డైరీ ఆవిష్కరణ వేడుకలో చిరంజీవి, రాజశేఖర్‌ల మధ్య వాగ్వాదం
అసోషియేషన్‌లో విభేదాలున్నాయన్న రాజశేఖర్
వివాదాలుంటే అంతర్గతంగా పరిష్కరించుకుందామన్న చిరంజీవి
సభ నుంచి రాజశేఖర్ వాకౌట్.. క్షమాపణ కోరిన జీవిత
హైదరాబాద్ : మా అసోసియేషన్ వేదికగా మరోసారి చిరంజీవి, రాజశేఖర్ మధ్య ఉన్న విభేదాలు గుప్పుమన్నాయి. 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఈ భేధాభిప్రాయాలకు వేదిక అయింది. తాజాగా పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో..పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి రాజశేఖర్ మైకు లాక్కోవడంతో వివాదం నెలకొంది. మొదటగా ఈ సభలో మాట్లాడిన చిరంజీవి.. ’మా’లో మంచి ఉంటే మైక్‌లో చెబుదాం.. చెడు ఉంటే చెవులో చెబుదాం అని అన్నారు. చిరంజీవి మాట్లాడుతున్నంతసేపు ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డ రాజశేఖర్.. తరువాత చిరంజీవి వ్యాఖ్యలకు నిరసనగా వేదిక పైకి వచ్చి.. వ్యాఖ్యాత పరుచూరి నుంచి మైకు లాక్కున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. చిరంజీవి ప్రసంగాన్ని తప్పుబట్టారు. సినీ పెద్దలు చెప్పేది ఒకటి.. చేసేది మరోకటి అని తీవ్ర విమర్శలు చేశారు. మా అసోషియేషన్‌లో గ్రూపులు ఫాం అయినట్టుగా చెప్పిన రాజశేఖర్, కొంత మంది వ్యక్తులు తెర మీద హీరోలుగా ప్రవర్తించినా నిజ జీవితంలో మాత్రం అలా హీరోగా ప్రవర్తించే వారిని తొక్కేస్తున్నారన్నారు. మాలో అంతా సవ్యంగా లేదని చాలా తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. ’మా’ డైరీ ఆవిష్కరణలో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. చిరంజీవి ’మా’ లో ఒక మెంబర్ మాత్రమే.. ఆయనకు అంతలా ప్రాధాన్యత ఇవ్వడం బాగోలేదన్నారు. అంతేకాదు వేదికపై ఉన్న చిరంజీవి సహా పెద్దలకు కాళ్లు మొక్కి వేదిక దిగి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన చిరంజీవి.. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. రాజశేఖర్ వేదిక మీద ఉన్న పెద్దలను అవమానించేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవల గురించి పబ్లిక్‌గా చర్చించ వద్దని చెప్పినా వినకుండా రాజశేఖర్ వేదిక మీద మాట్లాడటం సరికాదన్నారు. కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని.. అలాంటి వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చిరంజీవి కోరారు.
రాజశేఖర్‌కు ఆవేశం ఎక్కువ..
నటుడు మురళి మోహన్ స్పందిస్తూ, రాజశేఖర్ గారు అ మాంతం స్టేజ్ మీదకు వచ్చి మైక్ లాక్కుని అసోసియేషన్ లో గొడవలు జరుగుతున్నాయని అనడం తగదని, అటువంటివి ఏమైనా ఉంటె మిగతావారందరితో కలిసి మీటింగ్ లో చర్చించాలని, అంతేకాని ఈ విధంగా సభలో మైక్ లా క్కుని మాట్లాడడం కరెక్ట్ కాదని, ఈ విధంగా వ్యవహరించిన రాజశేఖర్ గారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామ ని అన్నారు. అనంతరం, మోహన్ బాబు, కృష్ణం రాజు కూ డా రాజశేఖర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాగా ఈ ఘటన పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.
మా ఆయన చంటిపిల్లాడు..
మా ఆయన చంటిపిల్లాడు లాంటోడని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది జీవితారాజశేఖర్. ’మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాబాసగా మారిన విషయం తెలిసిందే. మాలో ఉన్న విబేధాల గురించి రాజశేఖర్ ఎత్తిచూపటంతో చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ తీరును ఖండిస్తూ ప్రొటోకాల్ పాటించకుండా మాట్లాడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మాట్లాడిన జీవిత రాజశేఖర్ తన భర్త రాజశేఖర్ చేసిన పనికి తాను క్షమాణ చెబుతున్నానన్నారు. రాజశేఖర్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, ఆయన ఏది దాచుకోడు, మనసుకి ఏది అనిపిస్తే అది అనేస్తాడు. కోపం కూడా ఎక్కువే ఆయనకు. టోటల్‌గా రాజశేఖర్ మోర్‌దాన్ ఎ కిడ్ అని జీవిత అన్నారు. మాలో కార్యవర్గ సభ్యురాలినైనప్పటినుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, చిరంజీవి కూడా ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారని జీవిత అన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు సహజమేనని అవన్నీ పక్కనపెట్టి సినిమా పరిశ్రమకోసం కష్టపడదామని జీవిత కోరారు.
‘మా’కు రాజీనామా..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజశేఖర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖని విడుదల చేశారు. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన వివాదంపై కలత చెందిన రాజశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మా అధ్యక్షుడు నరేష్ ఏకపక్షంగా వ్యవహరించారని రాజశేఖర్ పేర్కొన్నారు. ’మా’ అసోసియేషన్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ’మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) డైరీ ఆవిష్కరణ సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ ప్రవర్తనతో ఇబ్బంది పడిన చిరంజీవి, ఈ కార్యక్రమాన్ని రసభాస చేయడానికే రాజశేఖర్ ముందుగా ప్లాన్ చేసుకు వచ్చారేమో అనిపిస్తోందని అన్నారు. అయితే రాజశేఖర్ ప్రవర్తనపై వెంటనే చర్యలు తీసుకోవాలని చిరంజీవి, మా అధ్యక్షుడు నరేష్‌ను కోరారు. అయితే నరేష్ దీనిపై స్పందించే లోపే రాజశేఖర్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
‘మా’లో మళ్లీ యుద్ధం
RELATED ARTICLES