రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖలు
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన రెండోసారి లాక్‌డౌన్‌ను పలు రాష్ట్రాలు కఠినంగా అమలు చయకపోవడంపై కేం ద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యవసరం కాని సేవలకు అనుమతినిస్తూ నిబంధనలు సడలించడంపై మండిపడింది. ఇలాంటి ఏమరపాటు చర్యల వల్ల కరోనా విజృంభించే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు ప్రధాన కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్ల సోమవారం లేఖ రాశారు. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం సడలింపు ఇవ్వని కార్యకలాపాలకు కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుమతులు ఇచ్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అన్ని రాష్ట్రాలు సవరించిన ఏకీకృత మార్గదర్శకాలను వర్తింప చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో భల్ల పేర్కొన్నారు. అదే విధంగా కఠిన నిబంధనలు పాటించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యంగా లాక్‌డౌన్ సడలింపు చేయడం వల్ల పలు చోట్ల సామాజిక ఎడబాటును ఉల్లంఘించడమే కాక పట్టణ ప్రాంతాల్లో స్వేచ్ఛగా వాహనదారులు రోడ్ల మీదకు వస్తున్నారన్న విషయాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. కాబట్టి వెంటనే రెండవసారి లాక్‌డౌన్ అమలు చేయడంపై కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు.