సాగు చట్టాల రద్దుకు వంద రోజులుగా పోరాటం చేస్తున్నా నిర్లక్ష్యం
కేంద్ర ప్రభుత్వంపై ఎఐకెఎస్‌సిసి ధ్వజం
రైతు ఉద్యమాన్ని చీల్చడానికి, అణగదొక్కడానికి పాలకుల కుట్ర : పశ్య పద్మ
గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ‘మానవహారం’
ప్రజాపక్షం / హైదరాబాద్ రైతు వ్యతిరేక కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చే యాలని వంద రోజులుగా దేశ రైతాంగం పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పశ్య పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరలు గ్యారెంటీగా లభించేలా చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఎఐకెఎస్‌సిసి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద శనివారం ‘మానవహారం’ నిర్మించారు. నల్ల రిబ్బన్లు, నల్ల జెండాలు చేబూని కేంద్ర పాలకుల మొండివైఖరిని నిరసించారు. ఈ సందర్భంగా పశ్యపద్మ మాట్లాడుతూ రైతు ఉద్యమాన్ని చీల్చడానికి, అణగదొక్కడానికి పాలకులు పూనుకుంటున్నారని విమర్శించారు. ఒక వెయ్యి రూపాయల తక్కువ ధరకు రైతులు తమ పంటను అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పంటలను కొనుగోలు చేయబోమని సిఎం కెసిఆర్ చెప్పడం ద్వారా కార్పొరేట్ అనుకూల చట్టాలు ఏమిటో ఆచరణలో రైతులకు అర్థమవుతుందన్నారు. చరిత్రలో ఉప్పు పండించే రైతుల కోసం దండి సత్యాగ్రహం చేసిన మహాత్మా గాంధీ విజయం సాధించారని గుర్తు చేశారు. రైతులు పండించే పంటల సాగుకు అయ్యే ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని డాక్టర్ స్వామినాథన్ కమిటీ 2007 సంవత్సరంలో చేసిన సూచనల ప్రకారం మద్దతు ధరల చట్టం తీసుకురావాలని పశ్యపద్మ డిమాండ్ చేశారు. ఎఐకెఎస్‌సిసి రాష్ట్ర కన్వీనర్ టి.సాగర్ మాట్లాడుతూ అనేక మంది రైతులు ఉద్యమంలో చనిపోయారని, ఇందుకు కేంద్ర పాలకులే బాధ్యత వహించాలన్నారు. కేరళ తరహా రుణ విముక్తి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎఐకెఎస్‌సిసి రాష్ట్ర కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం చరిత్రాత్మకమైనదన్నారు. వ్యవసాయ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే ఈ చట్టాల ఉద్దేశమన్నారు. ఇప్పటికే పంటలకు ధరలు పూర్తిగా పడిపోతున్నాయని, ఈ చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ నంద్యాల నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం నాయకులు పి.రామకష్ణారెడ్డి, తోకల రామ్‌రెడ్డి, సంధ్యారాణి, చంద్రయ్య, రాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట అధ్యక్షులు కె.కాంతయ్య, బిసి హక్కుల సాధన సంఘం నాయకులు ఆర్.పాండు రంగాచారి, తెలంగాణ రైతు సంఘం రాష్ర్ట అధ్యక్షులు జంగారెడ్డి, ఐద్వా నాయకులు లక్ష్మి, ఐఎఫ్‌టియు నాయకులు కిరణ్, తెలంగాణ రైతు సంఘం నాయకులు వెంకటయ్య, సాయన్న, రైతు సంఘం, వ్యవసాయ, కార్మిక, మహిళ, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మానవహారం… నిరసన గళం…
RELATED ARTICLES