దేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేసిన కేరళ ప్రజలు
గ్రామ గ్రామానా గ్రంథాలయం ఆ రాష్ట్ర గొప్పతనం
ముఖ్యమంత్రి, గవర్నర్ వివేకవంతులైన పాలకులు
రాష్ట్రపతి ప్రశంసల జల్లు
తిరువనంతపురం : అనేక విషయాలకు సంబంధించిన మానవాభివృద్ధి సూచికలు, గణాంకాల్లో దేశంలోని అన్ని ఇతర రాష్ట్రాలకూ కేరళ రాష్ట్రమే ఆదర్శంగా, మార్గదర్శకంగా సారథ్యం వహస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. కేరళలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజైన గురువారంనాడు రాష్ట్రపతి, కేరళకు చెందిన ప్రముఖ సాహిత్యవేత్త, గ్రంథాలయోద్యమ పిత పి ఎన్ పనిక్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధాని నగరం తిరువనంతపురంలోని పూజాప్పుర వద్ద ఆవిష్కరించారు. దేశంలోని అని రాష్ట్రాలలోకంటే కేరళ ఆర్థికంగా సుస్థిరమైన వృద్ధిని, అభివృద్ధిని సాధిస్తోందన్నారు. కేరళలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సుస్థిరమైన అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నాయన్నారు. పనిక్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం ఆద్యంతం కేరళపై ప్రశంసల జల్లులు కురిపిస్తూనే కొనసాగింది. రాష్టంలోని ప్రతి గ్రామంలోనూ ఒక గ్రంథాలయం ఉండటం కేరళ రాష్ట్ర విభిన్నమైన ప్రత్యేకతగా ఆయన అభివర్ణించారు. ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ నివసించే ప్రజలు గ్రంథాలయంతో ఎంతో భావోద్వేగపూరితమైన అనుబంధం కలిగి ఉంటారని ఆయన ప్రశంసించారు. ఎంతో సూక్ష్మబుద్ధి, వివేకంగల ఎంతో గొప్ప అనుభవజులైన వ్యక్తులు కేరళ ప్రభుత్వంలో ప్రజాసేవకులుగా ఉన్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌లపై ప్రశంసలు కురిపించారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ లాంటి గొప్ప వ్యక్తుల మార్గదర్శకంలో కేరళ ప్రజలు తగినస్థాయిలో ప్రయోజనం పొందుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను సమ్మిళితం చేసుకుని అత్యున్నతస్థాయిలో ఆయన ముందుకు వెళుతున్నారన్నారు. కేరళనుండి వచ్చి సేవా రంగంలో పనిచేస్తున్న ఎంతోమంది వృత్తి నిపుణులను ఆయన వేనోళ్ళ కీర్తించారు. ప్రత్యేకించి కేరళ రాష్ట్రం నుండి వైద్యరంగంలో నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో గొప్ప సేవలు అందిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో కేరళ నుండి వచ్చిన నర్సులు, వైద్యులపట్ల ఎంతో విశ్వసనీయత కలిగి ఉంటారని, వైద్య సేవలకోసం వారిపై ఆధారపడి ఉంటారని, వారిపట్ల గొప్ప గౌరవభావం చూపిస్తారని అన్నారు. ఇటీవలనే యావత్ ప్రపంచ దేశాలూ కరోనా బారిన పడ్డాయని, కేరళకు చెందిన నర్సులు, వైద్యులు దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అగ్రభాగాన నిలబడి వీరోచితమైన పోరాటం చేసి రోగులకు గొప్ప సేవలు అదించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. మధ్యాసియా దేశాలతోసహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కేరళ, నర్సులు, వైద్యులు వైద్య రంగంలో గొప్ప సేవలు అందిస్తున్నారన్నారు. భారతదేశ గౌరవ ప్రతిష్టలను నిలబెట్టిన ఘనత కేరళ రాష్ట్ర ప్రజలకే దక్కుతుందని ఆయన అన్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్, కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ల సమక్షంలో తొలుత రాష్ట్రపతి కోవింద్ కేరళకు చెందిన 1909 జీవించిన ప్రముఖ గ్రంథాలయోద్యమ పిత పుథువాయిల్ నారాయణ పనిక్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేరళలో ప్రతి ఏడాది పనిక్కర్ వర్థంతి సందర్భంగా జూన్ 19 నాడు పఠన దినోత్సవం (వాయనదినం)గా పాటిస్తారు. జూన్ 19 నుండి 25 వరకు కేరళ ప్రభుత్వ విద్యాశాఖ రాష్ట్రంలో పఠన వారోత్సవం నిర్వహిస్తుంది.
1990లో పనిక్కర్ కేరళలో అక్షరోద్యమం ప్రారంభించారు. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది.2017లో ఈ స్ఫూర్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 19వ తేదీని జాతీయ పఠన దినోత్సవంగా ప్రకటించారు. పనిక్కర్ జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం 2004లో ఒక తపాలా బిళ్ళను కూడా విడుదల చేసింది. కేరళలో పనిక్కర్ ప్రారంభించిన కేరళ గ్రంథశాల సంగమం కార్యకలాపాలు ఆ రాష్ట్రంలో గొప్ప సాంస్కృతిక ఉద్యమంగా విలసిల్లింది. 32 ఏళ్ళపాటు ఆయన కేరళ గ్రంథశాల సంగమానికి నాయకత్వవం వహించారు.యునెస్కో కృప్సకయ అవార్డు ఆయనకు లభించింది. పనిక్కర్ గ్రంథాలయోద్యమాన్ని కేరళలో ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమంగా తీర్చిదిద్దారని ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ నివాళులు అర్పించారు. కేరళలోని ప్రతి మారుమూల గ్రామంలోనూ ఒక గ్రంథాలయం ఉండటం, ప్రజలు గ్రంథాలయంతో గొప్ప మానసిక అనుబంధాన్ని కలిగి ఉండటం వారి పరిణతికి చిహ్నమని కొనియాడారు.1945లో పనిక్కర్ 50 చిన్న గ్రంథాలయాలతో గ్రంథశాల సంగం ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. శ్రీనారాయణ గురు, అయ్యంకలి, విటి భట్టాతిరిపడ్ వంటి గొప్ప గురువుల భావాలను కేరళ పుణికిపుచ్చుకుందన్నారు. ఈ భావజాలాన్ని సామాన్య ప్రజలు తెలుసుకునేలా పనిక్కర్ గొప్ప సేవలు అందించారన్నారు. మానవాభివృద్ధి సూచికలలో కేరళ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆలంబనగా, మార్గదర్శకంగా ఉందన్నారు. అక్షరజ్ఞానోద్యమం అంథకారం నుండి మనిషిని బయటకు తెస్తుందని, ప్రతి వ్యక్తినీ ప్రగతివైపు నడిపిస్తుందని, పనిక్కర్ కేరళలో ఈ ఉద్యమం ద్వారా ఒక దారిదీపంగా నిలిచి ప్రజలకు మార్గదర్శనం చేశారని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. కేరళ అనేక రంగాలలో నాయకత్వ స్థానాన్ని ఆక్రమించిందని ఆయన అన్నారు.
ఈనాడు ఆవిష్కరించిన పనిక్కర్ విగ్రహం కేవలం ఆయన స్ఫూర్తినే కాకుండా, ఆయన గ్రంథాలయోద్యమానికి, అక్షరాస్యతా ఉద్యమానికి చేసిన సేవలను ప్రతిబింబిస్తుందని, కేరళ దేశంలోనే అంత్యంత విద్యాధికుల రాష్ట్రంగా దేశంలో అగ్రభాగాన ఉండేలా ఈ ఉద్యమం తీర్చిదిద్దిందన్నారు. 50 గ్రంథాలయాలతో ఆయన ప్రారంభించిన ఉద్యమం 6000 గ్రంథాలయాల స్థాయికి విస్తరించిందని కొనియాడారు. అందుకే ఆయనకు గౌరవ సూచకంగా ప్రతి ఏడాదీ కేరళ ప్రభుత్వం జూన్ 19వ తేదీన పఠన దినోత్సవం పాటిస్తోందన్నారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి
గ్రంథాలయోద్యమం దోహదంఃవిజయన్
పి ఎన్ పనిక్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించిన సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, కేరళ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గ్రంథాలయోద్యమం ఎంతో గొప్పగా దోహదపడిందని ఆయన అన్నారు. గ్రంథాలయోద్యమమే కేరళ అభ్యున్నతికి కారణమన్నారు. కానీ కొన్ని శక్తులు మూఢనమ్మకాలతో , హేతుబద్ధం కాని నమ్మకాలతో రాష్ట్రాన్ని వెనక్కు లాగాలని ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. మన కేరళ సమాజ అభివృద్ధికి, ప్రగతికి దోహదం చేసింది ఈ గ్రంథాలయాలే అని ఆయన అన్నారు. సమానత్వ సాధన, సౌభ్రాతృత్వం ఇవన్నీ ప్రగతిశీల అధ్యయనాలతోనే సాధమ్యని చెప్పారు. ఈ భావాలు మన జాతీయ ఉద్యమానికి దోహదం చేస్తుందని, జాతి పునర్నిర్మాణానికి దోహదం చేస్తుందని అన్నారు. పనిక్కర్ చేసిన జీవితకాల కృషిని పినరయి విజయన్ కొనియాడాతూ, ఆయన చేసిన సేవలవల్ల గ్రామ గ్రామానా గ్రంథాలయాలు ఏర్పడటానికి దారితీశాయన్నారు. కేరళలను ఒక సాహిత్య సమాజంగా తీర్చిదిద్దడానికి ఈ గ్రంథాలయాలు దోహదం చేశాయని అన్నారు. కాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం రాత్రి కేరళలోని రాజ్‌భవన్‌లోనే విశ్రాంతి తీసుకుని శుక్రవారం ఉదయం భారత వైమానిక దళం వారి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళతారు.
మానవాభివృద్ధి సూచికల్లో కేరళ రాష్ట్రమే దేశానికి మార్గదర్శకం
RELATED ARTICLES