HomeNewsLatest Newsమార్మోగిన భాగ్యనగరం

మార్మోగిన భాగ్యనగరం

కనులపండువగా గణేశ్‌ శోభాయాత్ర
ఉత్సాహభరిత వాతావరణంలో నిమజ్జనోత్సవం

ప్రజాపక్షం/హైదరాబాద్‌
‘జై బోలో గణేశ్‌ మహారాజ్‌ కీ జై’ అంటూ భాగ్యనగరం మొత్తం నామస్మరణ మార్మోగిపోయింది. గణేశ్‌ నిమజ్జనోత్సవం జరిగిన ట్యాంక్‌బండ్‌ పరిసరాలు గణేశ్‌ మహారాజ్‌కీ జై నినాదాలతో భక్తులు పులకించిపోయారు. వెళ్లి రావయ్యా గణపయ్య, మళ్లీ రావయ్యా లంబోదరా అంటూ నగర వాసులు మహా గణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. అశేష భక్తుల పూజలందుకున్న బడా గణేశుడి నిమజ్జనం, ఘనంగా పూర్తుంది. శోభాయాత్ర ఆద్యంతం డిజె సౌండ్‌ పాటలతో, బ్యాండు భజాంత్రిలతో ఉత్సహభరిత వాతావరణంలో కనులవిందుగా సాగింది. గణపతికి అడుగడుగునా భక్తులు నీరాజనం పలికారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా కనులపండుగగా గణేశుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చారు. ఈ క్రమంలో ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతం గణేశుడి నిమజ్జనానికి విచ్చేసిన భక్తులతో కిక్కిరిసిపోయి సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంతో సందడి నెలకొంది. ఖైరతాబాద్‌ గణేశున్ని ముందుగా అనుకున్నట్లుగానే మధ్యాహ్నం నిమజ్జనం పూర్తి చేశారు. బాలాపూర్‌ గణేశున్ని సైతం మధ్యాహ్నం మూడు గంటల తరువాత నిమజ్జనం పూర్తి చేయడంతో పోలీసులు ఊపిరిపిల్చుకున్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనాన్ని హుస్సేన్‌సాగర్‌లో కనులారా వీక్షించేందుకు భారీ తరలివచ్చారు. దీంతో హుస్సేన్‌ సాగర్‌ ప్రాంతాలైన ట్యాంక్‌ బండ్‌, ఎన్‌టిఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌, సచివాలయం ఐ మ్యాక్స్‌, నెక్లెస్‌ రోడ్‌, మీనిస్టర్‌ రోడ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, సికింద్రాబాద్‌ బుద్ధభవన్‌, కావాడిగూడ మార్గాలు గణేశుని శకటాలతో కిక్కిరిసిపోయాయి. మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాది గణపతులను హుస్సేన్‌సాగర్‌లోకి నిమజ్జనం చేస్తూ వెళ్లిరావయ్యా గణపయ్య మళ్లీ అంటూ జనాలు నీరాజనం పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ప్రతి సంవత్సరం బాలాపూర్‌ గణేశుడు వెంట వచ్చే ప్రధాన ఊరేగింపు ఈసారి కాస్త అలస్యంగా ప్రారంభమైంది. ముందుగా బాలాపూర్‌ గణేశుడు హుస్సేన్‌సాగర్‌ వైపు ఊరేగింపు సాగగా, అనంతరం ప్రధాన ఊరేగింపు ప్రారంభమైంది. దీంతో మొజాంజాహీ మార్కెట్‌ నుంచి ఇటు హుస్సేన్‌ సాగర్‌ వరకు భారీ సంఖ్యలో గణేశుని శకటాలు బారులు తీరాయి. భారీ శకటాలు ఒకవైపు నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన జనవాహినితో సాగర్‌ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఇసుకవేస్తే రాలనంతగా జనం వచ్చారు. ఈసారి హుస్సేన్‌ సాగర్‌కు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రజల తాకిడిని పోలీసులు అదపుచేయలేకపోయారు. అయితే భక్తులకు జలమండలి తాగునీటి క్యాంపులు ఏర్పాటు చేసింది. వివిధ భక్త సమాజ్‌లు, అసోసియేషన్‌లు, స్వచ్ఛంద సంస్థలు గణేశునికి ప్రత్యేకంగా స్వాగత వేదికలు ఏర్పాటు చేసి, అల్పహారం, ప్రసాదం పంపిణీ చేశారు. శోభయాత్ర దారిపోడవున ప్రసాద పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి
అశేష భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్‌ బడా గణేశుడి నిమజ్జనం అత్యంత ఉత్సహభరిత వాతావరణంలో ఘనంగా పూర్తుంది. శోభాయాత్ర ఆద్యంతం కనులవిందుగా సాగింది. మహాగణపతికి అడుగడుగునా భక్తులు నీరాజనం పలికారు. 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న భారీ గణేశుడు, గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. భారీ విజ్ఞాధిపతిని హుస్సేన్‌సాగర్‌లో నిజ్జమనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది. ఖైరతాబాద్‌ నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. దీంతో నగర నడిబొడ్డున సాగర ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జై బోలో గణేశ్‌ మహరాజ్‌కీ జై అంటూ జయజయధ్వానాలు మార్మోగాయి. భక్తజనం చూస్తుండగానే కనురెప్ప పాటు కాలంలో గంగమ్మ ఒడిలోకి ఆ పార్వతీ పుత్రుడు చేరుకున్నాడు. 70 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో వివిధ రూపాల్లో పూజలందుకున్న గణేశుడు, ఈసారి 70 అడుగుల మట్టి ప్రతిమతో ప్రపంచంలోనే ఎత్తయిన మట్టి గణపతిగా రికార్డుకు ఎక్కాడు. ఖైరతాబాద్‌, సెన్సేషన్‌ థియేటర్‌, టెలిఫోన్‌ భవన్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ పక్క నుంచి, సచివాలయం ముందు నుంచి సాగర తీరానికి ఖైరతాబాద్‌ గణనాథుడి శోభాయాత్ర వైభవంగా సాగింది. శోభయాత్రను కనులారా వీక్షించేందుకు తరలిన భక్తజనంతో ట్యాంక్‌బంద్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా రద్దీ ఏర్పడింది. ముందెన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments