మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఐఇడి పేల్చిన నక్సల్స్
15 మంది పోలీసులు దుర్మరణం, వాహనం డ్రైవర్ మృతి
అంతకు ముందు రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న 25 వాహనాలకు నిప్పు
ముంబయి: మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే రెండు ఘాతుకాలకు పాల్పడ్డారు. బుధవారం తెల్లవారుజామున గడ్చిరోలి జిల్లాలో ఓ రోడ్డు నిర్మాణ కంపెనీకి చెం దిన 25 వాహనాలను దగ్ధం చేశారు. మధ్యాహ్నం ఓ పోలీస్ వాహనంపై ఐఇడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 15మంది భద్రతాసిబ్బంది ఉండగా, వాహన డ్రైవర్ కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గడ్చిరోలి జిల్లాలోని దాదాపూర్‌లో మావోయిస్టులు దగ్ధం చేసిన వాహనాలను పరిశీలించేందుకు వెళ్తున్న తక్షణ స్పందన దళం (క్విక్ రెస్పాన్స్ బృందం)పై నక్సల్స్ శక్తివంతమైన బాంబును పేల్చారన్నారు. కుర్‌ఖేదా ప్రాంతంలోని లెంధరీ నల్లా వద్దకు రాగానే భద్రతాసిబ్బంది ఉన్న ఓ వాహనాన్ని శక్తిమంతమైన ఐఇడి బాంబుతో పేల్చారు. ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పేలుడు తీవ్రతకు వాహనం తునాతునకలైంది. ఘటన అనంతరం నక్సల్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా, కుర్‌ఖేదా తహశీల్‌లోని దాదాపూర్‌లో జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న 25 వాహనాలకు బుధవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు నక్సల్స్ నిప్పుపెట్టినట్లు గడ్చిరోలి ఎస్‌పి శైలేష్ బాల్సవాడ పేర్కొన్నారు. కాగా, ఈ నిర్మాణ పనులను అమర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థ చేస్తోంది. ఈ కంపెనీకి దాదాపూర్‌లో దాదర్ ప్లాంట్ ఉంది. రోడ్డు నిర్మాణం కోసం వినియోగిస్తున్న వాహనాలను ఈ ప్లాంట్‌లోనే నిలిపి ఉంచారు. ఈ ప్లాంట్‌లోకి మావోయిస్టులు చొరబడి వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రూ. 10కోట్ల మేర ఆస్తి నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో నేడు ‘మహారాష్ట్ర దినోత్సవం’ జరుపుకుంటున్నారు. ఈ సమయంలో మావోయిస్టులు ఇలాంటి దాడులకు పాల్పడటం గమనార్హం.