ప్రజాపక్షం / హైదరాబాద్ : మిషన్ భగీరథ ద్వారా వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ప్రతీ ఇంటిలో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని బయట కనిపించవద్దని చెప్పారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలనే తేడా లేకుం డా రా్రష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందివ్వాలని, ఖర్చుకు వెనుకాడవద్దని సిఎం స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో సోమవారం మిషన్ భగీరథపై సిఎం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, సిఎంఒ కార్యదర్శి స్మితా సభర్వాల్, మిషన్ భగీరథ ఇఎన్‌సి కృపాకర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు వేముల ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, గొంగిడి సునిత, రాజేందర్ రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, భాస్కర్ రావు, వివిధ జిల్లాల నుంచి సిఇలు, ఎస్‌ఇలు, ఇఇలు పాల్గొన్నారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అధికారులు పురోగతిని వివరించారు. మొత్తం 23,968 ఆవాస ప్రాంతాలకు గాను, 23, 947 ఆవాస ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా నీరు అందుతున్నదని అధికారులు చెప్పారు. మరో 21 గ్రామాలకు మాత్రమే అందాల్సి ఉందన్నారు. అవి కూడా కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉన్నవేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇండ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు నివేదించారు. ఒహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నదన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. అచ్చంపేట, సిర్పూరు నియోజకవర్గాలు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం లాంటి జిల్లాల్లోని మారుమూలలో ఉన్న చిన్న పల్లెలకు, ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న ఆవాస ప్రాంతాలకు కూడా కష్టమైనా సరే, ఆర్థికంగా భారమైనా సరే మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలని గడువు విధించారు. మార్చి 31లోగా అన్ని ప్రాంతాల్లో అన్ని పనులు పూర్తి చేయాలని, ఆ తర్వాత రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్ల సరఫరా కాని ఇల్లు ఒక్కటి కూడా మిగల వద్దని సిఎం నిర్దేశించారు. “ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలి. ఇప్పటి వరకు జనం ఎక్కడికక్కడ ఉన్న వనరులతో అవసరాలు వెళ్ల దీసుకున్నారు. ఏదో ఓ నీళ్లు తాగారు. ఒకసారి మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన మంచినీరు తాగిన తర్వాత ప్రజలు మరో రకం నీళ్లు తాగలేరు. ఏ ఒక్క రోజు మంచినీరు అందకున్నా తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. ప్రతీ రోజు మంచినీటి సరఫరా చేయడానికి అవలంభించాల్సిన వ్యూహం కూడా ఖరారు చేసుకోవాలి” అని సిఎం అధికారులకు సూచించారు. “మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టాలని అనుకున్న రోజు చాలా మందికి చాలా అనుమానాలుండేవి. ఈ కార్యక్రమం అవుతుందా? అనే సందేహాలుండేవి. కానీ అధికారులు, ఇంజినీర్లు ఎంతో కష్టపడి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల పైపులైన్లు వేశారు. నదీ జలాలను ప్రతీ ఊరికి తరలిస్తున్నారు. ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందిస్తున్నారు. దేశంలో మరెవ్వరూ చేయని అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం చేసి చూపెడుతున్నది. దేశానికి ఇది ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాయి. మన నుంచి సహకారం కూడా కోరుతున్నాయి. ఆయా రాష్ట్రాలకు అవసరమైన సహకారం అందించడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేశాం. మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా, దేశానికి ఆదర్శంగా నిలిచింది. దీన్ని విజయవంతం చేసిన ఘనత అధికారులు, ఇంజనీర్లదే. వారికి నా అభినందనలు. ఎంతో శ్రమకోడ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో ప్రాజెక్టును నిర్వహించడంపై దృష్టి పెట్టాలి” అని సిఎం అదికారులకు చెప్పారు.
మార్చి 31 నాటికి ప్రతీ ఇంటికీ ‘మిషన్’ మంచినీళ్లు
RELATED ARTICLES