కొత్త చట్టాలు రద్దు చేస్తేనే చర్చలు
సవరణల ప్రస్తావనే లేదు
మోడీ సర్కారుకు తేల్చిచెప్పిన రైతులు
కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అన్నదాతలు
నిరాహార దీక్షగా రైతు దినం
ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనలు
న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలను ఉపసంహరించాల్సిందేనని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తు న్న రైతులు మరోసారి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లలో మార్పులేదని, తాము కోరుతున్న ఏకైక డిమాండ్ ‘చట్టాల రద్దు’ అని స్పష్టం చేశా రు. సవరణలకు ఒప్పుకోవాలని కేంద్రం చేసిన ప్రతిపాదనను నిర్దంద్వం గా తిరస్కరించారు. ఇలాం టి ప్రతిపాదనలుంటే చర్చలకు ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీ సింఘు సరిహద్దుల్లో నిరసన తెలియజేస్తున్న రైతు సంఘాల నాయకులు బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. సవరణలు చేస్తామన్న హామీని మళ్లీమళ్లీ చెప్పవద్దని, వాటిని మేము ఇంతకుముందే తిరస్కరించామని, చట్టాలను రద్దుచేస్తామన్న బలమైన ప్రతిపాదనలతో ప్రభు త్వం ముందుకువస్తే చర్చలకు సిద్ధమని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. “మేము ఇంతకుముందే హోం మంత్రి అమిత్ షాకు సవరణలను ఆమోదించమని చెప్పాం” అన్నారు రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు శివ్‌కుమార్ కక్కా. విలేకర్ల సమావేశంలో అక్కడే ఉన్న స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ ప్రభుత్వ కొత్త లేఖ రైతుల ఉద్యమాన్ని అప్రతిష్ఠ పాలుచేసే ప్రయత్నమని విమర్శించారు. ఇంకా యునైటెడ్ ఫార్మర్స్ ఫ్రంట్ ఈ రోజు ప్రభుత్వానికి లేఖ రాసింది. తాము ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవమని, దానిని ప్రభుత్వం ప్రశ్నించకూడదని ఇందులో పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులు అని చెప్పుకునేవాళ్లతో సమావేశాలు జరుపుతోం ది. అయితే వాళ్లకు తమ ఉద్యమంతో ఎలాంటి సంబంధమూ లేదు. ఇదంతా ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నమే. ప్రభుత్వం ప్రతిపక్షంతో వ్యవహరించినట్లుగానే ప్రభుత్వం నిరసన చేస్తున్న రైతులతో వ్యవహరిస్తోందని ఆరోపించారు యోగేంద్ర యాదవ్. రైతుల ఆందోళన 28 రోజులకు చేరిన సందర్భంలో రైతుల పట్ల ప్రభుత్వం స్పష్టమైన ఉద్దేశాలు, విశాల హృదయంతో చర్చలు జరుపుతుందని ఎదురు చూస్తున్నామనియోగేంద్ర యాదవ్ ప్రకటించారు. నిరసన ఆగిపోయేందుకు ప్రభుత్వం రైతులను అలసిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు హన్నన్ మొల్లా ఆరోపించారు.
సంస్కరణలు కొనసాగుతాయి: తోమర్
వ్యవసాయ రంగంలో సంస్కరణలను ప్రభుత్వం కొనసాగిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం నాడు పునరుద్ఘాటించారు. ఇంకా చాలా రంగాల్లో సంస్కరణలు జరగాల్సి ఉందని, మూడు సాగు చట్టాల మీద అనుమానాలను పరిష్కరించుకునేందుకు రైతులు కేంద్రంతో మళ్లీ చర్చలకు వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. చరిత్రలో ఏ ఆందోళనైనా చర్చల ద్వారానే పరిష్కారమైందని, తదుపరి విడత చర్చల కోసం రైతులు ఏదో ఒక తేదీని నిర్ణయించాలని మంత్రి కోరారు. ఇదిలా ఉండగా నిరసనకారులు మూడు చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌కే కట్టుబడి ఉన్నారు. కేంద్రం ప్రతిపాదించిన చర్చలకు ఇంకా తమ నిర్ణయాన్ని రైతులు వెల్లడించలేదు. నాలుగు వారాలుగా వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ స్థలాల్లో నిరసనలు చేస్తున్నారు. సెప్టెంబర్‌లో ఆమోదించిన వ్యవసాయ చట్టాల్లో కనీసం ఏడు సవరణలు చేస్తామని కేంద్రం రైతులకు ఒక ప్రతిపాదనను పంపించింది. కొత్త చట్టాల విషయంలో ఇప్పటికి ఐదు విడతల చర్చలు జరిగాయి. అయితే అవేవీ పరిష్కారాన్ని చూపించలేకపోయాయి. అయితే కొన్ని ఇతర రైతు సంఘాలు మాత్రం ఈ మధ్యలో కొత్త చట్టాలకు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించాయి. మూడు సాగు చట్టాలు మండీ వ్యవస్థను, కనీస మద్దతు ధర బలహీన పరుస్తాయని, తమను బడా కార్పొరేట్ల దయకు వదిలేస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇవన్నీ అపోహలేనని, ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని వాదిస్తోంది. అందుకని రైతు సంఘాలు తొందరగా చర్చించుకొని, తమ నిర్ణయాన్ని తెలపాలని, ఆ వెంటనే ప్రభుత్వం మరో విడత చర్చలు జరుపుతుందని తోమర్ తెలిపారు. బుధవారం భారతదేశ ఐదో ప్రధానమంత్రి చౌధరి చరణ్ సింగ్ జయంతి ‘జాతీయ రైతుల దినోత్సవం’ సందర్భంగా రైతులందరికీ తోమర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం విశాల హృదయంతో వినేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. “నిరసన ఎంతకాలంగా, ఎంత బలంగా సాగినా అది ముగిసేందుకు, పరిష్కారం దొరికేందుకు చర్చలే మార్గం. చరిత్రే దీనికి సాక్ష్యం” అని చర్చల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు తోమర్. ప్రభుత్వ ప్రతిపాదనలను రైతు సంఘాలు చర్చించాలని, ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు.
సంస్కరణలకు గతంలోనే సిఫారసులు
సాగు చట్టాలకు మద్దతు తెలిపిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌జివోస్ ఆఫ్ రూరల్ ఇండియా (సిఎన్‌ఆర్‌ఐ) ప్రతినిధులతో మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం ప్రధాన రంగం అన్నారు తోమర్. అలాంటి రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ఆరేళ్లుగా సాగు రంగాన్ని సంస్కరించేందుకు చాలా వరకు ప్రయత్నాలు జరిగాయి. అయితే సంస్కరణలు చేయాల్సిన రంగాలు ఇంకా చాలానే ఉన్నాయన్నారు తోమర్. సేద్య రంగంలో సంస్కరణల కోసం గతంలో కూడా నిపుణులు, సంఘాలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిపారసులు చేశారని, అయితే గత ప్రభుత్వం వాటిని చట్టాలుగా మలచలేక పోయింది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం సంస్కరణలు తీసుకువచ్చిందని, చాలా మంది రైతులు వీటికి అనుకూలంగా ఉన్నప్పటికీ, కొంతమంది మాత్రం అడ్డుకుంటున్నారని ఆరోపించారు తోమర్. చట్టాలకు మద్దతుగా పంజాబ్‌తో సహా 20 రాష్ట్రాల నుంచి 3,13,363 మంది సంతకాలున్న ఆరు పెట్టెలను సిఎన్‌ఆర్‌ఐ మంత్రికి అందజేసింది. వీరిలో పంజాబ్ రైతులు 12,895 మంది సంతకాలు ఉండగా, హర్యానా రైతులవి 1,27,000 ఉన్నాయి.
ప్రధానికి రక్తంతో లేఖ రాసిన రైతు
మాజీ ప్రధానమంత్రి చౌధరి చరణ్ సింగ్ జయంతి ‘కిసాన్ దివస్’ అయిన బుధవారం నాడు ఒకపూట భోజనం మానుకోవాలని రైతు సంఘాల నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతు అనుకూల విధానాలకు ప్రసిద్ధి చెందిన చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్‌ను కొంతమంది రైతులు సందర్శించి, శ్రద్ధాంజలి తెలిపారు. ఘాజీపుర్ సరిహద్దుల్లో ఉన్న రైతులు యజ్ఞం నిర్వహించారు. ఈ నెల 23 నుంచి 26 వరకు “షాహిదీ దివస్”గా జరుపుకోనున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ (లోక్‌శక్తి) అధ్యక్షుడు శివ్‌రాజ్ సింగ్ బుధవారం నాడు కొత్త సాగు చట్టాలను విరమించుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి మోడీకి తన రక్తంతో లేఖ రాశారు. ఆయన ఈ నెల 2 నుంచి ఢిల్లీ నోయిడా సరిహద్దుల్లోని దళిత్ ప్రేరణా స్థల్‌లో నిరసనల్లో భాగమయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాలని కోరుతూ ఈ లేఖను నోయిడా నగర మేజిస్ట్రేట్‌కు అందజేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులతో ఫోన్‌లో మాట్లాడారు. వారికి తన మద్దతు తెలియజేశారని, కొంతమంది మమతను ధర్నా స్థలాలను దర్శించాలని కోరారని ఒక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. ఇక ఎల్గార్ పరిషత్ మావోయిస్టు సంబంధాల కేసులో అరెస్టయిన పలువురు కార్యకర్తలు మహారాష్ట్రలోని తాలోజా కారాగారంలో ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా రైతులకు మద్దతుగా బుధవారం ఒక్కరోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు.
మా డిమాండ్ ఒక్కటే!
RELATED ARTICLES