యువతరం గాంధేయ మార్గంలో పనిచేస్తే అద్భుత ఫలితాలు
ఒక్కో గ్రామాన్ని దత్తత తీసు కోవాలి : అన్నా హజారే
గాంధీ పుస్తకం చదవకపోతే ఆత్మహత్యే
ప్రజాపక్షం/ హైదరాబాద్ : యువత ఒక్కో గ్రామాన్ని దత్తత తీసు కోవాలని, గ్రామం నుంచే మార్పు మొదలు కావాలని ప్రముఖ గాంధేయవాది అన్నా హాజారే అన్నారు. నేటి యువతరం గాంధేయ మార్గంలో పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని, దేశం, సమాజం కోసం ఆలోచించాలని సూచించారు. అభివృద్ధి, అవినీతి అంతం చేయడమనేది రెండూ ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివని, యువత మేలుకుంటే దేశ భవిష్యత్తు ఎంతో దూరంలో ఉండబోదన్నారు. ప్రకృతి విధ్వంసం కాకుండా దేశ అభివృద్ధి జరగాలన్నారు. హైటెక్‌సిటీలోని నోవాటెల్ హోటల్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం “గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణ”అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సుకు అన్నా హాజారే ముఖ్య అతిథిగా హాజరవ్వగా జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత అధ్యక్షోపన్యాసం చేశారు. అన్నా హాజారే మాట్లాడుతూ దేశాన్ని మార్చాలంటే ముందు గ్రామాలు మారాలని, అప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. అహింస మార్గంలోనే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. పోరాట ఫలితంగానే ఆర్‌టిఐ వంటి చట్టాలు వచ్చాయని చెప్పారు. కొంత యువత కేవలం తినడం, తాగడం, మరణించడం అనే అంశాలకే పరిమితమైందని, యువతకు మంచి దిశా నిర్దేశం జరిగితే లక్ష్యం ఏర్పడుతుందని, తద్వారా ఆ లక్ష్య సాధనకు ముందుకు సాగవచ్చన్నారు. లక్ష్యసాధనలో అనేక ఇబ్బందులు, అడ్డంకులు వస్తాయని, వ్యతిరేకులు కూడా ఉంటారని, ప్రాణం పోయినా లక్ష్య మార్గాన్ని వీడొద్దని సూచించారు. భూమి మీదకు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదని, చనిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకుపోమని, అలాంటిది తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి రాత్రి 10గంటల వరకు జీవితమంతా ఉరుకులు, పరుగులు తీస్తారని, జీవితాంతం నాది నాది అంటూ గడిపేస్తారని పేర్కొన్నారు. త్యాగా లు చేసిన వారినే సమాజం గుర్తుంచుకుంటుందని, కోటీశ్వర్లను గుర్తుంచుకోదని, అందుకే వారి జయంతి ఉత్సవాలను నిర్వహించబోరన్నారు.