జీ జిన్‌పింగ్ ప్రతిజ్ఞ
బీజింగ్: మార్క్సిజం పునాదులపై చైనా దేశాన్ని తొలి ఆధునిక సోషలిస్టు దేశంగా తీర్చిదిద్దుతామని చైనా కమ్యూనిస్టునేత, ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రతిజ్ఞ చేశారు. కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ చైనా (సిపిసి) 20వ నేషనల్ కాంగ్రెస్ (జాతీయ మహాసభలు) మంగళవారం మూడవరోజుకు చేరింది. ఐదేళ్ళకు ఒకసారి జరిగే ఈ మహాసభ ఈనెల 22వ వరకూ ఏడురోజులపాటు జరుగుతుంది. మంగళవారం మధ్యా హ్నం జిన్‌పింగ్ అధ్యక్షతన జరిగిన రెండో సమావేశంలో, 19వ సిపిసి, 19వ క్రమశిక్షణా కమిటీ నివేదికలను పార్టీ నిబంధనావళిలో మార్పులు చేర్పులకు వీలు గా సభ్యులముందు చర్చకు పెట్టాలని తీర్మానించారు. 2049 నాటికి కమ్యూనిస్టుపార్టీ చైనాలో అధికారంలోకి వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఆ సమయానికి చైనా దేశాన్ని అత్యాధునిక సోషలిస్టు విలువలు గల దేశంగా తీర్చిదిద్దాలని మొదటిరోజు కీలకోపన్యాసంలోనే జిన్‌పింగ్ ఉద్ఘాటించారు. అనంతర తీర్మానాల్లో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా మహాసభ ముందుకు తీసుకువచ్చింది. 21వ శతాబ్దపు కొత్త సహస్రాబ్ది లక్ష్యాలను దేశ ప్రజలు సోషలిస్టు విలువలు, అంకితభావం, బాధ్యతతో ముందుకు తీసుకువెళ్ళేలా కృషి చేస్తామని జిన్‌పింగ్ పేర్కొన్నారు. మావో జెడాంగ్ తర్వాత మూడో విడత కూడా దేశాధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టి జిన్‌పింగ్ చరిత్ర సృష్టించారు. ప్రపంచ ప్రజల సంక్షేమంకోసం చైనీయులు చేసే కృషిలో సరికొత్త నాగరికతా విలువలను చైనా దేశం ఆవిష్కరించగలదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.2,300 మంది ప్రతినిధులు పాల్గొంటున్న సమావేశంలో తొలిరోజు జిన్‌పింగ్ జాతీయ,అంతర్జాతీయ,ఆర్థిక,సామాజిక రంగాలకు చెందిన అంశాలతోపాటు దేశంలో సైనిక,పారిశ్రామిక, సేవా రంగాలను, సరఫరా వ్యవస్థలను,సాంకేతికతను పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోడానికి శతాబ్ది ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. అమెరికా తరువాత ప్రపంచంలో రెండవ ఆర్థిక వ్యవస్థగా అవతరించిన చైనాలో డెంగ్‌జియావో పింగ్ కాలంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రతి ఇంటినీ కుటీరపరిశ్రమగా మార్చారు.1976లో మావో జెడాంగ్ మరణం తరువాత డెంగ్ జియావోపింగ్ పదవీ బాధ్యతలు చేపట్టి సోషలిస్టు సంక్షేమరాజ్యస్థాపన దిశగా సిద్ధాంతపరమైన సరికొత్త ప్రణాళికలను అమలు చేసి దేశాన్ని ముందుకు నడిపించారు. ఈ ప్రణాళికతో సామూహిక విదేశీ పెట్టుబడులను చైనా భారీగా ఆకర్షించింది. ఆ తర్వాత జియాంగ్ జెమిన్, హు జింటావో వంటి నాయకులు చైనా దేశీయ ఆర్థిక వ్యవస్థలో మార్కెట్‌ను సత్వర ప్రాతిపదికపై విస్తరించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచారు. జీ జిన్‌పింగ్ ఈ వారసత్వాన్ని గడచిన పదేళ్ళలో మరింత ముందుకు తీసుకువెళ్ళి ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారు. చైనా దేశాన్ని ప్రపంచంలో రెండవ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టారు.జిన్‌పింగ్ వద్ద చైనా కమ్యూనిస్టుపార్టీ స్కూలో 15 సంత్సరాలపాటు పనిచేసిన ప్రొఫెసర్ కై గ్జియా మాట్లాడుతూ, జిన్‌పింగ్ ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడు సెంట్రల్ పార్టీ స్కూలుకు ఆయనే నాయకత్వం వహించి నడిపించారన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను కార్యకర్తలకు బోధించారని చెప్పారు. తొలుత చేసిన కొన్ని సంస్కరణలు విఫలమైనప్పటికీ జిన్‌పింగ్ మాత్రం సంస్కరణల అమలులో విజేతగా నిలిచారని అన్నారు.
అంతర్జాతీయ సహకారానికి
బిఆర్‌ఐ కీలక వేదికఃవాంగ్
దేశాలమధ్య సహకారానికి చైనా ప్రతిపాదించిన బిఆర్‌ఐ (బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్) అంత్యత కీలకమైన వేదికగా ఉంటుందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ అన్నారు. ఈ బిఆర్‌ఐకి ఇప్పటికే అంతర్జాతీయంగా అనేక దేశాలు హర్షం ప్రకటించాయన్నారు.భౌగోళిక,ప్రాదేశిక రాజకాయాలు చేసే కాలం చెల్లిన ఆలోచనాదృక్పథాలను ఈ బిఆర్‌ఐ సరికొత్త నమూనా అంతర్జాతీయ సహకారానికి తెరతీస్తుందన్నారు. బిఆర్‌ఐలో భాగస్వామ్యంగా ఉన్న దేశాలతో చైనా చేస్తున్న వస్తు వాణిజ్యం ఆగస్టు నాటికి 12 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని, అదేవిధంగా ఈ దేశాలలో ఆర్థికేతర ప్రత్యక్ష పెట్టుబడులు కూడా 140 బిలియన్ డాలర్లు దాటిపోయిందని, ఈ దేశాలలో ఆర్థిక, వాణిజ్య సహకార మండళ్ళ నిర్మాణాలకు చేసిన పెట్టుబడులు కూడా 43 బిలియన్ డాలర్లు దాటిపోయాయని వాంగ్ చెప్పారు.
మార్కిజం పునాదులపై తొలి ఆధునిక సోషలిస్టు దేశంగా చైనా
RELATED ARTICLES