HomeNewsBreaking Newsమాపై అణుదాడికి అమెరికా కుట్ర

మాపై అణుదాడికి అమెరికా కుట్ర

మూడో ప్రపంచ యుద్ధం వస్తే విధ్వంసమే
రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌
మాస్కో: ఉక్రేన్‌పై అణు యుద్ధానికి దిగే ఆలోచనేదీ లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ స్పష్టం చేశారు. ఏ క్షణమైన ఉక్రేన్‌పై రష్యా అణ్వాయుధాలను ప్రయోగిస్తుందంటూ పశ్చిమ దేశాలు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నిజానికి రష్యాపై అణుదాడికి అమెరికా కుట్రపన్నుతున్నదని ఆయన ఆరోపించారు. ఐరోపా మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అందుకే ఉక్రేన్‌కు మద్దతునిస్తున్నదని అన్నా రు. అణు యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని లావ్రోవ్‌ అన్నారు. నిజానికి అమెరికానే అణు యుద్ధానికి సంసిద్ధమవుతున్నదని ధ్వజమెత్తారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే, అది అణుయుద్ధంగా మారుతుందని, కానీ, ఆ పరిస్థితిని తాము కల్పించబోమని లావ్రోవ్‌ పేర్కొన్నారు. ‘పశ్చిమ దేశాల నేతల మెదళ్లలో అణుయుద్ధం ఆలోచన ఉంది. మాకు కాదు’ అని విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ఆయన తెలిపారు. పశ్చిమ దేశాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారానికి, రష్యాను ఏకాకిగా చేసే ప్రయత్నాలకు జంకేది లేదని తేల్చిచెప్పారు. ఉక్రేన్‌ ప్రభుత్వం నియో-నాజీల తరహాలో వ్యవహరిస్తోందన్నారు. పట్టణాలు, నగరాల్లో లూటీలకు పాల్పడుతున్నట్లు లావ్రోవ్‌ ఆరోపించారు. సాధారణ పౌరులను కవచాల తరహాలో ఉక్రేనియన్లు వాడుతున్నట్లు ఆయన విమర్శించారు. ఆంక్షలతోనే మూడవ ప్రపంచ యుద్ధానికి దిగుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. ఒకవేళ మూడో ప్రపంచ యుద్దమే జరిగితే, అది అణు యుద్ధమవుతుందని హెచ్చరించారు. దాని వల్ల భారీ విధ్వంసం తప్పదని అన్నారు. . అణు యుద్ధం చేయాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని చెప్పారు. తమకు అలాంటి ఆలోచన ఏదీ లేదన్నారు. రష్యాపై దాడులకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతోనే పశ్చిమ దేశాల భద్రతను నాటో పెంచుతున్నదని లావ్రోవ్‌ ఆరోపించారు. నెపోలియన్‌, హిట్లర్‌ తరహాలో అమెరికా ప్రవర్తిస్తోందన్నారు. గతంలోయూరోప్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని నెపోలియన్లు, హిట్లర్లు భావించారని, ఇప్పుడు అమెరికన్లు కూడా అదే చేస్తున్నారని లావ్రోవ్‌ ఆరోపించారు. నార్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌లైన్లను రద్దు చేయడమే అమెరికా నిజస్వరూపాన్ని బయటపెట్టిందని వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాలు రాసిన సినిమా స్క్రీన్‌ప్లేను ఉక్రేన్‌ అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. చర్చలకు తాము సిద్ధమని లావ్రోవ్‌ దునరుద్ఘాటించారు. రెండో విడత చర్చలకు ఉక్రేన్‌ సుముఖత వ్యక్తం చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. రష్యా చాలా పరిమితమైన డిమాండ్లు చేస్తున్నదని అన్నారు. బుధవారం రెండు దేశాల ప్రతినిధుల బృందాల మధ్య చర్చలు జరుగుతాయన్న వార్తలు వెలువడినప్పటికీ, ఉక్రేన్‌ ప్రతినిధులు హాజరుకాలేదని తెలుస్తోంది. అయితే, ఆ సమావేశం ఎందుకు చోటు చేసుకోలేదనేది అటు రష్యాగానీ, ఇటు ఉక్రేన్‌గానీ ప్రకటించలేదు. గత ఆదివారం జరిగిన మొదటి విడత చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించలేకపోయిన విషయం తెలిసిందే. దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్న ఉక్రేన్‌, నాటో కూటమిలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలన్న రష్యా ప్రతిపాదనపై స్పందించడం లేదు. ఫలితంగా తొలి విడత చర్చలు ఫలప్రదం కాలేదు. రెండో విడత చర్చలపై యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇలావుంటే, ఖేర్సన్‌ నగరంపై రష్యా హస్తగతం చేసుకున్నట్టు ఉక్రేన్‌ ధ్రువీకరించింది. రష్యా సేనలు కీవ్‌ దిశగా వస్తున్నాయని, కాబట్టి, కీవ్‌తోపాటు కీవ్‌ ఒబ్లాస్ట్‌, లవీవ్‌, మైకొలివ్‌, చెర్నిహివ్‌, ఒడెసా తదితర ప్రాంతాల్లో వైమానిక దాడులు జరగవచ్చని ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరింది. రష్యాకు చెందిన సుఖోయ్‌ విమానాన్న ఇర్పిన్‌ ప్రాంతంలో కూల్చివేసినట్టు ఉక్రేన్‌ రక్షణ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ తొమ్మిదివేల మంది రష్యా సైనికులను హతమార్చినట్టు తెలిపింది. మరోవైపు ఖర్కివ్‌పై దాడుల ఉధృతిని రష్యా పెంచింది. క్షిపణులు, ఫిరంగులను ప్రయోగిస్తున్నది. ఈ సైనిక చర్యలో ఇప్పటి వరకూ 498 మంది సైనికులను కోల్పోయినట్టు రష్యా ప్రకటించింది. 2,870 మంది ఉక్రేన్‌ సైనికులు, మద్దతుదారుల హతమైనట్టు తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments