర్జనపల్లికి చెందిన దళిత కుటుంబాలు విన్నవించాయి. నాలుగు రోజులలో పై అధికారుల నుండి న్యాయం జరగని పక్షంలో భూములలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలని దళిత రైతుకుటుంబాలు వినతిపత్రంలో అటవీ అధికారులను వేడుకున్నారు. 154 మంది దళిత రైతు కుటుంబాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రి కెటిఆర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.